సబీర్‌కు బీజేపీ రాంరాం
పార్టీలో చేర్చుకున్న 24 గంటల్లోపే సభ్యత్వం రద్దు
పార్టీలో, ఆర్‌ఎస్‌ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కారణం
న్యూఢిల్లీ: ఇటీవల శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్‌ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన బీజేపీ.. మరోసారి నాలిక్కరుచుకుంది. వివాదాస్పద జేడీయూ నాయకుడు సబీర్ అలీని పార్టీలో ఇలా చేర్చుకుని 24 గంటలు తిరిగేలోపే తూచ్ అంటూ శనివారం ఆయన సభ్యత్వం రద్దు చేసింది. సబీర్ అలీ చేరికపై అటు పార్టీలో అంతర్గతంగా, ఇటు ఆర్‌ఎస్‌ఎస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వేరే దారిలేక ఆయన్ను సాగనంపింది.
ఒకే వారంలో ఇలాంటి రెండు ఘటనలు.. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడేశాయి. ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు స్నేహితుడైన సబీర్ అలీని పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుపోతే దావూద్ ఇబ్రహీంను కూడా పార్టీలో చేర్చుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. తాజా పరిణామం నేపథ్యంలో నఖ్వీ.. ట్విట్టర్‌లో అలీపై చేసిన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. కోరింది జరిగిందని, ఇక ఈ అంశం ముగిసిందని పేర్కొన్నారు.
పార్టీ నేతలు
విమర్శిస్తున్నారనే..
బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. సబీర్ అలీ చేరికపై ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు పార్టీ సభ్యులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించినట్లు చెప్పారు. నఖ్వీ లాంటి పార్టీ నేతలు కొందరు బహిరంగంగా చేసిన కామెంట్లను పరిశీలించాక రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.