sri ram project
-
రేపు జూరాలకు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాటర్ ఇయర్లో తొలిసారి ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా నదీ ప్రవాహాలు మొదలయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతోంది. ఈ నీరంతా దిగువన జూరాల వైపుగా తన ప్రయాణం మొదలు పెట్టగా, మంగళవారానికి నీరు జూరాలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దిగువకు పరుగు... గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో వాగులు, వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో వరద పెరిగింది. ఆదివారం ప్రాజెక్టులోకి 69,868 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు 98 టీఎంసీలు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి కొత్తగా 78 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులో మరో 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 36,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి ప్రవాహాలు మరింత పెరిగాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,720 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగాను 33.47 టీఎంసీలు ఉంది. మొత్తంగా ఆల్మట్టి, నారాయణపూర్‌లలో 35 టీఎంసీల మేర నిల్వలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో నారాయణపూర్ రెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి ఆదివారం ఉదయం 11,240 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. సాయంత్రానికి నీటి విడుదలను 26 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీరంతా కర్ణాటకలోనే ఉన్న గూగుల్, గిరిజాపూర్ బ్యారేజీలను దాటుకుంటూ మంగళవారం నాటికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ఇప్పటికే స్థానిక పరీవాహకం నుంచి 4,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నిల్వ 9.66 టీఎంసీలకుగాను 8.10 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా ద్వారా 1,445 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశాల నేపథ్యంలో సోమ లేదా మంగళవారం నుంచి పవర్‌హౌస్ ద్వారా నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదిలే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటే జూరాల గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలానికి 2,557 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 37.25 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌కు 1,202 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీలకుగాను 168.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 11,102 క్యూసెక్కుల మేర ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 33.60 టీఎంసీలుగా ఉంది. -
తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. భద్రాచలంతోని గోదావరిలో నీటీ మట్ట 26అడుగులకు చేరింది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరింది. సాధారణ నీటి మట్టం20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.892టీఎంసీలకు చేరింది. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. తాలిపేరు ప్రాజెక్టు నీటిమట్టం 72.80మీటర్లకు చేరింది. ఇన్‌ప్లో 6100క్యూసెక్కులుగా ఉంది. అధికారులు ఇప్పటికే నాలుగు గేట్లు ఎత్తివేశారు. 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం ప్రాజెక్టు నీటిమట్టం 1058.60అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 2401క్యూసెక్కులుగా ఉంది. కిన్నెసాని ప్రాజెక్టు భారీని వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 399.10అడుగులుగా ఉంది. భారీ వర్షాలతో సత్తుపల్లిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. -
‘రబీ’కి రందిలేదు
బాల్కొండ, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నిండుకుండలా ఉండటంతో రబీలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్ ద్వారా కాడా(కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ)కు నివేదిక పంపించారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీకోసం ఈనెల 15 నుంచి లేదా వచ్చేనెల ఒకటో తేదీనుంచి నీటిని సరఫరా చేసే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం (1,091 అడుగులతో 90 టీఎంసీలు)తో కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టు 16 లక్షల ఎకరాలు. ఖరీఫ్‌లో ఈ ఆయకట్టుకు నీటిని అందించడానికి 65 టీఎంసీలు, రబీలో 70 టీఎంసీల నీరు సరిపోతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 90 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించవచ్చని గత నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన కాడా సమావేశాల్లో ప్రాజెక్టు అధికారులు నివేదిక అందించారు. ఆయకట్టుకు 70 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీలు సరిపోతాయని, ఐదు టీఎంసీలు డెడ్‌స్టోరేజీ పోగా మరో 10 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే వరద కాలువ ఆధారంగా సాగయ్యే 2.20 లక్షల ఎకరాలకు నీరందించే విషయంలో అధికారులు ఎటూ తేల్చలేక పోతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి రబీలో నీటి సరఫరా జరుగుతుంద న్న ధీమాతో ఆయాకట్టు రైతులు ఉన్నారు. దీంతో ముందస్తుగానే వరి నారు పోయడానికి సిద్ధమవుతున్నారు. అధికారులు సకాలంలో నీటిని విడుదల చేసి ఆయకట్టు పంటలు గట్టెక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో నీరందిస్తాం-శ్యాం సుందర్, ప్రాజెక్టు ఎస్ఈ, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. ఈ నీటితో రబీలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించవచ్చు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం నివేదిక ఇచ్చాం. నీటి విడుదల ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలో ప్రకటిస్తాం.