తెలంగాణ ఎత్తుగడ
ఉత్తమ్‌కు... టీఆర్ఎస్ చెక్
హుజూర్నగర్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌తోనే తంటాలు పడుతున్న కాంగ్రెస్
చీలిపోనున్న తెలంగాణవాద ఓట్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ ప్రత్యక్షపోరుకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై గరంగరం వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ పెద్దఎత్తే వేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారు.
వాస్తవానికి మొన్న మొన్నటి దాకా టీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పొత్తుల దారులు కూడా మూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండనేఉండదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. జిల్లాలో ఆయకట్టు ప్రాంతంలో టీఆర్ఎస్కు అంతగా పట్టులేదని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, హుజూర్నగర్ నుంచి శంకమర్మకు టికెట్ ఇచ్చి తెలంగాణ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకునేందుకు గులాబీ దళపతి వ్యూహాత్మక ఎత్తుగడే వేశారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే... వైఎస్సార్ సీపీతో తంటాలు
వాస్తవానికి గతేడాది ఫిబ్రవరిలో జరిగిన సహకార సంస్థల ఎన్నికల నాటి నుంచే హుజూర్నగర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా తయారైంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వెళుతూ, కలిసి పోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సత్ఫలితాలనే సాధించింది. ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నాయకుల అంచనాలను తల కిందులు చేస్తూ సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల తర్వాతే, మంత్రి హోదాలో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నయాన్నో, భయాన్నో పలువురు సర్పంచ్‌లను బలవంతంగా కాంగ్రెస్‌లోకి లాగే సుకున్నారు.
ఇక, అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పర్యటన పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను అడ్డుకున్నారు. మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కచ్చితంగా ఇబ్బంది ఉంటుం దని బలంగా నమ్మిన ఆయన ఎక్కడికక్కడ సమస్యలు సృష్టించారన్నది వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వాదన. కేవలం తెలంగాణవాదాన్ని ముందు పెట్టి విజయమ్మ పర్యటనను అడ్డుకున్న ఉత్తమ్ ఇపుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు.
ఆయనా తెలంగాణవాద ఓటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో ఏమంత చురుగ్గా పాల్గొన్నాడని, తెలంగాణవాదులు ఆయన గురించి ఆలోచిస్తారని టీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం లో ముందువరుసలో ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు పావులు కదుపుతోంది. జిల్లాలో వారికి కనీసం రెండు స్థానాలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగానే హుజూర్నగర్ స్థానం నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఈ సీటును కేటాయించినట్లు జిల్లా టీఆర్ఎస్ వర్గాలు తెలి పాయి. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్, మరోవైపు టీఆర్ఎస్ దాడిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
26 లోగా నియోజకవర్గ బాధ్యతలు
వరంగల్ జిల్లా పాల కుర్తి టికెట్ కావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అడిగా. అయితే ఆయన నన్ను ఎమ్మెల్సీగా పంపిస్తానని చెప్పారు. వద్దని తిరస్కరించా... నాకు పరిచయం ఉన్న నాలుగైదు నియోజకవర్గాలో ఏదోఒకచోట సీటివ్వాలని అడిగా. దాదాపు అన్నిచోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, హుజూర్నగర్ నుంచి పోటీకి దిగమని కేసీఆరే స్వయంగా సూచించారు. ఈ నెల 26వ తేదీలోగా ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. - శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ