అన్నదాత ఆత్మహత్యాయత్నం
బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక...
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన రైతు అజ్మీరా శ్రీనివాస్ బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. శ్రీనివాస్ గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రామన్నతో కలిసి 1998లో ట్రాక్టర్ కొనుగోలు నిమిత్తం తమ వ్యవసాయ భూమిపై భూపాలపల్లి డీసీసీబీ బ్యాంకులో రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు.
రుణం తీసుకున్న నాటి నుంచి వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఇటీవల శ్రీనివాస్, రామన్నపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చేసేది లేక వీరువురు ఈ నెల 10న డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం బ్యాంకు రికవరీ అధికారులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సిందిగా కోరారు. డబ్బులు లేవని, కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరగా, అధికారులు వినకుండా ఇంటిలోని వస్తువులను జప్తు చేస్తామని బెదిరించారు.
దీంతో శ్రీనివాస్ తన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భూపాలపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, బ్యాంకు బాకీ డబ్బుల కోసం గ్రామానికి వెళ్లగా శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.