వేములవాడ, న్యూస్‌లైన్: త్యాగరాజ ఆరాధనోత్సవాల పేరిట ఆ మహనీయుని ఆత్మను ఘోషింపచేసే వైనమిది. ఒకనాడు ఘంటసాల అంతటి గానగంధర్వుడు ఆ వేదికను అలంకరించగా, నేడు పేరున్న కళాకారులే కరువయ్యారు.
ఉత్సవాల్లో ప్రముఖ కళాకారుల భాగస్వామ్యం కొరవడిందని కళాభి మానులు బాధపడుతున్న తరుణంలో.. ప్రజాప్రతినిధులు అధికారుల తీరు మరింత ఆవేదన కు గురిచేసింది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు మంగళవారం ప్రారంభం కాగా... ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ప్రముఖులెవ్వరూ హాజరుకాలేదు సరికదా... వచ్చిన చైర్మన్ కూడా నగర సంకీర్తన ముగియగానే ఆఘమేఘాల మీద వెళ్లిపోయారు. మార్కెట్ కమిటీ చైర్మన్, ట్రస్టుబోర్డు సభ్యులే జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారంటే ప్రముఖులకు ఉత్సవాలపై ఎంత ప్రేమో తెలిసిపోతోంది.
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ప్రతిఏటా నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల స్థాయి నానాటికీ దిగజారుతోంది. కోట్లాది రూపాయల ఆదాయంతో ప్రముఖ దేవాలయాల సరసన నిలిచిన రాజన్న ఆలయంలో ఈ వేడుకలపై ప్రముఖులకు చిన్నచూపు కలుగుతోంది. ఉత్సవాల ప్రారంభోత్సవానికి కూడా కనీస సమయం కేటాయించలేకపోతున్నారు. దర్శనానికి వచ్చే సమయంలో రాచమర్యాదలు కోరుకునే నేతలు.. ఏడాదికోసారి జరిగే ఉత్సవాలకు కనీసం ముఖం చూపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అధికారులు విఫలం
ఉత్సవాల స్థాయికి తగినట్లుగా ప్రముఖులను ఆహ్వానించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. తొలుత ముద్రించిన ఆహ్వాన పత్రాల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల పేర్లులేకపోవటంతో గందరగోళం జరిగింది. పోనీ, ఆహ్వాన పత్రికలపై పేర్లున్న ప్రముఖులు వచ్చారా? అంటే వారి ఊసే లేదు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపెల్లి మోహన్, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, స్థానిక ఎమ్మెల్యే సీహెచ్.రమేశ్, దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వర్‌రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ దామెర నర్సయ్య కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరితోపాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, స్వామిగౌడ్, సంతోష్‌కుమార్, పి.సుధాకర్‌రెడ్డి పేర్లను చేర్చుతూ ఆహ్వాన పత్రికలు ముద్రించినా వారెవ్వరికీ తీరిక దొరక్కపోవడం విడ్డూరం.
దీనికి పాలకమండలితోపాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాల ప్రారంభోత్సవానికి వచ్చిన పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు నామ మాత్రంగా నగర సంకీర్తనలో పాల్గొని వెళ్లిపోయారు. కనీసం ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకూ కూడా ఉండలేకపోయారు. దీంతో మార్కెట్ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించారు.
ఆర్భాటంగా ప్రారంభం
ఆర్భాటంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళాపిపాసులను అలరించాయి. తొలిరోజున ఉదయం 7 గంటలకు స్వస్తి పుణ్యాహవచనం, 8.30కు నగర సంకీర్తన, 10కి జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం కొనసాగిన కార్యక్రమాల్లో భాగంగా సీహెచ్.శ్రీత్యాగరాజ స్వామివారి జీవిత విశేషాలను సీహెచ్.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు.
సంగీత కార్యక్రమంలో భాగంగా బి.అరుణ, రేవతి, పద్మ, కె.నరహరి బృందం త్యాగరాజ పంచరత్న గానం అందరినీ అలరించింది. సాయంత్రం 4 గంటలకు జయంతీ సావిత్రి హరికథాగానం, 6 గంటలకు డి.వర్ధిని సంగీత కచేరి, 8కి కె.లక్ష్మి, మాధవి, శ్రీవాణి భక్తి విభావరి, 9కి కూచిపూడి కళాకారిణి శ్వేత నృత్య ప్రదర్శన, 10 గంటలకు జక్కా కృష్ణ బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొనసాగాయి.
త్యాగయ్య ఆత్మ ఘోషించదా?
Published Wed, Jan 22 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement