Srinagar nit Campus
-
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా..!
ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 28) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగకపోవడంతో ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, దాయాదుల సమరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) యాజమాన్యం జారీ చేసినట్లు చెబుతున్న కొన్ని వివాదాస్పద అంక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పలు మాధ్యమాల ద్వారా అందిన వివరాల మేరకు.. ఎన్ఐటీ విద్యార్ధులు ఇవాళ జరిగే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది. విద్యార్ధులు హాస్టల్ గదుల్లో గుంపులుగా చేరి మ్యాచ్‌ను చూసినా, మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా.. సంబంధిత విద్యార్ధులను హాస్టల్ గది ఖాళీ చేయించడంతో పాటు రూ. 5000 జరిమానా విధిస్తామని కళాశాల డీన్ హెచ్చరించినట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో విద్యార్ధులంతా తమతమ గదుల్లోనే ఉండాలని, అలా కాకుండా యాజమాన్యం హెచ్చరికలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసుల జారీ చేసినట్లు తెలుస్తోంది. 2016లో ఓ మ్యాచ్ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ అంక్షలు జారీ చేసినట్లు ఎన్ఐటీ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! -
ఆర్టికల్ 370 రద్దు: శ్రీనగర్ ఎన్ఐటీ పునఃప్రారంభం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో 74రోజులపాటు మూతబడిన శ్రీనగర్ ఎన్ఐటీ తిరిగి ప్రారంభమైంది. సుదీర్ఘ సెలవులు అనంతరం క్యాంపస్‌ను మంగళవారం రీఓపెన్ చేశారు. అయితే బయటరాష్ట్రాల విద్యార్థులు ఇంకా రావాల్సి ఉంది. లోయలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని భావిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపడానికి భయపడుతున్నారు. అలాగే ఇంటర్నెట్ లేకుండా చదువుకోవడం ఇబ్బందికరమని భావిస్తున్న విద్యార్థులు కూడా మరికొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపస్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటీ వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
‘ఇది ఎయిర్పోర్ట్ అరెస్ట్’
అనుపమ్ ఖేర్‌ను అడ్డుకున్న పోలీసులు శ్రీనగర్ నిట్ క్యాంపస్‌కు వెళ్లకుండా ఆపివేత న్యూడిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో వివాదం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. క్యాంపస్‌లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, తిరిగి ఢిల్లీ వెళ్లాలని ఆయనకు చెప్పామని ఓ పోలీసు అధికారి తెలిపారు. తనను అడ్డుకోవడంపై ఖేర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పోలీసులు కోరినట్లే శ్రీనగర్‌లోకి వెళ్లనన్నాను. కానీ, నేను శ్రీనగర్‌లోకి ప్రవేశించకూడదని జారీ చేసిన ఆదేశాలను చూపించాలని అడిగాను’ అని ట్వీట్ చేశారు. తాను సమస్యలు సృష్టించేందుకు నిట్‌కు రాలేదని, విద్యార్థులను కలిసేందుకే వచ్చానన్నారు. ‘విద్యార్థులకు నైతిక స్థైర్యం ఇవ్వడానికి ఒక పౌరుడిగా వెళ్తున్నాను. వర్సిటీకి వెళ్లమని లక్షల మందికి చెప్తాను’ అని పేర్కొన్నారు. ‘కనీసం మా పూర్వీకుల ఇంటికి, లేకపోతే ఖీర్ భవానీ గుడికి వెళ్లేందుకు కూడా అనుమతించలేదు. ఇది ఎయిర్పోర్ట్ అరెస్ట్’ అని అన్నారు. ఢిల్లీకి తిరిగిరావడానికి ముందు ఎయిర్‌పోర్టులో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.