శ్రీరామసేనపై వేటు!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోచన
సంస్కృతి పరిరక్షణ పేరుతో దౌర్జన్యాలా?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ప్రమోద్ ముతాలిక్ సారథ్యంలోని శ్రీరామ సేనను నిషేధించాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెల్గాం పర్యటనలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన గోవాలో ఇదివరకే శ్రీరామ సేనను నిషేధించారని గుర్తు చేశారు. సంస్కృతి పరిరక్షణ పేరుతో దౌర్జన్యాలకు దిగుతున్న ఇలాంటి సంస్థలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు లేదని తేల్చి చెప్పారు.
శ్రీరామ సేన వైఖరిలో మార్పు వస్తుందని ఎదురు చూసినప్పటికీ, నిరాశే మిగిలిందని అంటూ దానిని నిషేధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు చెప్పారు. కాగా నాలుగో తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన సాగించాలనే విషయమై సుప్రీం కోర్టులో మరో అప్పీలును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇదివరకే దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టి వేసినందున, న్యాయ నిపుణులతో చర్చించి అప్పీలుకు వెళ్లడానికి ప్రయత్నిస్తామన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వ న్యాయ పోరాటం ముగిసిపోలేదని చెప్పారు. దీనిపై అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వివిధ పార్టీలు అభిప్రాయాలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. కాగా కాంగ్రెస్ శాసన సభ్యులు విదేశ పర్యటనలకు వెళ్లిన విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వారి ఖర్చుతో వెళితే తానేం చేయగలనని నిలదీశారు. ప్రభుత్వ ఖర్చయితే తాను సమాధానం చెప్పగలనని అంటూ, వ్యక్తిగత పర్యటనలపై వెళ్లే వారిని ఎలా నిలువరిస్తామని ఎదురు ప్రశ్నించారు.