Sri Ram sena
-
'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'
న్యూఢిల్లీ: పర్యాటక స్థలాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో జంటగా కనిపించిన ప్రేమికులపై దాడులకు పాల్పడుతూ తమనుతాము సాంస్కృతిక పరిరక్షకులుగా భావించే శ్రీరాం సేనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవా రాష్ట్రంలోకి తన ప్రేవేశాన్ని నిషేధిస్తూ కింది కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా ముతాలిక్ తీరును కోర్టు తప్పుపట్టింది. 'ప్రేమికులపై దాడిచేసే హక్కును మీకు ఎవరిచ్చారు?' అని ప్రశ్నించింది. గడిచిన జూన్ 2న గోవాలోకి ప్రవేశించరాదంటూ ముంబై కోర్టు శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ ను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను కొట్టివేయాల్సిందిగా ముతాలిక్ ఆగస్టులో గోవా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశే ఎదురుకావటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముతాలిక్ ఇక గోవాలో అడుగుపెట్టే అవకాశాలు మృగ్యమైనట్లే. -
ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు : బాబ్రీ మసీదుతో పాటే వారణాసి, మధురైలోని మసీదులనూ కూల్చాల్చి ఉందని, అయితే ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని శ్రీరామ సేన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు మసీదులు కూల్చివేసేందుకు శ్రీరామసేన ప్రణాళికను రచిస్తోందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి కోబ్రాపోస్ట్ వెబ్సైట్ చెప్పింది అక్షరాల సత్యమని పేర్కొన్నారు. పథకం ప్రకారం జరిగిన ఆ ఘటనలో తాను కూడా సభ్యుడనన్నారు. సంఘ్ పరివార్ ముందస్తు పథకంలో భాగంగానే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిందని, దీనిని బీజేపీ తప్పక ఒప్పుకోవాల్సిందేనన్నారు. శ్రీరాముని సేవ కోసం తాను ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. -
సబీర్‌కు బీజేపీ రాంరాం
పార్టీలో చేర్చుకున్న 24 గంటల్లోపే సభ్యత్వం రద్దు పార్టీలో, ఆర్ఎస్ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కారణం న్యూఢిల్లీ: ఇటీవల శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన బీజేపీ.. మరోసారి నాలిక్కరుచుకుంది. వివాదాస్పద జేడీయూ నాయకుడు సబీర్ అలీని పార్టీలో ఇలా చేర్చుకుని 24 గంటలు తిరిగేలోపే తూచ్ అంటూ శనివారం ఆయన సభ్యత్వం రద్దు చేసింది. సబీర్ అలీ చేరికపై అటు పార్టీలో అంతర్గతంగా, ఇటు ఆర్ఎస్ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వేరే దారిలేక ఆయన్ను సాగనంపింది. ఒకే వారంలో ఇలాంటి రెండు ఘటనలు.. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేశాయి. ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు స్నేహితుడైన సబీర్ అలీని పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుపోతే దావూద్ ఇబ్రహీంను కూడా పార్టీలో చేర్చుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. తాజా పరిణామం నేపథ్యంలో నఖ్వీ.. ట్విట్టర్లో అలీపై చేసిన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. కోరింది జరిగిందని, ఇక ఈ అంశం ముగిసిందని పేర్కొన్నారు. పార్టీ నేతలు విమర్శిస్తున్నారనే.. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. సబీర్ అలీ చేరికపై ఆర్ఎస్ఎస్తోపాటు పార్టీ సభ్యులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించినట్లు చెప్పారు. నఖ్వీ లాంటి పార్టీ నేతలు కొందరు బహిరంగంగా చేసిన కామెంట్లను పరిశీలించాక రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. -
'మంగుళూరు పబ్ ఘటనను మర్చిపోయారు'
బెంగళూరు: మంగుళూరు పబ్ ఘటనను ప్రజలు మర్చిపోయారని, ఆ సంఘటన దురదృష్టకరమని వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. తనకు ఇచ్చిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నామని తెలిపారు. బీజేపీ తనను అమావనించిందని వాపోయారు. ఇటువంటి చర్యలు తప్పుడు సందేశాలు పంపే అవకాశముందని అన్నారు. తనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలకు తోసిపుచ్చారు. ప్రమోద్ ముతాలిక్ను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు.