మౌనంగానే ఎదగమని..
అతడు ఎవరితోనూ మాట్లాడడు... ఎవరి మాటనూ వినడు. అలాగని.. అతడు ఎవరి మాట వినని మొండిఘటమేమీ కాదు. విధి అలా మార్చిందంతే. పుట్టుకతోనే అతడికి మూగతో పాటు వినికిడి లోపం. అయినా తన లోకంలోనే ఉండిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంలా మల్చుకున్నాడు. వైకల్యాన్ని జయించి అందరిలా.. అందరివాడిలా ముందుకు సాగుతున్నాడు. సంజ్ఞలతోనే పనులన్నీ చక్కబెడుతున్నాడు. వైరాకు చెందిన యువకుడు మొలా శరత్రాహుల్ విజయగాథ ఇది.
వైరాలోని బీసీకాలనీకి చెందిన మొలా సుందర్రావు, విజయకుమారి దంపతుల కుమారుడు శరత్ రాహుల్(24)కి పుట్టకతోనే రుగ్మతలు ఆవరించాయి. చిన్నప్పటి నుంచి అతడు మాట్లాడలేడూ వినలేడు. అయినా అతడు ఆత్మస్థైర్యాన్ని చిరుప్రాయం నుంచే అలవర్చుకున్నాడు. స్థానిక అజరయ్య శ్రీనికేతన్ విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేశాడు. పాఠ్యాంశాలు వినిపించకపోయినా సజ్ఞలతోనే అర్థం చేసుకున్నాడు. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించాడు.
ఆత్మవిశ్వాసమే ఆసరా
తన వైకల్యాన్ని చూసుకుని మదనపడడం కన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే మేలని భావించాడు శరత్ రాహుల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినా (ఇప్పుడు రిటైర్డ్) ఆయనపై ఆధార పడలేదు. ఏదో పనిచేసి తన కాళ్లపై తాను నిలబడాలని సంకల్పించాడు. లక్ష్యసాధన కోసం ముందడుగు వేశాడు.మేకానిజంపై ఉన్న మక్కువతో వైరాలోని ఓ ఇంజనీరింగ్ షాపులో పనికి కుదరాడు. ఏ వస్తువునైనా తన మేధస్సుతో ఇట్టే రిపేర్ చేసే సహజత్వం కలిగిన రాహుల్ వెల్డింగ్ పనిని కొద్దికాలంలోనే సమగ్రంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడి వేతనం రూ. 7 వేలు. అంతేకాదు.. ఎలాంటి శిక్షణ లేకుండానే ద్విచక్రవాహనాలు, విద్యుత్ మోటార్లు రిపేర్, హౌస్వైరింగ్ చేయడంలో అతడు పట్టుసాధించాడు.
మాటలు రాకపోయినా...
మాట్లాడడం రాకపోయినా శరత్ రాహుల్ సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచంతో సంభాషిస్తున్నాడు. ఫేస్బుక్ ద్వారా మిత్రులతో తన భావాలు పంచుకుంటున్నాడు. అంతేకాదు... సెల్ఫోన్ వినియోగంలోనూ రాహుల్ శైలి వినూత్నమే. సంభాషిచడం సాధ్యం కాదు కనుక ఎస్ఎంఎస్ల ద్వారా తన భావాలను అవతలి వారికి తెలియజేస్తున్నాడు. పని ఒత్తిడి వల్ల ఇంటికి వెళ్లడం ఆలస్యమైతే ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుంటాడు. నాలుగేళ్లుగా శరత్ రాహుల్కు ఇది మంచి సాధనంగా మారింది. ఇంతటి ఆత్మస్థైర్యం కలిగిన ఈ యువకుడిని చూసి స్థానికులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.