భారీగా పుంజుకున్న రూపాయి
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడ్ నిర్ణయంతో దేశీయ కరెన్సీ భారీగా పుంజుకుంది. ఆరంభంలో డాలరుతో పోలిస్తే రూపాయి బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 18పైసలు లాభంతో 66.85 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆలోచనను మరోసారి వాయిదా వేయడంతో డాలర్ బలహీనపడిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సానుకూల ప్రభావంతో రూపాయి డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఎగుమతిదారులు బ్యాంకుల డాలర్ అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు.
మరోవైపు ఫెడ్ జోష్‌తో బ్యాంకింగ్ సెక్టార్ లో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.2 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.6 శాతానికి పైగా లాభపడింది. పీఎన్బీ, బీవోఐ, బీవోబీ, స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ, ఓబీసీ లతో పాటు ప్రయివేటు బ్యాంకుల హవా సాగుతోంది. ఐసీఐసీఐ, కెనరా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లవైపు అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్ల ఆసక్తి కనపడుతోంది.
యథాతథ పాలసీ అమలుకే ఫెడ్ కట్టుబడటంతో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ నేలచూపులు చూస్తోంది. మరోవైపు బుధవారం బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా నెగిటివ్ ఇంట్రెస్ట్ రేటుతో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే.