మేడారం వయా.. ఎములాడ | medaram route...emulada | Sakshi
Sakshi News home page

మేడారం వయా.. ఎములాడ

Published Mon, Dec 30 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

medaram route...emulada

 చిలుకలగుట్ట దారులన్నీ వేములవాడకు సాగుతున్నాయి. వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా తమ ఇలవేల్పు అయిన ఎములాడ రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. రెండోళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నాకే మేడారం దారిపట్టడం ఆనవాయితీ..
 
 వేములవాడ, న్యూస్‌లైన్: గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మలను కొలిచే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ జాతరకు ఎక్కువగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్  జిల్లాల నుంచి తరలివెళ్తారు. వీరిలో వేలాది కుటుంబాలకు ఎములాడ రాజన్నే ఇలవేల్పు కావడంతో వారంతా స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

ఫిబ్రవరిలో వచ్చే ఈ జాతరకు సంక్రాంతి మరుసటి రోజునుంచి గతంలో భక్తుల దర్దీ మొదలయ్యేది. ఈసారి అందుకు భిన్నంగా నెలన్నర రోజుల ముందునుంచే రాజన్న సన్నిధిలో భక్తజనం పోటెత్తుతున్నారు. వారం రోజులుగా స్వామి సన్నిధికి వచ్చే భక్తులతో వేములవాడ జనసంద్రంగా కనిపిస్తోంది. మేడారం జాతర వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది.
 
 నిరంతర దర్శనం..
 మేడారం జాతర భక్తుల కోసం రాజన్న దర్శనం సులభతరం చేస్తూ ప్రత్యేక వెసులుబాట్లను కల్పించారు. ఈమేరకు రాజన్న ఆలయ పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిసెంబర్ 24న జరిగిన పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9వరకు నాలుగు ఆదివారాల్లో 24 గంటలపాటు నిరంతరాయంగా స్వామివారి దర్శనం కల్పించారు.
 
 జనవరి 20 నుంచిఫిబ్రవరి 10 వరకు నాలుగు సోమవారాల్లో స్వామివారి లఘుదర్శణం మాత్రమే అందుబాటులో ఉంచారు. ఆయా రోజుల్లో గర్భాలయంలో జరిపే ఆర్జిత సేవలను రద్దుచేశారు. జనవరి 19నుంచి ఫిబ్రవరి 10వరకు ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో పల్లకీసేవ, పెద్దసేవ పూజల్లో మార్పులు చేశారు. వీటిస్థానంలో ప్రత్యేక పెద్దసేవ పేరిట రూ.350 టిక్కెట్టుతో ఆర్జిత సేవ అందుబాటులో ఉంటుంది. ఈ పూజను ఆలయ కళాభవనంలో జరిపించి ప్రసాదాలు అందజేసేలా నిర్ణయించారు.
 
 బడ్జెట్ కరువు
 1996లో ప్రభుత్వం మేడారం సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. గతేడాది 80 లక్షల నుంచి కోటి మంది అమ్మవారలను దర్శించుకున్నట్లు అంచనా. ఈసారి కోటి నుండి 1.20 కోట్ల మంది దర్శించుకుంటారన్న అంచనాలతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో వేములవాడకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోతోంది. ప్రతి ఏటా ఇక్కడ వైభవంగా జరిగే మహాశివరాత్రి జాతరకు దేవాదాయ శాఖ వెచ్చించే బడ్జెట్‌తోనే సరిపెడుతోంది.
 
 అదే బడ్జెట్‌ను కాస్త ముందస్తుగా ఖర్చుచేసి నామమాత్రపు ఏర్పాట్లతో చేతులు దులుపుకుంటోంది. సమ్మక్క సీజన్‌లో భక్తులు ఎదుర్కుంటున్న కష్టాలే ఇందుకు నిదర్శనం. వసతి మొదలుకుని దర్శనం వరకు ప్రతీదీ ప్రహసనంగా మారుతోంది. భక్తులు సమర్పించే కానుకలను మూటగట్టుకుంటున్న ప్రభుత్వం వారికి కల్పించాల్సిన సౌకర్యాలను మరచిపోతోందనడంలో  సందేహం లేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement