ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది.
అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది.
డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం.
ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది.
మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే.
నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో?
రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు.
విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి.
మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా?