వేములవాడ, న్యూస్‌లైన్ : దేవాదాయశాఖలోని పలు హోదాల్లో రాజసం ఒలకబోస్తున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ ఉన్నతాధికారుల చుట్టూ విజిలెన్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. దేవస్థానంలో అవినీతిపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన నివేదిక దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మూడు రోజుల క్రితం చేరింది. దీంతో అవినీతి వ్యవహారం బహిర్గతం కాకుండా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈమేరకు అధికారుల సహకారంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది
రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో గతేడాది జూన్ 25న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. అప్పటి విజిలెన్స్ జిల్లా ఎస్పీ మార్తాండ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. మొత్తం 23 మంది అధికారులతో కూడిన 5 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా విజిలెన్స్ విభాగం దాడులు చేయడం ప్రత్యేకతను సంతరించుకుం ది. దేవాదాయశాఖ అధికారులే దాడులు చేస్తార ని, వారిని మేనేజ్ చేయచ్చనే ధీమాతో ఉండగా విజిలెన్స్‌దాడులతో హడలిపోయారు.
ఐదు విభాగాల్లో విచారణ
విజిలెన్స్ అధికారులు ఆలయ పరిపాలనా విభాగంలోని మొత్తం విభాగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. వీటిల్లో ప్రధానంగా ప్రసాదాల తయారీ-విక్రయం, వసతిగదుల నిర్వహణ, లీజులు, అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, వసతి గదుల్లో ఉద్యోగుల తిష్ట తదితర అంశాల్లో విచారణ జరిపారు. ప్రసాదాల విభాగంలో టిక్కెట్ల రీసెల్ వ్యవహారం వెలుగుచూసింది. 1020 లడ్డూ టిక్కెట్లు, 380 పులిహోరా టిక్కెట్లను రీసేల్ చేసేందుకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి, వాటిని సీజ్ చేశారు. ఆలయ వసతిగదుల్లో తిష్టవేసిన ఉద్యోగులకు హెచ్‌ఆర్ ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించారు. 2012-13 సంవత్సరానికి ప్రసాదాలు, వసతి గదుల విభాగాల్లో ఆదాయ, వ్యయాల వివరాలపై ఆరాతీశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక
దాడులు నిర్వహించిన తర్వాత కూడా రెండు నెలల వరకూ విచారణ కొనసాగింది. అంతకుముందు మూడేళ్లు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన అధికారుల హయాంలో జరిగిన పరిణామాలు తదితర రికార్డులపై సమగ్ర విచారణ కొనసాగింది. ఇందులో భాగంగా మరింత లోతైన పరిశోధన జరిపిన విజిలెన్స్ విభాగం కోడెమొక్కు టిక్కెట్టు వెంట ఉచిత లడ్డూ పంపి ణీ ప్రారంభించిన 2011 ఏప్రిల్ 1 నుంచి గోల్‌మాల్ వ్యవ హారానికి తెరలేచినట్లు నిర్ధారించినట్లు సమాచారం.
స్కార్పియో కొనుగోలు, ప్రచార రథం తయారీలో అవలంబించిన విధానాలు, లీజుల విభాగంలో వ్యాపారులకు టెండర్లలో పనులు విభజించి అప్పగించటం ద్వారా లబ్ధిపొందడం తదితర అంశాలు చేర్చినట్లు తెలిసింది. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజిలెన్స్ విభాగం సమర్పించింది. అక్కడ ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి ఐదు నెలల తర్వాత ఆ నివేదిక ప్రస్తుతం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరింది. విచారణలోని మరో ఘట్టానికి తె రలేవడంతో దేవాదాయశాఖ ఏం చర్యలు తీసుకుంటుందోనన్న హైరానా ఉన్నతాధికారుల్లో మొదలైంది.
ఎవరెవరిలో కలవరం
విజిలెన్స్ లెక్కల ప్రకారం మూడేళ్లు ఇక్కడ విధులు నిర్వహించిన కార్యనిర్వహణాధికారుల్లోని పలువురు ప్రస్తుతం ఉన్నత స్థాయిహోదా ల్లో ఉన్నారు. తెనాలి చంద్రకుమార్ అడిషనల్ కమిషనర్, కూరాకుల జ్యోతి జాయింట్ కమిషనర్ హోదాలో దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారి హోదాలో ఉన్నారు. మరో ఈవో అప్పారావు మాత్రం 2013, ఆగస్టులో స్పెషల్ గ్రే డ్ డెప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. చంద్రకుమార్ గతంలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో పనిచేసినప్పుడు ఎదుర్కొన్న ఆరోపణలు, ప్రస్తుత ఆరోపణలు ఆయనకు దేవాదాయ కమిషనర్ పదవి దక్కకుండా చేసే పరిస్థితి కనబడుతోంది. జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న జ్యోతి ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ పదోన్నతికోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఈ విపత్తు ఆమెకు ఇబ్బంది కర పరిణామాలనే తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. స్థానిక అధికారులు కూడా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.
ఉచ్చు బిగుస్తోంది!
Published Fri, Feb 7 2014 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement