విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రెండు కళ్ళలాంటివి. పరిశోధన ప్రాముఖ్యత విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల బోధనపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. విశ్వవిద్యాలయాల పరిశోధన ఆర్థిక, సామాజికాభివృద్ధి, బోధనా పటిష్టతకు తోడ్పడుతుంది. అనేక దేశాలలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక విప్లవం విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి నడుస్తున్న దృష్టాంతాలు అనేకం. అదే విధంగా మనదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి వుంది. విచిత్రమేమిటంటే పారిశ్రామికవేత్తలు మన దేశంలో విశ్వవిద్యాలయ పరిశోధన పటిష్టతకు ఎక్కువ చేయూతనివ్వలేదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన పారిశ్రామిక వేత్తలకు ప్రత్యక్ష్యంగా ఉపయోగపడే విధంగా లేకపోవడం ఒక కారణం.
సమాజాభివృద్ధికి కావల్సిన∙పరిశోధనా పరమైన అంశాలను విశ్వవిద్యాలయాల్లో చేపట్టకపోవడం ఒక విధమైన చేదు అనుభవం. ప్రభుత్వ ఆర్థిక సహాయం, పారిశ్రామికవేత్తల చేయూత విశ్వవిద్యాలయంలో పరిశోధనాభివృద్ధికి రెండు మూలస్తంభాలుగా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయం గత మూడు దశాబ్దాలుగా సన్నగిల్లి, పారిశ్రామికవేత్తలు పూర్తిగా విస్మరించడం వల్ల విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యవస్థ కుంటుపడి ముందుకు నడవలేకపోతోంది. ఈ పరిశోధనా వ్యవస్థ పటిష్టం కాకపోవడానికి ఆర్థిక సహాయ లోపమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పరిశోధనా పటిమ తగ్గడం ముఖ్య కారణంగా భావించవచ్చు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనా ఫలాలు గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పడిపోయాయని మన గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదకరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పరి శోధన విధానాలను సామాజికాభివృద్ధికి ఉపయోగంగా మలచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇవే విశ్వవిద్యాలయాల పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయ అధ్యాపక నియామకాలను పరిశీలించినట్లయితే 1990 తర్వాత పరిశోధన పటిష్టత లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మన ప్రభుత్వాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై అనేక విధాలుగా నిర్లక్ష్యం వహిస్తూండటం వల్ల వాటి ప్రమాణాలు దిగజారుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత దుర్భర పరిస్థితిని మార్చాలంటే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఇందులో ప్రధానంగా ప్రతిభ, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఉపకులపతులుగా నియమించే ప్రక్రియ అత్యంత కీలకం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల స్థితిగతులను పరిశీలిస్తే, ఉన్నతవిద్య ప్రమాణాలు గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలోని 20 విశ్వవిద్యాలయాల్లోనూ బోధన చాలా తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితో కొనసాగుతోంది. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నేను 1977–78లో పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 120 మంది పరిశోధక విద్యార్థులు ఉండేవారు. అప్పటికి యూనివర్సిటీగా గుర్తింపు లేదు. పీజీ సెంటర్‌గానే వుండేది. కానీ అప్పటి ఆచార్య బృందానికి బోధనపై ఎంత పట్టు ఉండేదో, అంతే స్థాయిలో పరిశోధనపై కూడా ఉండేది. ఇది అన్ని శాఖలకు వర్తించేది. విశ్వవిద్యాలయ హోదా పొందిన తర్వాత గత ముఫ్ఫై ఏళ్లలో వర్సిటీల్లో బోధన పటిమ, పరిశోధనా సామర్థ్యాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా బోధనా సిబ్బంది గణనీయంగా తగ్గిపోవడం, అదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం.
1980వ దశాబ్దంలో దాదాపు 20 విభాగాల్లో 200 మంది బోధనా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు దాదాపు 36 విభాగాల్లో 70 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా విశ్వవిద్యాలయంపై విద్యార్థులకున్న నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఉపకులపతులు అనేక రకాలైన చట్టపరమైన, పాలనాపరమైన చిక్కుముడుల వల్ల అధ్యాపకుల నియామకాలు చేపట్టలేకపోయారు. పీజీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల బోధన లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విష వలయం నుండి బయటపడాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, బోధన సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాల్సి వుంది. ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులైనా సరే వేగవంతం కావాలంటే ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో విద్యా విస్తరణ పటిష్టతతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకొని విశ్వవిద్యాలయాల విశిష్టతను పెంపొందించి, విద్యాభివృద్ధికి, రాష్ట్రాల మానవవనరుల నైపుణ్యాభివృద్దికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఏపీలో, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్ మానవ వనరుల అభివృద్ధికి కృషి చేసే దిశగా ప్రయత్నం చేస్తుండటం శుభసూచకం. ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త: ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ
అనంతపురం, మొబైల్ : 94408 88066
Comments
Please login to add a commentAdd a comment