సడన్ బ్రేక్ ప్రాణం తీసింది..
దమ్మపేట: రోడ్డుపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ఓ లారీ డ్రైవర్ ప్రాణాలను బలి తీసుకున్నాయి. స్పీడ్ బ్రేకర్లను ముందుగా గమనించని డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో లారీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకొచ్చి తగలడంతో అతడి శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి రైల్వే ట్రాక్ పట్టాల లోడ్‌తో ట్రాలీ లారీ తమిళనాడులోని తిరుచనాపల్లికి వెళుతోంది. లారీని మధ్యప్రదేశ్‌కు చెందిన కాకు(36) నడుపుతుండగా, ఆకాష్ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. దమ్మపేట మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లను గమనించని కాకు.. అక్కడికి రాగానే సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాలీలో ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు కేబిన్‌లోకి దూసుకురాగా లారీ ఒక పక్కకు పడిపోయింది.పట్టాలు డ్రైవర్‌పై పడడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం కేబిన్‌లో ఇరుక్కుపోయింది. క్లీనర్ మాత్రం కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్సై సాయికిశోర్‌రెడ్డి నాలుగు జేసీబీలతో రెండు గంటల పాటు శ్రమించి పట్టాలను, డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.