వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు గురువారం అంత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తలనీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేలాదిమంది శివదీక్షాపరులు శివనామస్మరణ చేస్తూ ఇరుముడులతో తరలివచ్చి దీక్షలు విరమించారు. రద్దీ అధికంగా ఉండడంతో నిత్య, నిశీ, ఆర్జిత పూజలను రద్దుచేసి లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం 6.30 గంటలకు మహాలింగార్చన మొదలై రాత్రి 9గంటల వరకు కొనసాగింది. అనంతరం రాత్రి 11.30 గంటలకు లింగోద్భవ వేడుక కన్నులపండువగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వేకువజాము వరకు కొనసాగింది.
పట్టువస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు సమర్పించారు. ఆలయ పాలకమండలి అథితిగృహంలో శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను శిరోధారణ చేసిన వీరు అశేషజనవాహిన మధ్యన లయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు.
భక్తిప్రపత్తులతో మొక్కుల చెల్లింపు..
స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లింపులు నిరంతరాయంగా సాగాయి. కోడెటికెట్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో స్పల్పంగా తోపులాట జరిగింది. పలువురు భక్తులు స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) తూకం వేయించి ఆలయ ఆవరణలో పంచిపెట్టారు.తలనీలాల మొక్కులతో కల్యాణకట్ట కిక్కిరిసిపోయింది. ఇవి మినహా నిత్యపూజలన్నీ రద్దుచేయడంతో లఘుదర్శనం సాఫీగా సాగింది.
దీక్షల విరమణ
మండల, అర్ధమండల దీక్షలు స్వీకరించిన సుమారు ఐదువేల మంది శివస్వాములు ఓంకారనాదాలు చేస్తూ ఇరుముడులతో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం భీమేశ్వరాలయానికి చేరుకుని దీక్షలు విరమించారు.
రాజన్న సేవలో ప్రముఖులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరాజరాజేశ్వరస్వామి సేవలో పలువురు ప్రముఖులు తరించారు. బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీలు టి.సంతోష్‌కుమార్, వెంకట్రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య దంపతులు, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.
అంచనాలు తారుమారు..
మహా జాతరకు సుమారు నాలుగు లక్షల మంది తరలివస్తారని ఆలయ వర్గాలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. సుమారు రెండు లక్షల మంది మాత్రమే వచ్చినట్లు అంచనా. శుక్రవారం మరో లక్షమంది భక్తులు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తమ్మీద మహాశివరాత్రికి మూడు లక్షలు మించి జనం రాకపోవచ్చునని స్పష్టమవుతోంది.
భక్తుల ఏర్పాట్లను ఉత్సవాల ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, ఈవో సిహెచ్‌వీ.కృష్ణాజీరావు, ధర్మకర్తలు, అరుణ్‌తేజాచారి, సగ్గు పద్మాదేవరాజ్, ఆకునూరి బాలరాజు, సింగిరెడ్డి స్వామిరెడ్డి, గుండా చంద్రమౌళి, కుమటాల శ్రీనివాస్, బండం మల్లారెడ్డి, విజయారాజంతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య నేతృత్వంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మార్మోగిన శివనామస్మరణ
Published Fri, Feb 28 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement