బాల్కొండ, న్యూస్‌లైన్ :
ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నిండుకుండలా ఉండటంతో రబీలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్ ద్వారా కాడా(కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ)కు నివేదిక పంపించారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీకోసం ఈనెల 15 నుంచి లేదా వచ్చేనెల ఒకటో తేదీనుంచి నీటిని సరఫరా చేసే అవకాశాలున్నాయి.
ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం (1,091 అడుగులతో 90 టీఎంసీలు)తో కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టు 16 లక్షల ఎకరాలు. ఖరీఫ్‌లో ఈ ఆయకట్టుకు నీటిని అందించడానికి 65 టీఎంసీలు, రబీలో 70 టీఎంసీల నీరు సరిపోతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 90 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించవచ్చని గత నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన కాడా సమావేశాల్లో ప్రాజెక్టు అధికారులు నివేదిక అందించారు.
ఆయకట్టుకు 70 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీలు సరిపోతాయని, ఐదు టీఎంసీలు డెడ్‌స్టోరేజీ పోగా మరో 10 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే వరద కాలువ ఆధారంగా సాగయ్యే 2.20 లక్షల ఎకరాలకు నీరందించే విషయంలో అధికారులు ఎటూ తేల్చలేక పోతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి రబీలో నీటి సరఫరా జరుగుతుంద న్న ధీమాతో ఆయాకట్టు రైతులు ఉన్నారు. దీంతో ముందస్తుగానే వరి నారు పోయడానికి సిద్ధమవుతున్నారు. అధికారులు సకాలంలో నీటిని విడుదల చేసి ఆయకట్టు పంటలు గట్టెక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
పూర్తి స్థాయిలో నీరందిస్తాం-శ్యాం సుందర్, ప్రాజెక్టు ఎస్‌ఈ, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. ఈ నీటితో రబీలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించవచ్చు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం నివేదిక ఇచ్చాం. నీటి విడుదల ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలో ప్రకటిస్తాం.
‘రబీ’కి రందిలేదు
Published Mon, Dec 2 2013 1:50 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement