sri rajarajeswari
-
మార్మోగిన శివనామస్మరణ
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు గురువారం అంత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తలనీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిమంది శివదీక్షాపరులు శివనామస్మరణ చేస్తూ ఇరుముడులతో తరలివచ్చి దీక్షలు విరమించారు. రద్దీ అధికంగా ఉండడంతో నిత్య, నిశీ, ఆర్జిత పూజలను రద్దుచేసి లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం 6.30 గంటలకు మహాలింగార్చన మొదలై రాత్రి 9గంటల వరకు కొనసాగింది. అనంతరం రాత్రి 11.30 గంటలకు లింగోద్భవ వేడుక కన్నులపండువగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వేకువజాము వరకు కొనసాగింది. పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు సమర్పించారు. ఆలయ పాలకమండలి అథితిగృహంలో శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను శిరోధారణ చేసిన వీరు అశేషజనవాహిన మధ్యన లయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. భక్తిప్రపత్తులతో మొక్కుల చెల్లింపు.. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లింపులు నిరంతరాయంగా సాగాయి. కోడెటికెట్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో స్పల్పంగా తోపులాట జరిగింది. పలువురు భక్తులు స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) తూకం వేయించి ఆలయ ఆవరణలో పంచిపెట్టారు.తలనీలాల మొక్కులతో కల్యాణకట్ట కిక్కిరిసిపోయింది. ఇవి మినహా నిత్యపూజలన్నీ రద్దుచేయడంతో లఘుదర్శనం సాఫీగా సాగింది. దీక్షల విరమణ మండల, అర్ధమండల దీక్షలు స్వీకరించిన సుమారు ఐదువేల మంది శివస్వాములు ఓంకారనాదాలు చేస్తూ ఇరుముడులతో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం భీమేశ్వరాలయానికి చేరుకుని దీక్షలు విరమించారు. రాజన్న సేవలో ప్రముఖులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరాజరాజేశ్వరస్వామి సేవలో పలువురు ప్రముఖులు తరించారు. బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీలు టి.సంతోష్‌కుమార్, వెంకట్రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య దంపతులు, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అంచనాలు తారుమారు.. మహా జాతరకు సుమారు నాలుగు లక్షల మంది తరలివస్తారని ఆలయ వర్గాలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. సుమారు రెండు లక్షల మంది మాత్రమే వచ్చినట్లు అంచనా. శుక్రవారం మరో లక్షమంది భక్తులు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తమ్మీద మహాశివరాత్రికి మూడు లక్షలు మించి జనం రాకపోవచ్చునని స్పష్టమవుతోంది. భక్తుల ఏర్పాట్లను ఉత్సవాల ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, ఈవో సిహెచ్వీ.కృష్ణాజీరావు, ధర్మకర్తలు, అరుణ్‌తేజాచారి, సగ్గు పద్మాదేవరాజ్, ఆకునూరి బాలరాజు, సింగిరెడ్డి స్వామిరెడ్డి, గుండా చంద్రమౌళి, కుమటాల శ్రీనివాస్, బండం మల్లారెడ్డి, విజయారాజంతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య నేతృత్వంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఉచ్చు బిగుస్తోంది!
వేములవాడ, న్యూస్‌లైన్ : దేవాదాయశాఖలోని పలు హోదాల్లో రాజసం ఒలకబోస్తున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ ఉన్నతాధికారుల చుట్టూ విజిలెన్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. దేవస్థానంలో అవినీతిపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన నివేదిక దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మూడు రోజుల క్రితం చేరింది. దీంతో అవినీతి వ్యవహారం బహిర్గతం కాకుండా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈమేరకు అధికారుల సహకారంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు సమాచారం. అసలేం జరిగింది రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో గతేడాది జూన్ 25న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. అప్పటి విజిలెన్స్ జిల్లా ఎస్పీ మార్తాండ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. మొత్తం 23 మంది అధికారులతో కూడిన 5 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా విజిలెన్స్ విభాగం దాడులు చేయడం ప్రత్యేకతను సంతరించుకుం ది. దేవాదాయశాఖ అధికారులే దాడులు చేస్తార ని, వారిని మేనేజ్ చేయచ్చనే ధీమాతో ఉండగా విజిలెన్స్దాడులతో హడలిపోయారు. ఐదు విభాగాల్లో విచారణ విజిలెన్స్ అధికారులు ఆలయ పరిపాలనా విభాగంలోని మొత్తం విభాగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. వీటిల్లో ప్రధానంగా ప్రసాదాల తయారీ-విక్రయం, వసతిగదుల నిర్వహణ, లీజులు, అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, వసతి గదుల్లో ఉద్యోగుల తిష్ట తదితర అంశాల్లో విచారణ జరిపారు. ప్రసాదాల విభాగంలో టిక్కెట్ల రీసెల్ వ్యవహారం వెలుగుచూసింది. 1020 లడ్డూ టిక్కెట్లు, 380 పులిహోరా టిక్కెట్లను రీసేల్ చేసేందుకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి, వాటిని సీజ్ చేశారు. ఆలయ వసతిగదుల్లో తిష్టవేసిన ఉద్యోగులకు హెచ్ఆర్ ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించారు. 2012-13 సంవత్సరానికి ప్రసాదాలు, వసతి గదుల విభాగాల్లో ఆదాయ, వ్యయాల వివరాలపై ఆరాతీశారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక దాడులు నిర్వహించిన తర్వాత కూడా రెండు నెలల వరకూ విచారణ కొనసాగింది. అంతకుముందు మూడేళ్లు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన అధికారుల హయాంలో జరిగిన పరిణామాలు తదితర రికార్డులపై సమగ్ర విచారణ కొనసాగింది. ఇందులో భాగంగా మరింత లోతైన పరిశోధన జరిపిన విజిలెన్స్ విభాగం కోడెమొక్కు టిక్కెట్టు వెంట ఉచిత లడ్డూ పంపి ణీ ప్రారంభించిన 2011 ఏప్రిల్ 1 నుంచి గోల్మాల్ వ్యవ హారానికి తెరలేచినట్లు నిర్ధారించినట్లు సమాచారం. స్కార్పియో కొనుగోలు, ప్రచార రథం తయారీలో అవలంబించిన విధానాలు, లీజుల విభాగంలో వ్యాపారులకు టెండర్లలో పనులు విభజించి అప్పగించటం ద్వారా లబ్ధిపొందడం తదితర అంశాలు చేర్చినట్లు తెలిసింది. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజిలెన్స్ విభాగం సమర్పించింది. అక్కడ ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి ఐదు నెలల తర్వాత ఆ నివేదిక ప్రస్తుతం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరింది. విచారణలోని మరో ఘట్టానికి తె రలేవడంతో దేవాదాయశాఖ ఏం చర్యలు తీసుకుంటుందోనన్న హైరానా ఉన్నతాధికారుల్లో మొదలైంది. ఎవరెవరిలో కలవరం విజిలెన్స్ లెక్కల ప్రకారం మూడేళ్లు ఇక్కడ విధులు నిర్వహించిన కార్యనిర్వహణాధికారుల్లోని పలువురు ప్రస్తుతం ఉన్నత స్థాయిహోదా ల్లో ఉన్నారు. తెనాలి చంద్రకుమార్ అడిషనల్ కమిషనర్, కూరాకుల జ్యోతి జాయింట్ కమిషనర్ హోదాలో దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారి హోదాలో ఉన్నారు. మరో ఈవో అప్పారావు మాత్రం 2013, ఆగస్టులో స్పెషల్ గ్రే డ్ డెప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. చంద్రకుమార్ గతంలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో పనిచేసినప్పుడు ఎదుర్కొన్న ఆరోపణలు, ప్రస్తుత ఆరోపణలు ఆయనకు దేవాదాయ కమిషనర్ పదవి దక్కకుండా చేసే పరిస్థితి కనబడుతోంది. జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న జ్యోతి ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ పదోన్నతికోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఈ విపత్తు ఆమెకు ఇబ్బంది కర పరిణామాలనే తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. స్థానిక అధికారులు కూడా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. -
త్యాగయ్య ఆత్మ ఘోషించదా?
వేములవాడ, న్యూస్‌లైన్: త్యాగరాజ ఆరాధనోత్సవాల పేరిట ఆ మహనీయుని ఆత్మను ఘోషింపచేసే వైనమిది. ఒకనాడు ఘంటసాల అంతటి గానగంధర్వుడు ఆ వేదికను అలంకరించగా, నేడు పేరున్న కళాకారులే కరువయ్యారు. ఉత్సవాల్లో ప్రముఖ కళాకారుల భాగస్వామ్యం కొరవడిందని కళాభి మానులు బాధపడుతున్న తరుణంలో.. ప్రజాప్రతినిధులు అధికారుల తీరు మరింత ఆవేదన కు గురిచేసింది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు మంగళవారం ప్రారంభం కాగా... ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ప్రముఖులెవ్వరూ హాజరుకాలేదు సరికదా... వచ్చిన చైర్మన్ కూడా నగర సంకీర్తన ముగియగానే ఆఘమేఘాల మీద వెళ్లిపోయారు. మార్కెట్ కమిటీ చైర్మన్, ట్రస్టుబోర్డు సభ్యులే జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారంటే ప్రముఖులకు ఉత్సవాలపై ఎంత ప్రేమో తెలిసిపోతోంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ప్రతిఏటా నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల స్థాయి నానాటికీ దిగజారుతోంది. కోట్లాది రూపాయల ఆదాయంతో ప్రముఖ దేవాలయాల సరసన నిలిచిన రాజన్న ఆలయంలో ఈ వేడుకలపై ప్రముఖులకు చిన్నచూపు కలుగుతోంది. ఉత్సవాల ప్రారంభోత్సవానికి కూడా కనీస సమయం కేటాయించలేకపోతున్నారు. దర్శనానికి వచ్చే సమయంలో రాచమర్యాదలు కోరుకునే నేతలు.. ఏడాదికోసారి జరిగే ఉత్సవాలకు కనీసం ముఖం చూపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు విఫలం ఉత్సవాల స్థాయికి తగినట్లుగా ప్రముఖులను ఆహ్వానించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. తొలుత ముద్రించిన ఆహ్వాన పత్రాల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల పేర్లులేకపోవటంతో గందరగోళం జరిగింది. పోనీ, ఆహ్వాన పత్రికలపై పేర్లున్న ప్రముఖులు వచ్చారా? అంటే వారి ఊసే లేదు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపెల్లి మోహన్, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, స్థానిక ఎమ్మెల్యే సీహెచ్.రమేశ్, దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ దామెర నర్సయ్య కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరితోపాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, స్వామిగౌడ్, సంతోష్‌కుమార్, పి.సుధాకర్‌రెడ్డి పేర్లను చేర్చుతూ ఆహ్వాన పత్రికలు ముద్రించినా వారెవ్వరికీ తీరిక దొరక్కపోవడం విడ్డూరం. దీనికి పాలకమండలితోపాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చిన పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు నామ మాత్రంగా నగర సంకీర్తనలో పాల్గొని వెళ్లిపోయారు. కనీసం ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకూ కూడా ఉండలేకపోయారు. దీంతో మార్కెట్ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆర్భాటంగా ప్రారంభం ఆర్భాటంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళాపిపాసులను అలరించాయి. తొలిరోజున ఉదయం 7 గంటలకు స్వస్తి పుణ్యాహవచనం, 8.30కు నగర సంకీర్తన, 10కి జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం కొనసాగిన కార్యక్రమాల్లో భాగంగా సీహెచ్.శ్రీత్యాగరాజ స్వామివారి జీవిత విశేషాలను సీహెచ్.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. సంగీత కార్యక్రమంలో భాగంగా బి.అరుణ, రేవతి, పద్మ, కె.నరహరి బృందం త్యాగరాజ పంచరత్న గానం అందరినీ అలరించింది. సాయంత్రం 4 గంటలకు జయంతీ సావిత్రి హరికథాగానం, 6 గంటలకు డి.వర్ధిని సంగీత కచేరి, 8కి కె.లక్ష్మి, మాధవి, శ్రీవాణి భక్తి విభావరి, 9కి కూచిపూడి కళాకారిణి శ్వేత నృత్య ప్రదర్శన, 10 గంటలకు జక్కా కృష్ణ బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొనసాగాయి. -
మేడారం వయా.. ఎములాడ
చిలుకలగుట్ట దారులన్నీ వేములవాడకు సాగుతున్నాయి. వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా తమ ఇలవేల్పు అయిన ఎములాడ రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. రెండోళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నాకే మేడారం దారిపట్టడం ఆనవాయితీ.. వేములవాడ, న్యూస్‌లైన్: గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మలను కొలిచే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ జాతరకు ఎక్కువగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి తరలివెళ్తారు. వీరిలో వేలాది కుటుంబాలకు ఎములాడ రాజన్నే ఇలవేల్పు కావడంతో వారంతా స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఫిబ్రవరిలో వచ్చే ఈ జాతరకు సంక్రాంతి మరుసటి రోజునుంచి గతంలో భక్తుల దర్దీ మొదలయ్యేది. ఈసారి అందుకు భిన్నంగా నెలన్నర రోజుల ముందునుంచే రాజన్న సన్నిధిలో భక్తజనం పోటెత్తుతున్నారు. వారం రోజులుగా స్వామి సన్నిధికి వచ్చే భక్తులతో వేములవాడ జనసంద్రంగా కనిపిస్తోంది. మేడారం జాతర వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. నిరంతర దర్శనం.. మేడారం జాతర భక్తుల కోసం రాజన్న దర్శనం సులభతరం చేస్తూ ప్రత్యేక వెసులుబాట్లను కల్పించారు. ఈమేరకు రాజన్న ఆలయ పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిసెంబర్ 24న జరిగిన పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9వరకు నాలుగు ఆదివారాల్లో 24 గంటలపాటు నిరంతరాయంగా స్వామివారి దర్శనం కల్పించారు. జనవరి 20 నుంచిఫిబ్రవరి 10 వరకు నాలుగు సోమవారాల్లో స్వామివారి లఘుదర్శణం మాత్రమే అందుబాటులో ఉంచారు. ఆయా రోజుల్లో గర్భాలయంలో జరిపే ఆర్జిత సేవలను రద్దుచేశారు. జనవరి 19నుంచి ఫిబ్రవరి 10వరకు ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో పల్లకీసేవ, పెద్దసేవ పూజల్లో మార్పులు చేశారు. వీటిస్థానంలో ప్రత్యేక పెద్దసేవ పేరిట రూ.350 టిక్కెట్టుతో ఆర్జిత సేవ అందుబాటులో ఉంటుంది. ఈ పూజను ఆలయ కళాభవనంలో జరిపించి ప్రసాదాలు అందజేసేలా నిర్ణయించారు. బడ్జెట్ కరువు 1996లో ప్రభుత్వం మేడారం సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. గతేడాది 80 లక్షల నుంచి కోటి మంది అమ్మవారలను దర్శించుకున్నట్లు అంచనా. ఈసారి కోటి నుండి 1.20 కోట్ల మంది దర్శించుకుంటారన్న అంచనాలతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో వేములవాడకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోతోంది. ప్రతి ఏటా ఇక్కడ వైభవంగా జరిగే మహాశివరాత్రి జాతరకు దేవాదాయ శాఖ వెచ్చించే బడ్జెట్‌తోనే సరిపెడుతోంది. అదే బడ్జెట్‌ను కాస్త ముందస్తుగా ఖర్చుచేసి నామమాత్రపు ఏర్పాట్లతో చేతులు దులుపుకుంటోంది. సమ్మక్క సీజన్లో భక్తులు ఎదుర్కుంటున్న కష్టాలే ఇందుకు నిదర్శనం. వసతి మొదలుకుని దర్శనం వరకు ప్రతీదీ ప్రహసనంగా మారుతోంది. భక్తులు సమర్పించే కానుకలను మూటగట్టుకుంటున్న ప్రభుత్వం వారికి కల్పించాల్సిన సౌకర్యాలను మరచిపోతోందనడంలో సందేహం లేదు.