పాలసీవైపే మార్కెట్ల చూపు
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను మంగళవారంనాటి రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం నిర్దేశిస్తుందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలువడుతున్న తొలి పరపతి విధానం అయినందున, ఆశ్చర్యపరిచే ప్రకటనలేవైనా వుంటాయా అన్న అంశమై మార్కెట్లో ఆసక్తి నెలకొంది. వ్యవస్థలో వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కీలక రేట్లు యథాతథంగా వుండొచ్చన్న అంచనాలు అధికంగా వున్నప్పటికీ, తాత్కాలికంగా ద్రవ్యోల్బణ భయాలను పక్కనపెట్టి, రేట్లను ఆర్బీఐ తగ్గించవచ్చని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. రేట్లలో మార్పు వుండకపోవచ్చన్న ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, పరపతి విధానంలో అనుకూల ఆశ్చర్యకర ప్రకటనలు వెలువడవచ్చని తాము అంచనావేస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
కార్పొరేట్ల ఫలితాల సీజన్ దాదాపు ముగిసినందున, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్, అంతర్జాతీయ మార్కెట్ల గమనం, డాలరుతో రూపాయి విలువ కదలికలు సమీప భవిష్యత్తులో ఇక్కడి షేర్ల ధరలను ప్రభావితం చేయవచ్చు. అలాగే మే నెలకు వెల్లడించే అమ్మకాల డేటా ఆధారంగా ఆటోమొబైల్ కంపెనీలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని బ్రోకింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. ఆటో అమ్మకాల డేటాతో పాటు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ గణాంకాలకు ఇన్వెస్టర్ల స్పందనతో ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2013-14 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ వృద్ధి రేటు 5 శాతం దిగువకు జారడం వరుసగా ఇది రెండో ఏడాది. వృద్ధి బలహీనత ఫలితంగా మార్కెట్లో ఏదైనా క్షీణత సంభవిస్తే తాజా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు జరుపుతారని, ఇటీవలి మార్కెట్ ర్యాలీని మిస్సయ్యామన్న భావన చాలామందిలో వుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాలిక్ చెప్పారు. మార్కెట్లకు తదుపరి పెద్ద ట్రిగ్గర్ 2014-15 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ అని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ జూలై నెలలో వుండవచ్చని భావిస్తున్నారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 476 పాయింట్లు క్షీణించింది. ఈ ఏడాది జనవరి 31తో ముగిసిన వారం తర్వాత ఇదే పెద్ద క్షీణత. అప్పటివారంలో సెన్సె క్స్ 620 పాయింట్లు పతనమయ్యింది. అయితే మే నెలలో సూచీ 1,800 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. ఒకే నెలలో ఇంత పెద్ద ఎత్తున పెరగడం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే ప్రథమం.