శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపండి: సీపీఐ
తెలంగాణకు వేరే చోట నుంచి విద్యుత్ ఇవ్వాలని సూచన
హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ఆపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. రాయలసీమలోని మెట్టప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు శ్రీశైలం నుంచి వెళుతున్న 350 మెగావాట్ల విద్యుత్‌ను వేరేచోట నుంచి సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన ఆదివారం లేఖ రాశారు.
శ్రీశైలం రిజర్వాయర్‌పై ఆధారపడి నిర్మించిన తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాల్వ, హింద్రీ-నీవా, గాలేరు-నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టులకు నీరు అందించాల్సి ఉందని లేఖలో వివరించారు. అయితే విద్యుత్ అవసరాలకోసం అటు తెలంగాణ, ఇటు ఏపీ పెద్దఎత్తున నీటిని వినియోగిస్తున్నందున రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోతోందని తెలిపారు. రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం కొనసాగాలంటే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి ఉన్నా.. అందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేనందున ఏపీ ప్రభుత్వమే ఆ 350 మెగావాట్ల విద్యుత్‌ను వేరేచోట నుంచి సరఫరా చేయాలని ఆయన సూచించారు.