నగరంలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోమవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో రోడ్ల దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రోడ్ల పనుల వేగం పెంచాలని ఆదేశించారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇతర విభాగాల సమన్వయం చేసుకోవడానికి పరిణితి అవసరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో గతుకులు లేని రోడ్లు ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సిటీలో రోడ్ల తీరుపై సంతృప్తిగా తాను లేనని, సమూల మార్పులు రావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీన అన్ని శాఖలతో సమన్వయం చేయడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. అవసరమైతే నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపారు. విద్యుత్, వాటర్, రోడ్లు అన్ని శాఖలతో సమన్వయం అవసరమని, శ్రీనగర్ కాలనీలో సమస్యకు సమన్వయ లోపమే కారణమని ఆయన చెప్పారు.
ఆరు మాసాలుగా నత్తనడకన రోడ్డు పనులు సాగుతున్నాయని మంత్రికి స్థానికులు విన్నవించుకున్నారు. మంత్రి వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్ కవిత ఉన్నారు. అలాగే స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆయన సూచించారు.