'మంగుళూరు పబ్ ఘటనను మర్చిపోయారు'
బెంగళూరు: మంగుళూరు పబ్ ఘటనను ప్రజలు మర్చిపోయారని, ఆ సంఘటన దురదృష్టకరమని వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. తనకు ఇచ్చిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నామని తెలిపారు.
బీజేపీ తనను అమావనించిందని వాపోయారు. ఇటువంటి చర్యలు తప్పుడు సందేశాలు పంపే అవకాశముందని అన్నారు. తనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలకు తోసిపుచ్చారు. ప్రమోద్ ముతాలిక్ను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు.