Sricity SEZ
-
శ్రీసిటీ టు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
వరదయ్యపాళెం: వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పటి నుంచి శ్రీసిటీలోని బీఎఫ్జీ ఇండియా పరిశ్రమ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకు ఫైబర్ రీఇన్ఫోర్స్ ప్లాస్టిక్ (ఎఫ్ఆర్పీ) విడి భాగాలను సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో శ్రీసిటీలో తొలిసారిగా ఏర్పాటైన 8 పరిశ్రమల్లో బీఎఫ్జీ ఒకటి. బీఎఫ్జీ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బీఎఫ్జీ ఇండియా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్, దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకు నాణ్యమైన, ప్రపంచస్థాయి ఎఫ్ఆర్పీ విడి భాగాలను అందిస్తోంది. శ్రీసిటీ సెజ్‌లో ఉన్న బీఎఫ్జీ ఇండియా 2009 నుంచి పవన శక్తి, నిర్మాణం, రవాణా వంటి వివిధ రంగాల్లో ఉన్న పరిశ్రమల కోసం ఎఫ్ఆర్పీ మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతుల నిర్మాణాలను తయారు చేస్తోంది. మెట్రోకోచ్ తయారీ సంస్థలు– ఆల్స్టం, బొంబార్డియర్, వోల్వో, ఇండియన్ రైల్వేస్‌కి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), జనరల్ ఎలక్ట్రికల్–ఎనర్జీ, గమేశ, కొచ్చిన్ షిప్ యార్డ్, థెర్మాక్స్, ఆర్సీఎఫ్, ఎంసీఎఫ్, బెచ్‌టెల్ వంటి సంస్థలకు బీఎఫ్జీ ఇండియా సేవలందిస్తోంది. 329 రకాల ఎఫ్ఆర్పీ ప్యానెల్స్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో రైలు పెట్టెలోని ఇంటీరియర్లు, టాయిలెట్ క్యాబిన్, ఇంజన్ ముందు భాగాన్ని బీఎఫ్జీ సంస్థే సరఫరా చేస్తోంది. ఇచ్చిన పనులను రికార్డు స్థాయిలో 10 నెలల్లో బీఎఫ్జీ పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయంగా రూపొందించడానికి వివిధ రంగుల ప్యానెల్స్‌ను ఈ కంపెనీ తయారీ చేసింది. ఒక్కోరైలు కోసం 329 రకాల ఎఫ్ఆర్పీ ప్యానెల్స్ తయారయ్యాయ. ఢిల్లీ మెట్రో రోలింగ్ స్టాక్(కోచెస్) కోసం బొంబార్డియర్ ట్రాన్స్పోర్టేషన్తో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఇంటీరియర్స్, ఫ్రంట్ ఎండ్లు, డ్రైవర్ క్యాబ్‌లతో సహా ఎఫ్ఆర్పీ విడి భాగాలను బీఎఫ్జీ ఇండియా సరఫరా చేస్తోంది. చెన్నై, కొచ్చి, మెట్రో ప్రాజెక్ట్‌ల మెట్రో రోలింగ్ స్టాక్ కోసం సైడ్ వాల్స్, సెంట్రల్ సీలింగ్‌లు, లేటరల్ సీలింగ్‌లు, గ్యాంగ్వే విభజనలు, క్యాబ్ విభజనలతో సహా వివిధ భాగాలను శ్రీసిటీలోని ఆల్స్టోమ్ ఇండియాకు బీఎఫ్జీ సరఫరా చేస్తోంది. -
ఏసీల హబ్‌గా భారత్.. కీలకంగా మారనున్న ఏపీలోని శ్రీసిటీ
న్యూఢిల్లీ: ఏసీల తయారీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) దేశీయ కంపెనీలకు తగినన్ని అవకాశాలు కల్పిస్తాయని.. అంతర్జాతీయంగా పోటీపడే సత్తా సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశం దేశీయ కంపెనీలకు లభిస్తుందని డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ప్యానాసోనిక్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆమోదం గత బుధవారం కేంద్ర ప్రభుత్వం వైట్‌గూడ్స్(ఏసీలు, ఏసీల విడిభాగాలు)కు సంబంధించి 42 దరఖాస్తులను పీఎల్ఐ పథకం కింద ఆమోదించడం గమనార్హం. ఇందులో 26 దరఖాస్తులు ఏసీల తయారీకి సంబధించినవి ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.3,898 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏపీలో డైకిన్, బ్లూస్టార్ ప్రాజెక్టులు తాజాగా ప్రభుత్వ ఆమోదం పొందిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండస్ట్రీస్ ఇండియా (జపాన్ కంపెనీ) ఒక్కటే రూ.539 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో 75 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. కంప్రెషర్లు, హీట్ ఎక్సే్ఛంజర్లు, షీట్‌మెటల్ కాంపోనెంట్స్, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్‌ను డైకిన్ తయారు చేయనుంది. ‘మేము ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నది కేవలం భారత మార్కెట్ కోసమే కాదు. పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని అనుకుంటున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంతో సానుకూలంగా ఉంది’ అని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు తయారీ కేంద్రంగా భారత్‌ను చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘చైనా వన్‌ప్లస్ నమూనాపై దృష్టి పెట్టాం. కరోనా తర్వాత చైనా పట్ల వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న మా మూడో ప్లాంట్ కోసం 75 ఎకరాల భూమిని తీసుకున్నాం’’ అని జావా చెప్పారు. శ్రీ సిటీలోనే బ్లూస్టార్ ప్రాజెక్టు కూడా త్వరలో రానుంది. పీఎల్ఐ కింద హీట్ ఎక్సేంజర్లు, షీట్ మెటల్ కాంపోనెంట్లను శ్రీసీటీలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో తయారు చేయనున్నట్టు బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. దేశంలో ఏసీల విడిభాగాల తయారీ వ్యవస్థ వచ్చే మూడేళ్లలో మంచి స్థితికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. వోల్టాస్ ఆత్మనిర్భర భారత్ డొమెస్టిక్ ఏసీల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న వోల్టాస్ సైతం క్రాస్ ఫ్లో ఫ్యాన్, హీట్ ఎక్సే్ఛంజర్లు, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి పీఎల్ఐ కింద అర్హత సాధించింది. తమ తయారీ సదుపాయల ద్వారా దేశీయ తయారీ రంగానికి మరింత చేదోడుగా నిలవనున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదించిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండియా, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ టెక్నోప్లాస్ట్, హిందాల్కో ఇండస్ట్రీస్, మెట్యూబ్ ఇండియా, బ్లూస్టార్ క్లిమాటెక్, హావెల్స్, జాన్సస్ కంట్రోల్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్, వోల్టాస్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, డిక్సన్ డివైజెస్, ప్యానాసోనిక్ ఇండియా, సిస్కా ఎల్ఈడీ లైట్స్, హేయర్ అప్లియన్సెస్ ఉన్నాయి. చదవండి :అయ్యగారికి దండం పెట్టు.. క్యూఆర్ కోడ్‌కి డబ్బులు కొట్టు... -
శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు
సాక్షి, తడ: శ్రీసిటీ పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఎంతో ఈ ప్రాంతం అనుకూలమని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ కితాబిచ్చారు. మంగళవారం శ్రీసిటీ పర్యటనకు వచ్చిన ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మౌలిక సదుపాయాలు, ప్రత్యేకతలు, అభివృద్ధిని వివరించారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రోటోలోక్, ఎంఎండీతో సహా 7 సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో ఏర్పాటు చేశాయని వివరించారు. అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెవిుంగ్ మాట్లాడుతూ.. శ్రీసిటీ యాజమాన్యం ధార్శినికత, అభివృద్ధి తమకెంతో నచ్చాయన్నారు. శ్రీసిటీలో 7 బ్రిటిష్ పరిశ్రమలు ఏర్పాటుకావడం సంతోషదాయకమన్నారు. యూకే ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తృతపరిచే దిశగా శ్రీసిటీ పర్యటనకు వచ్చామన్నారు. త్వరలో మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి రానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతంషగా భారతదేశం అవతరించిందన్నారు. మన దేశంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న ఐరోపా దేశాలలో యూకే అగ్రస్థానంలో ఉందన్నారు.అనంతరం శ్రీసిటీ వ్యాపార వాణిజ్య కేంద్రంలో ఇరువురి మధ్య పరస్పర చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీసిటీ గురించి వివిధ అంశాలపై డాక్టర్ ఫ్లెవిుంగ్ ఆరా తీశారు. వీరి వెంట ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలీ, దక్షిణ భారతదేశం ఇన్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్, లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సీనియర్ ట్రేడ్ అడ్వైజర్ హర్‡్ష ఇంద్రారుణ్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ప్రెస్, కమ్యూనికేషన్స్ హెడ్ పద్మజా కొనిశెట్టి, హెచ్ఆర్ ఆఫీసర్ నిధి శ్రీవాస్తవ ఉన్నారు. -
సత్యవేడులో దళితుల ఆందోళన
తిరుపతి : చిత్తూరు జిల్లా సత్యవేడులో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. సత్యవేడు తహసీల్దార్ కార్యాలయాన్ని దళితులు ముట్టడించి శ్రీసిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీసిటీ పరిధిలోని రామచంద్రాపురంలో కేటాయించిన భూములను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. లేనిపక్షంలో ఐఐఐటీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
శ్రీసిటీలో యూనిఛామ్ పరిశ్రమకు భూమిపూజ
తడ, న్యూస్‌లైన్: శ్రీసిటీ సెజ్‌లో జపాన్‌కు చెందిన కంపెనీ యూనిఛామ్ రూ.250 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సోమవారం సెజ్‌లో భూమిపూజ నిర్వహించారు. యూనిఛామ్ కంపెనీ సీఎండీ మియాభహి మాట్లాడుతూ తమ పరిశ్రమలో నాప్కిన్స్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. నాలుగు దశలుగా నిర్మించే పరిశ్రమలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొదట 400 మందికి, పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ 20 కేంద్రాల్లో విస్తరించిందన్నారు. భారతదేశంలో రెండో యూనిట్‌కు శ్రీకారం చుట్టామని, 2020 నాటికి రూ.90 వేల కోట్ల వ్యాపారం చేయడం తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో యూనిఛామ్ భారత్ యూనిట్ ఎండీ కిమురా, శ్రీసిటీ డెరైక్టర్ పోచారెడ్డి ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇసుజు’కు రాయితీల పంట!
* పెట్టుబడికి మించి వ్యాట్ రాయితీ * కోతలు లేకుండా విద్యుత్ సరఫరా * ఎస్‌ఐపీసీతో సంబంధం లేకుండానే ఉత్తర్వులు * వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఇసుజు’కి ప్రభుత్వం రాయితీల పంట పండించింది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఇసుజు కంపెనీ ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి రాయితీలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిబంధనలకు నీళ్లొదిలందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం సాధారణంగా కంపెనీ పెట్టుబడిలో 50 శాతం మాత్రమే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాయితీగా ఇస్తారు. అయితే, ఇసుజుకు ఏకంగా పెట్టుబడి కన్నా 135 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతోపాటు 30 ఏళ్ల పాటు 100 శాతం నికర వ్యాట్ రాయితీ ఇవ్వాలని, అంతేకాకుండా 5 శాతం ఇన్పుట్ వ్యాట్ రాయితీని కూడా 30 ఏళ్లపాటు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ)తో సంబంధం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. అయితే, కంపెనీ ఉద్యోగాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి కల్పిస్తేనే రాయితీలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇసుజుకు ప్రభుత్వం ఇచ్చిన మరికొన్ని వరాలు కంపెనీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత అంటే 31 డిసెంబర్ 2014 నుంచి ఏడాదిలో 365 రోజులూ నిరాటంకంగా విద్యుత్ సరఫరా ప్రతి 3 నెలలకోసారి పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, సేల్స్ డ్యూటీ తదితర రాయితీల చెల్లింపు మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, మార్ట్గేజ్ డ్యూటీలకు 100 శాతం మినహాయింపు ఐదేళ్ల పాటు 2 వేల మందికి ఒక్కోక్కరికి 10 వేల చొప్పున శిక్షణ ఖర్చు కింద కంపెనీకి చెల్లింపు శ్రీసిటీకి వెలుపల కూడా కేవలం రోడ్లు, నీటి సరఫరానే కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పన పన్ను విధానంలో భవిష్యత్తులో మార్పులు వచ్చినప్పటికీ ఈ రాయితీలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం. నేరుగా పని కానిచ్చారు! ఏదైనా పరిశ్రమలకు ఏ మేర రాయితీ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించేందుకు రాష్ట్రంలో ఒక విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలిపి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఉంటుంది. సీఎం నేతృత్వం లోని వివిధ శాఖల మంత్రులు, అధికారులతో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) ఉంటుంది. పరిశ్రమలు కోరుతున్న రాయితీ లేమిటి? రాష్ట్ర పారిశ్రామిక విధానం ఏం చెబుతోంది? కంపెనీ కోరిన రాయితీలివ్వవచ్చా? అనే అంశాల్ని ఎస్ఐపీసీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎస్ఐపీసీ నిర్ణయాలపై ఎస్ఐపీబీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఏ పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలన్నా తొలుత ఎస్ఐపీసీలో చర్చించాల్సి ఉంటుంది. అనంతరమే ఎస్ఐపీబీ పరిశీలనకు వస్తుంది. అయితే, ఇసుజు విషయంలో ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎస్ఐపీసీలో చర్చించకుండానే... నేరుగా ఎస్ఐపీబీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేశారు. అనేక ఇతర పరిశ్రమల అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండగా, పారిశ్రామిక విధాన నిబంధనలను పట్టించుకోకుండా ఇసుజుకు భారీగా రాయితీలు కల్పించడాన్ని పారిశ్రామిక వర్గాలు విమర్శిస్తున్నాయి.