Srikrishnadevaraya university
-
అధ్యాపకులే కేంద్రంగా విద్యాభివృద్ధి
విద్యాబుద్ధులు నేర్పించాలనేది మన ప్రాచీన కాలం నుండి వస్తున్న సంస్కృతి. విద్యాబుద్థులు నేర్పిం చాలి, నేర్చుకోవాలి అనేవి మన సాంఘిక అవసరంగా గుర్తించారు. నాడు గురుకుల వ్యవస్థ చాలా ప్రాచుర్యంలో వుండేది. విద్యతోపాటు బుద్ధి నేర్పించే విధివిధానాలుండేవి. కానీ నేటి విద్యావిధానంలో బుద్ధి నేర్పించే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాలక్రమేణా గురుకుల వ్యవస్థ అంతరించి, ఉపాధ్యాయ పాఠశాల వ్యవస్థ ఏర్పడింది. నాటి గురువులు విద్యనూ బుద్ధినీ సమానమైన రీతిలో అభ్యాసం చేయించేవారు. కానీ నేడు విద్యార్జనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే సాంఘిక విలువలు పతనావస్థ స్థితికి చేరుతున్నాయని గుర్తించవచ్చు. ప్రస్తుత మన విద్యా విధానంలో విలువలతో కూడిన అధ్యయనం చేయించే ప్రణాళికలు చాలా తక్కువ. పోటీతత్వాన్ని పెంచే దిశగా ప్రయాణం చేస్తుండటంతో ఇప్పుడు విలువలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. నూతన విద్యావిధానంలోని సూచనలు బహుళ ప్రయోజనకారిగా ఉన్నాయని చెప్పవచ్చును. స్కూల్ విద్యా విధానాన్ని మూడు దశలుగా విభజించారు. ఇది విజయవంతం కావాలంటే శాస్త్రీయ పద్ధతిలో దశలవారీ శిక్షణ పొందిన అధ్యాపకులను ఏరికోరి నియమించాలి. విజ్ఞానవంతులైన, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు మన విద్యా విధాన భవిష్యత్తుకు మూలస్తంభాలు. నూతన విద్యావిధానంలో విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రణాళికాబద్ధమైన సూచన చేశారు కానీ, బుద్ధిమంతులను చేసే ప్రక్రియకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చు. విద్యార్థి పోగు చేసుకునే సమాచార సంచయనాన్నే సంపదగా మార్చే ప్రయత్నం జరుగుతోంది కానీ దాన్ని నాలెడ్జ్ బ్యాంక్‌గా మార్చే ప్రయత్నం తక్కువగా జరుగుతున్నది. మనదేశంలో విద్యావిధానాన్ని పాఠశాల విద్యాభ్యాసం, కళాశాల విద్యాభ్యాసం, పరిశోధన అధ్యయన విధానం అనే మూడు దశలుగా విభజించారు. పాఠశాల విద్యాభ్యాస విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పాఠశాల విద్యావిధానంలో ముఖ్యంగా మేధావులైన అధ్యాపకుల సూచనల ఆధారంగా ప్రణాళికలు తయారు చేయటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మన రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేయబోతున్న సందర్భంలో అధ్యాపకులకు దశలవారీ ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతోవుంది. దీనివల్ల మనదేశ మూల సంపద వేగవంతంగా పెరుగుతుంది. అన్ని దశల్లోనూ అధ్యాపకులకు శిక్షణ, అభివృద్ధి ప్రణాళికలు శాస్త్రీయంగా వుండేలా సూచిస్తేనే వివిధ దశలలో విద్యాభ్యాసం విభజనకు అర్థం వుంటుంది. వివిధ దశలలో బోధనా ప్రక్రియకు అధ్యాపకులకు ఎటువంటి శిక్షణ, అభివృద్ధి ప్రయత్నాలు చేయవలసి ఉంటుందనేది నూతన విద్యావిధానంలో విపులంగా లేదు. అవసరానికనుగుణంగా విద్య అధ్యయనం జరుగుతుంది. ఈనాటి విద్య ఉత్పత్తి ఎలా చేయాలి? చేసిన విద్యా ఉత్పత్తిని మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి? అనేదే ప్రధానాంశంగా వుంది. అంతేకాకుండా సేవా రంగం వైపు ఆలోచనలు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు నేటి విద్యా అధ్యయనంలో ప్రధానమయ్యాయి. ఇటువంటి సందర్భాల్లో విద్యావికాసానికి చోటు లేదు. వికాసవంతమైన జీవితానికి తోడ్పడే విద్యావిధానం రానురాను తగ్గుముఖం పట్టింది. విజ్ఞాన సంపద వైపు ప్రస్తుత సమాజం పయనిస్తున్నది. విజ్ఞానసంపదే నికరమైన సంపద. ఈ సంపద దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. విజ్ఞాన సంపద ఎలా సంపాదించాలి అనేదే ముఖ్యమైన అంశం. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత విజ్ఞానభరితమైన జీవితాన్ని మానవుడు గడుపుతున్నాడని గమనించవచ్చు. ఆర్థికాభివృద్ధి చెందిన వర్గాలే విజ్ఞానసంపద భరితమైన సుఖజీవనం సాగిస్తున్నారు. నూతన విద్యావిధానంలో ‘బోధనా విధానం అధ్యయన ప్రక్రియ అన్వేషణాత్మకంగాను, అనుభవ పూర్వకంగాను ప్రభావవంతంగా ఉండాలని’ సూచించారు. బోధనా వృత్తిని స్వీకరించేవారిలో మనోప్రవృత్తిని గమనించి అవకాశం కల్పించాలి. ఆ వృత్తిని స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి శిక్షణ అవసరమనేది నిర్ణయించాలి. అధ్యాపక వృత్తి ఒక విలక్షణమైన ప్రవృత్తి. ఒక వితరణ గుణం కలిగిన వృత్తిగా పరిగణించి అధ్యాపకుల జీవన విధానముండాలి. నూతన జాతీయ విద్యావిధానంలో అధ్యాపకులు అనుభవపూర్వకంగా విద్యను నేర్పాలని సూచించారు. ఎటువంటి అనుభవాలు ఉండాలి? అనే సూచనలు చేయలేదు. అధ్యాపకులు అన్వేషణాత్మక ప్రాతిపదికగా విద్యాబోధన చేయాలని సూచించారు. అధ్యాపకులను అన్వేషణాత్మక పరమైన భావనలు ఉండే వారిని ఎలా ఎంపిక చేయాలో ఇందులో సూచించలేదు. అనుభవపూర్వకంగాను, ప్రభావవంతమైన విద్యను అందించాలని సూచించారు. అనుభవమే లేకపోతే అనుభవపూర్వకమైన విద్యను ఎలా అందించగలరన్నది ప్రశ్న. అలాగే ప్రభావితం చేయగల అధ్యాపకులను ఎన్నిక చేయటం చాలా క్లిష్టమైన ప్రక్రియ. నూతన విద్యా విధానం సఫలీకృతం కావాలంటే వివిధ దశలవారీ నైపుణ్యమున్న అధ్యాపకులను నియమించాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాదశలో డ్రిల్ టీచర్ లాంటివారు, తల్లిపిల్లి వంటి సంస్కారంగల బాధ్యతతో ప్రవర్తించే వారై వుండాలి. అదేవిధంగా మాధ్యమిక, పై చదువులకు ఉత్తేజపరిచే శక్తిగల ఉపాధ్యాయులను నియమించాలి. ఈ ప్రక్రియ చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అలాగే ఉత్తేజపరిచే అధ్యాపకులు, అనుభవసంపన్నులైన ఉపాధ్యాయులు ఉన్నత విద్యకు చాలా ముఖ్యం. అధ్యాపకుడిని ఆచార్యుడు అని కూడా అంటారు. అంటే ఆచరించి చెప్పువాడు అని అర్థం. అధ్యాపకులుగా ఉన్నవారంతా ఆచార్యులుగా మారితే విద్యాభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది. అధ్యాపకులందరూ డ్రిల్ టీచర్ గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే తాను చూపించి, నేర్పించేవాడు డ్రిల్ టీచర్. అదేవిధంగా అనుభవాన్ని ప్రదర్శించి నేర్పించగలిగేవారే నిజమైన అధ్యాపకుడు. అంతేకాకుండా గురి చూపేవాడు గురువు. అధ్యాపకులు తమ విద్యార్థులను బహుముఖ అభివృద్ధి, వారిసచ్ఛీలతా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. పద్ధతి ప్రకారం విద్యను నేర్పే వ్యక్తి ఉపాధ్యాయుడు. సహజ సిద్ధంగా విద్యను అధ్యయనం చేయించే వ్యక్తి అధ్యాపకుడు. ఉపాధ్యాయున్ని అధ్యాపకుడుగా మార్చగలిగితే ఆ దేశ యువతకు ఒక వరం. అదే విధంగా అధ్యాపకున్ని గురువు స్థానానికి చేర్చగలిగితే అది దేశానికి శాశ్వతమైన సంపద. పైన సూచించిన మార్పులను ఆహ్వానించి, ప్రోత్సహించి, గౌరవించి అధ్యాపక బృందాన్ని ఏర్పర్చుకుంటే మన దేశ ప్రగతి సుస్థిరమవుతుంది. -ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి వ్యాసకర్త పూర్వ ఉపకులపతి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ‘ 94408 88066 -
వర్సిటీల్లో పరిశోధన వెనకబడుతోందా?
విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రెండు కళ్ళలాంటివి. పరిశోధన ప్రాముఖ్యత విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల బోధనపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. విశ్వవిద్యాలయాల పరిశోధన ఆర్థిక, సామాజికాభివృద్ధి, బోధనా పటిష్టతకు తోడ్పడుతుంది. అనేక దేశాలలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక విప్లవం విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి నడుస్తున్న దృష్టాంతాలు అనేకం. అదే విధంగా మనదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి వుంది. విచిత్రమేమిటంటే పారిశ్రామికవేత్తలు మన దేశంలో విశ్వవిద్యాలయ పరిశోధన పటిష్టతకు ఎక్కువ చేయూతనివ్వలేదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన పారిశ్రామిక వేత్తలకు ప్రత్యక్ష్యంగా ఉపయోగపడే విధంగా లేకపోవడం ఒక కారణం. సమాజాభివృద్ధికి కావల్సిన∙పరిశోధనా పరమైన అంశాలను విశ్వవిద్యాలయాల్లో చేపట్టకపోవడం ఒక విధమైన చేదు అనుభవం. ప్రభుత్వ ఆర్థిక సహాయం, పారిశ్రామికవేత్తల చేయూత విశ్వవిద్యాలయంలో పరిశోధనాభివృద్ధికి రెండు మూలస్తంభాలుగా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయం గత మూడు దశాబ్దాలుగా సన్నగిల్లి, పారిశ్రామికవేత్తలు పూర్తిగా విస్మరించడం వల్ల విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యవస్థ కుంటుపడి ముందుకు నడవలేకపోతోంది. ఈ పరిశోధనా వ్యవస్థ పటిష్టం కాకపోవడానికి ఆర్థిక సహాయ లోపమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పరిశోధనా పటిమ తగ్గడం ముఖ్య కారణంగా భావించవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనా ఫలాలు గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పడిపోయాయని మన గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదకరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పరి శోధన విధానాలను సామాజికాభివృద్ధికి ఉపయోగంగా మలచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇవే విశ్వవిద్యాలయాల పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయ అధ్యాపక నియామకాలను పరిశీలించినట్లయితే 1990 తర్వాత పరిశోధన పటిష్టత లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మన ప్రభుత్వాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై అనేక విధాలుగా నిర్లక్ష్యం వహిస్తూండటం వల్ల వాటి ప్రమాణాలు దిగజారుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత దుర్భర పరిస్థితిని మార్చాలంటే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఇందులో ప్రధానంగా ప్రతిభ, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఉపకులపతులుగా నియమించే ప్రక్రియ అత్యంత కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల స్థితిగతులను పరిశీలిస్తే, ఉన్నతవిద్య ప్రమాణాలు గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలోని 20 విశ్వవిద్యాలయాల్లోనూ బోధన చాలా తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితో కొనసాగుతోంది. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నేను 1977–78లో పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 120 మంది పరిశోధక విద్యార్థులు ఉండేవారు. అప్పటికి యూనివర్సిటీగా గుర్తింపు లేదు. పీజీ సెంటర్‌గానే వుండేది. కానీ అప్పటి ఆచార్య బృందానికి బోధనపై ఎంత పట్టు ఉండేదో, అంతే స్థాయిలో పరిశోధనపై కూడా ఉండేది. ఇది అన్ని శాఖలకు వర్తించేది. విశ్వవిద్యాలయ హోదా పొందిన తర్వాత గత ముఫ్ఫై ఏళ్లలో వర్సిటీల్లో బోధన పటిమ, పరిశోధనా సామర్థ్యాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా బోధనా సిబ్బంది గణనీయంగా తగ్గిపోవడం, అదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం. 1980వ దశాబ్దంలో దాదాపు 20 విభాగాల్లో 200 మంది బోధనా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు దాదాపు 36 విభాగాల్లో 70 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా విశ్వవిద్యాలయంపై విద్యార్థులకున్న నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఉపకులపతులు అనేక రకాలైన చట్టపరమైన, పాలనాపరమైన చిక్కుముడుల వల్ల అధ్యాపకుల నియామకాలు చేపట్టలేకపోయారు. పీజీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల బోధన లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విష వలయం నుండి బయటపడాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, బోధన సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాల్సి వుంది. ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులైనా సరే వేగవంతం కావాలంటే ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో విద్యా విస్తరణ పటిష్టతతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకొని విశ్వవిద్యాలయాల విశిష్టతను పెంపొందించి, విద్యాభివృద్ధికి, రాష్ట్రాల మానవవనరుల నైపుణ్యాభివృద్దికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఏపీలో, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్ మానవ వనరుల అభివృద్ధికి కృషి చేసే దిశగా ప్రయత్నం చేస్తుండటం శుభసూచకం. ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. వ్యాసకర్త: ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ అనంతపురం, మొబైల్ : 94408 88066 -
ఎస్కేయూలో పచ్చ నియామకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికార పార్టీ నేతల అభీష్టాలను నెరవేర్చేందుకు జిల్లాలో అధికారులు ‘రాజును మించిన రాజభక్తి’ చూపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులను దెబ్బ తీస్తూ.. తెలుగు తమ్ముళ్లను అందలం ఎక్కించే ప్రక్రియ జిల్లాలో స్టోర్ డీలర్ల నుంచి యూనివర్సిటీ న్యాయవాదుల నియామకం వరకూ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవు.. చట్టాలు, విధి విధానాలు, నియమ నిబంధనలు.. వేటీనీ ఖాతరు చేయకుండా అధికార గణం తమ రాజభక్తిని చాటుకుంటోందనేందుకు ఇటీవల శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన ‘స్టాండింగ్ కౌన్సిల్’ నియామకం ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ తరఫున వచ్చే న్యాయ వివాదాలను హైకోర్టులో వాదించేందుకు జే.ఉగ్రనరసింహను స్టాండింగ్ కౌన్సిల్గాగత ప్రభుత్వం నియమించింది. ఈయన కాల పరిమితి మూడేళ్లు. ఈ గడువు ముగియగానే తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఉగ్రనరసింహనే స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగాలని యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను ఈ పోస్టుపై పడింది. గత ప్రభుత్వ హయాంలో నియమితమైన ఉగ్రనరసింహను తొలగించి ఆ స్థానంలో గతంలో చంద్రబాబు హయాంలో (1998-2005) యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన పి.శ్రీరాములు నాయుడును తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతల అభీష్టాన్ని నెరవేర్చే పనిలో యూనివర్సిటీ అధికారులు తమ పరిధికి మించి వ్యవహరించారు. ఉగ్రనరసింహను తొలగిస్తూ, ఆ స్థానంలో శ్రీరాములు నాయుడిని నియమిస్తూ రిజిస్ట్రారే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఉగ్రనరసింహం యూనివర్సిటీ కేసులను సరిగా వాదించడం లేదని, ఇతని ఉదాసీనత కారణంగా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణాల రీత్యా ఇతని స్థానంలో శ్రీరాములు నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కు, అడ్వకేట్ జనరల్‌కు పంపారు. అడ్వకేట్ జనరల్ ఘాటు లేఖ.. యూనివర్సిటీ అధికారుల నిర్వాకంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తీవ్రంగా స్పందిస్తూ ఘాటుగా లేఖ రాశారు. జీవో ఆర్టీ నెం 168 ప్రకారం యూనివర్సిటీలతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలు చేపట్టే అధికారం ఉండదని, అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు ప్రభుత్వం మాత్రమే వీరి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆ లేఖలో అడ్వకేట్ జనరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు స్పష్టం చేశారు. పరిధి మీరి స్టాండింగ్ కౌన్సిల్‌గా వేరే వారిని నియమించిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులకు లీగల్ నోటీసు .. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటిదాకా స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ఉగ్రనరసింహ యూనివర్సిటీ అధికారులకు లీగల్ నోటీసు పంపారు. యూనివర్సిటీ కేసులు వాదించడంలో అలసత్వం వహిస్తున్నట్లు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దిద్దుబాటు చర్యలు .. తమ ఇష్టానుసారం స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించుకోవాలనుకున్న యూనివర్సిటీ అధికారుల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.దశరథరామయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. సమస్య పరిష్కారమయ్యే దశలో ఇప్పుడీ వార్త ప్రచురించడం ఎందుకంటూ సలహా ఇచ్చారు. ఉగ్రనరసింహం పదవీ కాలం 2013 నవంబర్‌లో ముగిసిందని, అప్పుడు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు యూనివర్సిటీనే ఇచ్చిందన్నారు. తామిచ్చిన పదవీ పొడగింపు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతున్నప్పుడు ఆయనను తొలగించే అధికారం తమకు ఎందుకుండదంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు.