న్యూఢిల్లీ: ఏసీల తయారీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ పథకం) దేశీయ కంపెనీలకు తగినన్ని అవకాశాలు కల్పిస్తాయని.. అంతర్జాతీయంగా పోటీపడే సత్తా సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశం దేశీయ కంపెనీలకు లభిస్తుందని డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ప్యానాసోనిక్ కంపెనీలు పేర్కొన్నాయి.
ప్రభుత్వ ఆమోదం
గత బుధవారం కేంద్ర ప్రభుత్వం వైట్‌గూడ్స్(ఏసీలు, ఏసీల విడిభాగాలు)కు సంబంధించి 42 దరఖాస్తులను పీఎల్‌ఐ పథకం కింద ఆమోదించడం గమనార్హం. ఇందులో 26 దరఖాస్తులు ఏసీల తయారీకి సంబధించినవి ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.3,898 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఏపీలో డైకిన్, బ్లూస్టార్ ప్రాజెక్టులు
తాజాగా ప్రభుత్వ ఆమోదం పొందిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండస్ట్రీస్ ఇండియా (జపాన్ కంపెనీ) ఒక్కటే రూ.539 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో 75 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. కంప్రెషర్లు, హీట్ ఎక్సే్ఛంజర్లు, షీట్‌మెటల్ కాంపోనెంట్స్, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్‌ను డైకిన్ తయారు చేయనుంది. ‘మేము ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నది కేవలం భారత మార్కెట్ కోసమే కాదు. పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని అనుకుంటున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంతో సానుకూలంగా ఉంది’ అని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు తయారీ కేంద్రంగా భారత్‌ను చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘చైనా వన్‌ప్లస్ నమూనాపై దృష్టి పెట్టాం. కరోనా తర్వాత చైనా పట్ల వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న మా మూడో ప్లాంట్ కోసం 75 ఎకరాల భూమిని తీసుకున్నాం’’ అని జావా చెప్పారు. శ్రీ సిటీలోనే బ్లూస్టార్ ప్రాజెక్టు కూడా త్వరలో రానుంది. పీఎల్‌ఐ కింద హీట్ ఎక్సేంజర్లు, షీట్ మెటల్ కాంపోనెంట్లను శ్రీసీటీలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో తయారు చేయనున్నట్టు బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. దేశంలో ఏసీల విడిభాగాల తయారీ వ్యవస్థ వచ్చే మూడేళ్లలో మంచి స్థితికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.
వోల్టాస్ ఆత్మనిర్భర భారత్
డొమెస్టిక్ ఏసీల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న వోల్టాస్ సైతం క్రాస్ ఫ్లో ఫ్యాన్, హీట్ ఎక్సే్ఛంజర్లు, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి పీఎల్‌ఐ కింద అర్హత సాధించింది. తమ తయారీ సదుపాయల ద్వారా దేశీయ తయారీ రంగానికి మరింత చేదోడుగా నిలవనున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదించిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండియా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పీజీ టెక్నోప్లాస్ట్, హిందాల్కో ఇండస్ట్రీస్, మెట్యూబ్ ఇండియా, బ్లూస్టార్ క్లిమాటెక్, హావెల్స్, జాన్సస్ కంట్రోల్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్, వోల్టాస్, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, డిక్సన్ డివైజెస్, ప్యానాసోనిక్ ఇండియా, సిస్కా ఎల్‌ఈడీ లైట్స్, హేయర్ అప్లియన్సెస్ ఉన్నాయి.
చదవండి :అయ్యగారికి దండం పెట్టు.. క్యూఆర్ కోడ్‌కి డబ్బులు కొట్టు...
Comments
Please login to add a commentAdd a comment