Sri Krishnashtami
-
రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. -
కృష్ణా...ముకుందా...మురారి
కడప కల్చరల్: శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం కడప నగరం ద్వారకానగర్‌లోని శ్రీ మురళీకృష్ణాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం ఈ సందర్భంగా మూలమూర్తికి విశేష అభిషేకాలు, అనంతరం కనుల పండువగా అలంకారం చేశారు. ఆలయం నిర్వాహకులు రామమునిరెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులందరికీ నిబంధనల మేరకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధ్యాన మందిరంలో ఉత్పవమూర్తిని నిలిపి ఆయనతోపాటు గణపతి సచ్చిదానంద స్వామి మూర్తికి కూడా పూజలు చేశారు. రాయచోటి రైల్వేగేటు వద్దగల శ్రీకృష్ణాలయంలో కూడా కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. కృష్ణయ్యకు పూజలు కడప నగర సమీపంలోని అప్పరాజుపల్లె గ్రామంలో గురువారం కృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ అమర్నాథ్ యాదవ్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. రేపు కృష్ణాష్టమి పూజలు కడప నగరం గడ్డిబజారులోని శ్రీ లక్ష్మి సత్యానారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ్‌భట్టర్ తెలిపారు. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శనివారం పంచారాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సందడి కృష్ణాష్టమి ముందస్తు వేడుకల్లో భాగంగా కడప నగరానికి చెందిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో గురువారం రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారులను రిమ్స్ వైద్యులు అర్చన అభినందించారు. అనంతరం చిన్ని కృష్ణులతో కృష్ణయ్యకు ప్రార్థనలు నిర్వహించారు. భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు స్వీట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ హరికృష్ణ, సిబ్బంది సరస్వతి, సంధ్యారెడ్డి, వైశాలి, లక్ష్మిదేవి, భార్గవి, మేరి, పీఈటీ జయచంద్ర, జవహర్, లక్ష్మయ్య, శంకర్ పాల్గొన్నారు. దీంతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. అలరించిన నృత్యాలు కడప కల్చరల్ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్థానిక ద్వారకానగర్లోగల శ్రీ మురళీ కృష్ణాలయం ప్రాంగణంలో పలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప స్పందన డాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్నావ.. యశోదమ్మ, భరత వేదమున, జయజయహే మహిశాసుర మర్ధిని వంటి నృత్యాలు అలరించాయి. ప్రజలు కరతాళ ధ్వనులతో చిన్నారులను ప్రోత్సహించారు. ముద్దులొలికే చిన్నికృష్ణయ్యలు శ్రీకృష్ణాష్టమి సందర్బంగా చిన్నారులు ఉన్న ఇళ్లలో చిన్ని కృష్ణయ్యలుగా దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారి పాపలకు చిన్నారి కృష్ణయ్య వేషాలను ధరింపజేసి తమ కంటి పాపల నిండుగా తనివి తీరాచూసుకుని మురిసిపోతున్నారు. పనిలో పనిగా గోపెమ్మలను కూడా సిద్ధం చేసి వెన్న తినిపించే ఘట్టాలను, ఉట్టికొట్టే ఘట్టాలను నిర్వహించి ముచ్చట తీర్చుకుంటున్నారు. పనిలో పనిగా మనోళ్లు మన జిల్లాకు మత సామరస్యంగా గల ఘనతను మరోమారు చాటారు. ఈ సందర్బంగా పలువురు ముస్లింలు కూడా తమ చిన్నారులకు కృష్ణుడి వేషాలు ధరింపజేసి మతాలకు అతీతంగా నిలిచి ఆనందాన్ని ఆస్వాదించారు. -
సీఎం వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీత.. సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినం. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం పేర్కొన్నారు. కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami — YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022 -
శ్రీకృష్ణాష్టమి సందర్బంగా భక్తి గీతం ఆలపించిన నంద్యాల ఎమ్మెల్యే సతీమణి
-
జగదాచార్యునికి వందనమ్
వసుదేవుని సుతుడు, కంసచాణూరులను మర్దించినవాడు, దేవకీదేవికి పరమానందం కలిగించినవాడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి వందనం.ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని, అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని దర్శించి, ‘తాతా! నీ మనుమలకు ధర్మబోధ చెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో భీష్మపితామహుడు, ‘జగన్నాటక సూత్రధారీ! చతుర్దశ భువనాలనూ సృష్టించి, పోషించి, లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను పాఠం చెప్పడమంటే, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చెప్పినట్లుంటుందయ్యా’ అన్నాడు. అలా భీష్ముడంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణుడిని ‘జగదాచార్యా!’ అని సంబోధించాడు. (ఉషశ్రీ భారతం నుంచి) జగద్గురువు, జగదోద్ధారకుడు, జగదాచార్యుడు, గీతాచార్యుడు... ఎన్ని నామాలతో స్మరించినా తనివి తీరదు. దశావతారాలలో శ్రీకృష్ణుడిని మాత్రమే సంపూర్ణావతారంగా, మిగిలిన అవతారాలను అంశావతారాలుగా వివరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయమ్... కృష్ణుడు స్వయంగా భగవంతుడు... అని శ్రీకృష్ణుని స్తుతించారు. కురుక్షేత్ర యుద్ధం కురుపాండవుల మధ్య జరిగింది. ఆవలి పక్షంలో ఉన్న కురు, గురు వృద్ధులను చూసిన అర్జునుడికి వైరాగ్యంతో చేతిలో గాండీవం జారిపోతోంది, నన్ను పెంచి పెద్ద చేసిన తాతలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సంహరించలేను, నేను యుద్ధం చేయలేను’ అన్నాడు. నవ్వురాజిల్లెడు మోముతో శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీత ప్రబోధించాడు. అర్జునుడు కర్తవ్యం తెలుసుకున్నాడు. చేసేవాడు, చేయించేవాడు అన్నీ ఆ పరమాత్ముడేనని అవగతం చేసుకున్నాడు. అంతే! గాండీవం అందుకున్నాడు. శత్రు సంహారం చేశాడు. లోకాలకు శాంతి చేకూర్చాడు. ఇదంతా అర్జునుడు చేసినది కాదు. జగద్గురువు శ్రీకృష్ణుడు నడిపించాడు. సాక్షాత్తూ పరమాత్ముడు భగవంతుడై, భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమానికి ఉపకరించేలా సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను ‘భగవద్గీత’ గా అందించి జగద్గురువయ్యాడు. శ్రీకృష్ణుని పేరులోనే ఆకర్షణ ఉంది. కర్షతి ఇతి కృష్ణ... ఆకర్షించేవాడని అర్థం. శ్రీకృష్ణునిలాగే, భగవద్గీత కూడా అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. మానవజాతిని శాసిస్తూనే ఉంటుంది. ఆ శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలిగాడు. గురువులకే గురువైన శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. మానవజాతికి మానవ ధర్మాలను బోధించిన సరళమైన సమగ్ర గ్రంథం. భక్తి జ్ఞాన వైరాగ్యాలను, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కార్యశీలతను కేవలం 700 శ్లోకాలలో చెప్పాడు. కాల ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఎక్కడైనా పనికొచ్చేలా మార్గనిర్దేశం చేశాడు. శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ మానవాళికీ ఆచరణయోగ్యంగా ఉంటాయి కనుకనే ఆయన జగద్గురువయ్యాడు. ‘మానవజాతికి పిరికితనం పనికిరాదు. హృదయ దౌర్బల్యాల వల్ల ఏమీ సాధించలేం’ అని ఉపదేశించాడు. ఒక పని చేసేటప్పుడు ఆందోళన పడకుండా, ఫలితం కోసం ఆశపడకుండా, పనిని శ్రద్ధగా ఆచరిస్తే సత్ఫలితాలొస్తాయని చెబుతూ, ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...’ అన్నాడు. ‘‘మనసులో చెలరేగే కోరికలను అక్కడే అణగదొక్కి ఆత్మయందే అన్నిటినీ అనుభవించగలవాడు స్థితప్రజ్ఞుడు. క్లేశాలకు కుంగడు, సుఖాలు మీదపడినా లొంగడు. భయం, క్రోధం, రాగం అనేవాటిని దరిచేరనివ్వడు’’ అన్నాడు. అత్యాశతో సమాజాన్ని పీడించకుండా, సుఖదుఃఖాలను సమానంగా భావించాలి... అంటూ అన్ని మతాలు, అన్నిప్రాంతాల వారికి సందేశం ఇచ్చాడు. అందువల్లే ఆయన జగద్గురువయ్యాడు. లోకంలో జనసామాన్యం తమ కంటె ఉత్తములైన వారినే అనుసరిస్తారు. ముల్లోకాలలో చెయ్యవలసింది యేదీ లేకపోయినా, వాంఛించేది లేకపోయినా జ్ఞానులు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించకపోతే సోమరులవుతారు. దానివల్ల లోకనాశం తప్పదు. జ్ఞానులు కర్మ చేస్తూ అజ్ఞానులకు మార్గదర్శకులు కావాలని బోధించి జగద్గురువయ్యాడు.జ్ఞానబోధ చేస్తూ, ‘‘ఎన్ని పాపాలనైనా జ్ఞానం నశింపచేస్తుంది. పాపనాశన విధానం తెలుసుకోవడం కోసమే గురు శుశ్రూష చేయాలి’’ అని గురువు ఔన్నత్యాన్ని బోధించి జగద్గురువయ్యాడు. ఒక్క భగవద్గీత చేత పట్టుకుని స్వామి వివేకానంద ప్రపంచమంతా పర్యటించాడు. విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు.యశోదా నందనుడైన చిన్ని శిశువుకి, దేవకీ సుతుడైన జగద్గురువుకి వందనమ్!!!– డా. పురాణపండ వైజయంతి గురువంటే... గురువు త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి. శిష్యులలోని అజ్ఞానాన్ని పోగొట్టి, నడిపించే శక్తి కలిగి ఉన్నవాడు గురువు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలగలిగేవాడు గురువు అని శాస్త్రం చెబుతోంది. తన సందేశం ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగినవాడిని జగద్గురువు అంటారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతతో ఆయన జగద్గురువయ్యాడు.– డా. పాలపర్తిశ్యామలానందప్రసాద్ భగవద్గీతలోని కొన్ని శ్లోకాల అర్థాలు... ∙కర్మ చెయ్యని వాని కంటె కర్మ చేసే వాడే ఉత్తముడు ∙జ్ఞానికి ఈ లోకంలో భేద దృష్టి లేదు. విద్యతో వినయ సంపత్తితో భూషితుడై విద్వాంసుడు ఎలా కనిపిస్తాడో అలానే ఆవునీ, ఏనుగునీ, కుక్కనీ, కుక్క మాంసం తినేవానినీ చూస్తాడు ∙దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ జీవయాత్ర నడుపుతూ, నిందలకు కుంగకుండా, పొగడ్తలకు గర్వపడకుండా స్థిరచిత్తంతో ఉండేవాడు ప్రీతి కలిగించే భక్తుడు ∙ఆత్మస్తుతి, ఆడంబరం, హింస దరి చేరరాదు. ఓరిమి, సౌమ్య స్వభావం, సద్గురుసేవ, శుచి, నిగ్రహం, విరాగం అవసరం ∙కామక్రోధలోభాలు మూడూ నరక ద్వారాలే. అందుకే వీటిని జయించాలి. అప్పుడు శ్రేయోమార్గం ప్రాప్తిస్తుంది ∙కర్మలన్నిటిలోనూ దోషం ఉన్నది. పొగ లేని నిప్పు ఉండదు. పొగను చూసి దూరం పోతే అగ్ని లభించదు కదా. -
శ్రీకృష్ణాష్టమి అంటే జగమంతా వేడుకే
-
వైఎస్ జగన్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
హైదరాబాద్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మంచితనంతో ముందుకుసాగాలన్న స్ఫూర్తిని శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాటుతుందని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. శ్రీ కృష్ణుడి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ కృష్ణాష్టమి పర్వదినం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. -
సందడిగా కృష్ణాష్టమి వేడుకలు
కుల్కచర్ల: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు రాంరెడ్డిపల్లి, ముజాహిద్పూర్, తిర్మాలాపూర్, ఇప్పాయిపల్లి, రాంపూర్, పుట్టపహడ్, అంతారం, బండవెల్కిచర్ల, మందిపల్, చౌడపూర్, చెల్లాపూర్, ఘణపూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థుళు గోపిక, కృష్ణుల వేషధారణలతో అలరించారు. చిన్నారులతో ఉట్టిలు కొట్టడంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాంరెడ్డిపల్లి గ్రామంలో యాదవ సంఘం ప్రతినిధులు శ్రీకృష్ణుడికి పల్లకిసేవ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సిములు యాదవ్, యాదయ్య, మొగులయ్య, నర్సింహా, గోపాల్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా ఉట్టి ఉత్సవం
సాక్షి, ముంబై: శ్రీకృష్ణాష్టమి పర్వదినంలో భాగంగా ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉట్టిఉత్సవాలను (దహీహండీ) ఘనంగా నిర్వహించారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాలు, ఠాణే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘గోవిందు ఆలారే.... అలా.... గోవిందురే.... గోపాల’ అనే నినాదాలు మార్మోగాయి. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణతో కనువిందు చేశారు. ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో ఉట్టి ఉత్సవ మండళ్ల సభ్యుల ఆనందం రెట్టింపయింది. బాంబే హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఈసారి ఉట్టి ఉత్సవాల్లో హుషారు తగ్గుతుందని అంతా భావించారు. దీనికితోడు పోలీసులు ఆంక్షలు, గోవిందులుగా చిన్నారులను వినియోగించవద్దంటూ కోర్టులు, బాలల హక్కుల సంఘం ఆదేశించడం తెలిసిందే. అయితే హైకోర్టు విధించిన (18 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనకూడదని) కొన్ని ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించడంతో మండళ్లకు కొంత ఊరట లభించింది. అయితే 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడాన్ని మాత్రం సుప్రీం నిషేధించింది. అక్కడక్కడ పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొన్నా, పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. విషాదం నింపిన గోవిందుడి మృతి అయితే కొన్ని చోట్ల ఉత్సవాల్లో 20 మందికిపైగా గోవిందులు కిందపడి గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, క్షతగాత్రుల్లో 12 మందిని పరేల్ కేం ఆస్పత్రికి, ముగ్గురిని సైన్ ఆస్పత్రికి, ఒకరిని నాయర్, మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. మృతుణ్ని లాల్బాగ్ ప్రాంతంలోని సాయి సదన్ సార్వజనిక గోవింద మండలికి చెందిన రాజేంద్ర ఆంబేకర్ (43)గా గుర్తించారు. ఉట్టి పగుల గొట్టేందుకు ఈ బృందం ఠాణేకి వెళ్లింది. ఉట్టి పగుల గొట్టిన తరువాత ఆనందంతో నృత్యం చేస్తుండగా రాజేంద్రకు గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలాడు. వెంటనే అతణ్ని ఠాణేలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా మండళ్ల మధ్య తీవ్ర పోటీ కనిపించింది. పారితోషికాల కోసం ప్రాణాలు లెక్కచేయక గోవిందులు మానవ పిరమిడ్లు నిర్మించారు. కోర్టు నియమాల ప్రకారం ఐదు అంతస్తులు (20 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తున పిరమిడ్ నిర్మించకూడదు. అనేక చోట్ల ఏడు అంతస్తుల వరకు మానవ పిరమిడ్లు నిర్మించి భారీ పారితోషికాలు దక్కించుకున్నారు. ఓటర్లకు గాలం.. ఇటు ఓటర్లను, అటు గోవిందుల బృందాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు భారీగా నజరానాలు ప్రకటించాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులకు ఇదో మంచి అవకాశంగా భావించారు. గృహనిర్మాణశాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ నేతృత్వం వహిస్తున్న వర్లీ సంకల్ప్ ప్రతిష్టాన్ జాంబూరీ మైదాన్‌లో భారీ ఉట్టిని ఏర్పాటు చేసింది. ఠాణేలో సంస్కృతి ప్రతిష్టాన్ భారీ నగదు పారితోషికాలను ప్రకటించింది. వీరితోపాటు ఎమ్మెన్నెస్ తరపున ఘాట్కోపర్లో ఎమ్మెల్యే రామ్ కదమ్, శివసేన తరపున ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, ఎన్సీపీ నాయకుడు, మంత్రి జితేంద్ర అవాడ్, కాంగ్రెస్ మంత్రి నసీం ఖాన్ తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో ఉట్లు ఏర్పాటు చేశారు. గోవిందుల బృందాలను, స్థానిక ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలన్నీ పోటీపడ్డాయి. సినీతారలు మొదలుకుని టీవీ నటీనటులు, ఇతర ప్రముఖులను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేశారు. వేదికపై కళాకారులు సంప్రదాయ నృత్యం లావణీ ప్రదర్శించారు. మరాఠీ గీతాలు ఆలాపించే ఆర్కెస్ట్రా బృందాలు వినోదం పంచాయి. కొన్నిచోట్ల వివిధ సాంస్కృతిక, భోజ్‌పురి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అంతటా భారీ భద్రత కోర్టు నియమాలు ఉల్లంఘించకుండా చూసే బాధ్యతలు బాలల హక్కుల సంఘం పోలీసులకు అప్పగించింది. దీంతో సోమవారం నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల పోలీసులు నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. లౌడ్ స్పీకర్‌పైనా ఆంక్షలు విధించారు.హెల్మెట్లు లేకుండా తిరుగుతున్న గోవిందుల బృందాలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసింది. గాయపడిన గోవిందులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరం ట్రస్టు నాలుగు అంబులెన్సులను సిద్ధంగా ఉంచింది. వీటిని లాల్బాగ్, ైబె కల్లా, పరేల్, వర్లీ ప్రాంతాల్లో ఉంచింది. ఇందులో వైద్యుల బృందంతోపాటు ప్రాథమిక చికిత్స సామాగ్రి ఉంచింది. తదుపరి వైద్యం అవసరమైతే సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఉచితంగా తరలిస్తారు. స్టర్లింగ్ వోకార్డ్ ఆస్పత్రి కూడా ఉచితం వైద్య సేవలు అందించేందుకు అంబులెన్సును సిద్ధంగా ఉంచింది. బీఎంసీ సన్నద్ధం............ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన గోవిందుల బృందాలకు వెంటనే వైద్యం అందించేందుకు బీఎంసీ ప్రత్యేకంగా కొన్ని పడకలను కేటాయించింది. కేం, సైన్, నాయర్ ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున, శివారు ప్రాంతాల్లోని 26 ఆస్పుత్రుల్లో 10 పడకల చొప్పున కేటాయించారు. ఇక్కడ 24 గంటలు వైద్యులు, ఎక్స్ రే, ల్యాబ్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు బీఎంసీ ఆస్పత్రుల వైద్య, విద్యా శాఖ డెరైక్టర్ డాక్టర్ సుహాసినీ నాగ్దా చెప్పారు. మహిళ గోవిందు బృందాలకు ఇబ్బందులు.. 12 ఏళ్లలోపు పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన ఆంక్షల ప్రభావం మహిళా గోవిందుల బృందాలపై పడింది. వీరిలో 30 శాతానికిపైగా పిల్లలు ఉంటారు. ముంబైలో సుమారు 50 వరకు సార్వజనిక మహిళ గోవిందుల బృందాలు ఉన్నాయి. ఆంక్షల కారణంగా దాదాపు 15 బృందాలు ఈసారి ఉట్టి ఉత్సవాలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దూరప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉట్లు పగులగొట్టాయి.