బయో రాకెట్ గుట్టు రట్టు
పరకాల: రూ. 500 విలువైన బయో మందులను కొనుగోలు చేస్తే చాలు... మరో రూ.2500 విలువైన వాటిని ఉచితంగా అందిస్తాం. బయో ఎరువుల వల్ల పంటలో పూత వస్తుంది.. కాత నిలుస్తుంది.. పురుగుల మందుల బాధ ఉండదు.. అనుకున్న దిగుబడి వస్తుందనే ప్రకటనలతో రైతులను దోపిడీ చేస్తున్న రాకెట్‌ను వ్యవసాయాధికారులు గుట్టురట్టు చేశారు. పరకాల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకు పై అంతస్తులో బయో ఎరువుల గోదాం నుంచి జరుగుతున్న మోసపూరిత వ్యాపారాన్ని అధికారులు గురువారం గుర్తించారు. బయో మందుల దందాకు సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి మందులను సీజ్ చేశారు.
ఏఓ నాగరాజు కథనం ప్రకారం.. పరకాల పట్టణం కేంద్రంగా గ్రామీణ ప్రాంతాల్లో బయో ఎరువులను కొంతమంది ఏజెంట్ల ద్వారా విక్రరుుస్తున్నారు. ఒక మందు కొంటే.. ఒకటి ఉచితంగా వస్తుందని చెబుతూ బిల్లులు లేకుండా విక్రయూలు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులకు కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో తనతోపాటు ఏఈఓలు అనిల్‌కుమార్, గోపి తదితరులు బయో ఎరువుల గోదాంలో సోదాలు నిర్వహించారు.
అనుమతి లేని తీజ్, షాక్, వెపన్, ఫ్రీడమ్, ఎస్వీ పాంజ్ వంటి ఐదు రకాల మందులు లభ్యమయ్యాయి. శ్రీ విజయ ఫర్టిలైజర్ నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా పేరుతో ఉన్న మందులను గుర్తించారు. పట్టుకున్న మందుల విలువ రూ.1,38,894 ఉంటుందని నాగరాజు తెలిపారు. ఈ మేరకు కస్టమర్ కేర్ మేనేజర్ ధనంజయరెడ్డి, డెరైక్టర్ తిరుపతిరెడ్డి, చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.