sridhar sipana
-
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
అందుకే నాకు వయసు గుర్తుకు రాదు: కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్‌లైన్. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. చదవండి: పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్ -
ఆ మాట ఆస్కార్‌తో సమానం
‘‘ప్రతి రచయితకూ ఓ విజన్ ఉంటుంది. ఆ విజన్‌ని తెరపైకి ఎక్కించడంలో ఓ కిక్ ఉంటుంది. రచయితలు రాసిన కొన్ని కథలు ఒక్కోసారి దర్శకులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నిర్మాతలను ఒప్పించి మేమే దర్శకత్వం చేయాలి. మా విజన్‌ని అప్పుడే తెరపై చూపించగలం.. అందుకే నేను రచయిత నుంచి డైరెక్టర్‌గా మారాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. ‘నమో వెంకటేశ, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, డిక్టేటర్’ వంటి పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన ‘బృందావనమది అందరిది’ చిత్రంతో దర్శకునిగా మారారు. బుధవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బృందావనమది అందరిది’ నా తొలి సినిమా. ఆ చిత్రానికి నా స్నేహితులు శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్ నిర్మాతలు. వారికి ఇండస్ట్రీ కొత్త కావడంతో ప్రొడక్షన్ పనులూ నేనే చూసుకున్నాను. దర్శకుడిగా నా రెండో సినిమా చిరంజీవిగారి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఉంటుంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తారు. కల్యాణ్ దేవ్ సినిమా విడుదల తర్వాతే ‘బృందావనమది అందరిది’ చిత్రం విడుదలవుతుంది. కరోనాకి ముందు ‘ఆచార్య’ కోసం కొరటాల శివగారితో కలిసి చిరంజీవిగారితో స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్నాను. అప్పుడు కల్యాణ్ దేవ్‌తో తీసే కథని చిరంజీవిగారు, కొరటాలగారు విని బాగా ఎంజాయ్ చేశారు. ‘కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాటతో ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం దక్కింది. డైరెక్టర్‌గానే కాదు.. రచయితగానూ కొనసాగుతాను. ప్రస్తుతం డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుగారి సినిమాకి, అనిల్ సుంకరగారి ప్రొడక్షన్లో ఓ సినిమాకి డైలాగులు రాస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలకు చర్చలు జరిగాయి. ఓ వెబ్ సిరీస్ రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవుతుంది’’ అన్నారు. -
ప్రేమ.. వినోదం
‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తన మూడో చిత్రం కూడా ఖరారైంది. ‘దూకుడు, నమోః వెంకటేశాయ, పూలరంగడు, లౌక్యం’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ–‘‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను నేను దర్శకుడిగా పరిచయం కావడానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కథకు కళ్యాణ్ దేవ్ సరైన కథానాయకుడనిపించింది. ప్రేమతో కూడిన వినోదభరితమైన చిత్రం ఇది. నాపై నమ్మకం ఉంచి, దర్శకునిగా అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతల గౌరవాన్ని పెంచగలననే నమ్మకం ఉంది’’ అన్నారు. -
బృందావనంలో కొత్తవాళ్లు!
‘బృందావనమది అందరిది’ చిత్రంతో తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్నారు. అంతా కొత్త నటీనటులతో తీయనున్న ఈ సినిమా గురించి శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది. రచయితగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు దర్శకుడిగానూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జంధ్యాలగారిలా అందరూ నవ్వుకునే సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్ కథలు ఉన్నా అవన్నీ పక్కనపెట్టి ఈ వినోదాత్మక కథను ఎంచుకున్నాను. వినోదాత్మకంగా ఉంటూనే మనలోని బంధాలను గుర్తు చేసేలా ఉంటుందీ సిన్మా. కథ, ఫైట్లు, పాటలు ఉండే సాధరణ చిత్రంలా ఉండదు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకో మార్క్ తెచ్చుకోవాలనుకుంటున్నాను’’అన్నారు. -
దర్శకుడిగా మారుతున్న మరో రచయిత
పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకు బృందావనమది అందరిది అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూలరంగడు, లౌక్యం, అహనా పెళ్లంట, భీమవరం బుల్లోడు, సర్దార్ గబ్బర్ సింగ్, పవర్, పోటుగాడు, డిక్టేటర్ వంటి చిత్రాలతో రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు శ్రీధర్ సీపాన. తన కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకోవటం శ్రీదర్ సిపాన స్టైల్. ఈయన బృందావనమది అందరిదీ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ...'దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. రచయితగా నన్నెంతో ఆదరించారు. ఆ ఆదరణ, గుర్తింపు ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అవుతున్నాను. తొలి చిత్రంగా బృందావనమది అందరిదీ అనే సినిమాను చేస్తున్నాను. ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటూ మనలోని బంధాలను గుర్తు చేసే కథ. ఫైట్లు, పాటలు ఉండే సాధారణ చిత్రంలా ఉండదు. నాకు రచయిత జంధ్యాల గారంటే అభిమానం. ఆయన అహనా పెళ్లంట సినిమాలా...కుటుంబమంతా హాయిగా నవ్వుకునే సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్ కథలు ఉన్నా...అవన్నీ పక్కనబెట్టి ఈ కథను ఎంచుకున్నాను. తొలి సినిమా కాబట్టి...హాస్యం, భావోద్వేగాలు కలిసిన కథ అయితే బాగుంటుందని భావించాను. ఈ చిత్రం ద్వారా నాకొక మార్క్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ నెల 29న నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తాన'ని తెలిపారు.