సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న విద్యుత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సౌర విద్యుదుత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ దిశగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే పథకం చిరస్థాయిగా నిలవాలన్నారు.
ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడి..
రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటి సామర్థ్యం 120 లక్షల హార్స్‌పవర్ (హెచ్‌పీ) ఉంటుంది. ఒక హెచ్‌పీకి 1,240 యూనిట్ల విద్యుత్ ఏటా ఖర్చవుతోంది. ఈ లెక్కన ఏటా 13 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వ్యవసాయానికి అవసరమవుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.8 వేల కోట్ల సబ్సిడీ చెల్లిస్తోంది. ఇలా కాకుండా ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రూ. 32 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయడానికి మరో రూ.4 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడిగా భావిస్తే ఆ తర్వాత ఉచితంగానే డిస్కమ్‌లకు విద్యుత్ అందినట్టే కదా? అని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
50 వేల ఎకరాల లభ్యత
రాయలసీమలో సౌర విద్యుదుత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని నెడ్‌క్యాప్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భూమి లభ్యత కూడా తగినంత ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ప్రకాశం జిల్లాలో 6 వేల ప్రభుత్వ భూమి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైందని తేల్చారు. మిగతా ప్రైవేటు భూమిని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో సేకరించే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. అక్కడ భూమి కూడా చౌకగా లభిస్తుందని చెప్పారు. ఇలా మొత్తం 50 వేల ఎకరాలు సోలార్ ప్లాంట్ల కోసం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు బ్రహ్మంసాగర్, గండి, మైలవరం రిజర్వాయర్లలో నీటిపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించామని జెన్‌కో అధికారి తెలిపారు.
చౌకగా విద్యుత్
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే వీలుందని జెన్‌కో డైరెక్టర్ ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 32 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడిస్తున్న విద్యుత్ ఖరీదు యూనిట్ రూ. 5.40 వరకు ఉంటోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. సోలార్ విద్యుదుత్పత్తి ధర యూనిట్ రూ. 4.20 మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు. పదేళ్లలో పెట్టుబడి మొత్తం రాబట్టే వీలుందని, మరో 15 ఏళ్లు చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అధ్యయనం పూర్తి
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్), ఏపీ జెన్‌కో నివేదిక రూపకల్పనపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ రెండు విభాగాలు ఇప్పటికే అనేక ప్రాంతాలను పరిశీలించి సానుకూల అంశాలను గుర్తించాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారి తెలిపారు. దీనిద్వారా ప్రాజెక్టు కోసం రుణాన్ని పొందే వీలుందని వివరించారు. అయితే పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వం సమకూర్చే ఆలోచన కూడా పరిశీలనలో ఉందన్నారు.
సౌరశక్తి రైతులకు వరం
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజుల్లో ఈ పథకంపై పూర్తి స్పష్టత వస్తుంది. సోలార్ ద్వారా రైతులకు పగటిపూట విద్యుత్ ఇబ్బంది లేకుండా అందించవచ్చు. సౌర విద్యుత్తు రైతులకు వరం లాంటిది.
– శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి
మంచి ఫలితాలిస్తుంది
సౌర విద్యుదుత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయి. వ్యవసాయానికి అనుకూలం కాని ప్రాంతాల్లో భూమిని సోలార్ విద్యుదుత్పత్తి కోసం ఇవ్వడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. లీజుకు తీసుకున్నా, కొనుగోలు చేసినా సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం పెద్దగా పెరగదు.
– రమణారెడ్డి నెడ్‌క్యాప్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment