దర్శకుడిగా మారుతున్న మరో రచయిత
పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకు బృందావనమది అందరిది అనే టైటిల్ను ఖరారు చేశారు. పూలరంగడు, లౌక్యం, అహనా పెళ్లంట, భీమవరం బుల్లోడు, సర్దార్ గబ్బర్ సింగ్, పవర్, పోటుగాడు, డిక్టేటర్ వంటి చిత్రాలతో రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు శ్రీధర్ సీపాన.
తన కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకోవటం శ్రీదర్ సిపాన స్టైల్. ఈయన బృందావనమది అందరిదీ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ...'దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. రచయితగా నన్నెంతో ఆదరించారు. ఆ ఆదరణ, గుర్తింపు ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అవుతున్నాను. తొలి చిత్రంగా బృందావనమది అందరిదీ అనే సినిమాను చేస్తున్నాను.
ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటూ మనలోని బంధాలను గుర్తు చేసే కథ. ఫైట్లు, పాటలు ఉండే సాధారణ చిత్రంలా ఉండదు. నాకు రచయిత జంధ్యాల గారంటే అభిమానం. ఆయన అహనా పెళ్లంట సినిమాలా...కుటుంబమంతా హాయిగా నవ్వుకునే సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్ కథలు ఉన్నా...అవన్నీ పక్కనబెట్టి ఈ కథను ఎంచుకున్నాను. తొలి సినిమా కాబట్టి...హాస్యం, భావోద్వేగాలు కలిసిన కథ అయితే బాగుంటుందని భావించాను. ఈ చిత్రం ద్వారా నాకొక మార్క్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ నెల 29న నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తాన'ని తెలిపారు.