సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు
విజయవాడ : చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత పుట్టిన రోజు అయిన వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మహామండపంలోని యాగశాలలో ఆలయ అధికారులు ఉదయం 8 గంటలకు సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. చిన్నారులకు అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు అమ్మవారి చెంత పూజలు చేసిన శక్తి కంకణాలను, పెన్నులను విద్యార్థులకు అందజేస్తున్నారు. అంతరాలయం, మహామండపం 6వ అంతస్తుల్లోని ఉత్సవమూర్తిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో వసంతి పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, మహాహారతి చేపట్టారు. ఇవాళ అమ్మవారికి చండీహవనం, వేదపారాయణం, మహాపూజ కార్యక్రమాలతో పాటు సాయంత్రం అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు ఆలయానికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
హైదరాబాద్ : నల్లకుంటలోని శంకరమఠం, శ్రీ సీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో బుధవారం ఉదయం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంకరమఠంలో శారదాంబ అమ్మవారు జ్ఞాన సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. న్యూనల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో 108 కలశాల ఆవుపాలతో జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
విజయనగరం : విజయనగరం రింగు రోడ్డులో గల జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు.