గౌతమ్ కార్తీక్‌తో శ్రద్ధాశ్రీకాంత్ రొమాన్స్
కథానాయికలకు పుట్టినిల్లుగా మారిన కేరళ రాష్ట్రం నుంచి మరో నాయకి కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. ఆమె పేరు శ్రద్ధాశ్రీకాంత్. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే యూటర్న్ చిత్రంలో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్‌లో యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోంది. కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ వారసుడన్న విషయం తెలిసిందే.
మణిరత్నం చిత్రం కడల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్ కార్తీక్‌కు ఆ చిత్రం చాలా నిరాశ పరచిందన్నది తెలిసిందే. ఆ తరువాత నటించిన ఎన్నమో ఏదో చిత్రం ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గౌతమ్‌కార్తీక్ తాజాగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఆయనకు జంటగా శ్రద్ధాశ్రీకాంత్ను నాయకిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ఇవన్ తందిరన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు వెల్లడించారు.
అభిరా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆషాశ్రీ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్.కన్నన్ తెలుపుతూ ఇది ప్రేమ, యాక్షన్ అంశాలు కలిపిన జనరంజక కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో హీరో, హీరోయన్లతో పాటు వర్షం ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకే ఇంతకు ముందే ప్రారంభించాల్సిన షూటింగ్‌ను వర్షం సీజన్ కోసం అక్టోబర్, నవంబర్‌లో షూటింగ్ నిర్వహించాలని ఎనిమిది నెలలు వేచి ఉన్నామన్నారు. ఈ నెల 12న చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. హీరోగా గౌతమ్ కార్తీక్‌ను అనుకున్న తరువాత హీరోయిన్ కోసం చాలా మందిని పరిశీలించామన్నారు. వారిలో ఒక్కరూ సెట్ కాకపోవడంతో మలయాళ చిత్రం యూటర్న్ నాయకి శ్రద్ధాశ్రీకాంత్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.