SREI Infrastructure Finance
-
బజాజ్ హెల్త్‌కేర్- శ్రేఈ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ బజాజ్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో నష్టాల నుంచి బయటపడి లాభాలు ఆర్జించడంతో ఎన్బీఎఫ్సీ.. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ హెల్త్‌కేర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బజాజ్ హెల్త్‌కేర్ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ. 15 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ. 140 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.5 శాతం మెరుగుపడి 18.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో బజాజ్ హెల్త్‌కేర్ షేరు బీఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 498ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ట్రేడవుతోంది. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 69 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1561 కోట్ల నుంచి రూ. 1214 కోట్లకు క్షీణించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 44,213 కోట్లకు చేరింది. ఫలితాల ప్రభావంతో శ్రేఈ ఇన్ఫ్రా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతం దూసుకెళ్లింది. రూ. 7.90ను తాకింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 7.70 వద్ద ట్రేడవుతోంది. -
ఈక్విటీగా డీసీ రుణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) వాటిని తీర్చడానికి ఈక్విటీ మార్గాన్ని ఎంచుకుంది. శ్రేయి ఇన్ఫ్రా నుంచి తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియను చర్చించడానికి ముగ్గురు డెరైక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద శ్రేయి ఇన్‌ఫ్రాకి షేర్లను కేటాయిస్తామని, కానీ దీనికి సంబంధించిన ఒప్పందాలు, తుది అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది. కానీ తీసుకున్న రుణం విలువను మాత్రం డీసీహెచ్ఎల్ తెలియచేయలేదు. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రూ.220 కోట్లు స్వల్ప కాలిక రుణం ఇచ్చినట్లు గతంలో తెలిపారు. రుణాన్ని ఈక్విటీగా మార్చమని శ్రేయి ఇన్ఫ్రా నుంచి వచ్చిన ప్రతిపాదనను బోర్డు పరిగణనలోకి తీసుకొని ముగ్గురు డెరైక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. డిసెంబర్, 2013 నాటికి డీసీహెచ్ఎల్లో ప్రమోటర్ల వాటా 32.66 శాతంగా ఉండగా, డీఐఐల వాటా స్వల్పంగా తగ్గి 8.17 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఇతర షేర్‌హోల్డర్ల వాటా స్వల్పంగా పెరిగి 59.10 శాతానికి చేరింది. ఆడిట్ కమిటీ సిఫార్సుల మేరకు జాయింట్ ఆడిటర్‌ను నిమమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆడిటర్ ఎంపిక బాధ్యతను ముగ్గురు డెరైక్టర్ల కమిటీకి అప్పజెప్పింది. ఇందుకోసం దేశంలోని ఆరు ప్రధాన ఆడిటింగ్ సంస్థలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.3.74 వద్ద ముగిసింది.