సుద్దాల కలం చెక్కిన ‘శ్రమ కావ్యం’
అనంతపురం సిటీ : మనిషి పరిణామ క్రమంలో శ్రమ పాత్రను గుర్తిస్తూ ప్రముఖ సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రమ కావ్యం’ నేటి తరం యువతను ఆలోచింపజేస్తుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ‘శ్రమ కావ్యం’ పుస్తకావిష్కరణ సభను చీఫ్ విప్ కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి కవి తూమచర్ల రాజారాం అధ్యక్షత వహించగా ముఖ్య అథితులుగా సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల ఆశోక్‌తేజ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా పరిషత్ చైర్మఽన్ చమన్, సీఈఓ రామచంద్ర, ప్రముఖ కవులు అధికార భాషా సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, ప్రజా గాయకులు లెనిన్‌బాబు, మల్లెల నరసింహులు హాజరయ్యారు.
ప్రారంభోత్సవంలో లెనిన్‌బాబు అలరించిన ‘నేలమ్మ నేలమ్మ.. నేలమ్మా.. నీకు వేల వేల వందనాలమ్మా..’ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సమాజ హితాన్ని కోరుతూ పుస్తక రచన చేసే వారి సంఖ్య చాలా తక్కువన్నారు. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్‌తేజ ‘శ్రమ కావ్యం’ వంటి పుస్తకాలు రచించడం హర్షించదగ్గ విషయమన్నారు.
అనంతరం సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. కరువు నేలపై మనిషి మనుగడ, కులవృత్తులు, మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి కదలిక, కలయిక, కష్టంపై ఈ కావ్యాన్ని రాశానన్నారు. ఎక్కువగా నన్ను అభిమానించే వ్యక్తుల మధ్య ఈ పుస్తకావిష్కరణ జరుపుకోవాలని భావించానని చెప్పారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు. తనపై అనంత వాసులు చూపిన.. చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కవులు, రచయితల సంఘం నేతలు, నగర ప్రముఖులు, పలు పార్టీల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు.