సెక్యూరిటీ గార్డుకు కలాం కృతజ్ఞతలు
షిల్లాంగ్: కలాం షిల్లాంగ్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తనకు భద్రత కల్పించేందుకు రిస్క్ తీసుకున్న సెక్యూరిటీ గార్డుకు కృతజ్ఞతలు తెలిపారు. కలాం సహాయకుడు సృజన్ ఈ సంగతి తెలిపారు. సోమవారం గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బయల్దేరిన కలాంకు స్పెషల్ ఆపరేషన్ టీవ్ దారి వెంబడి భద్రత కల్పించింది. కలాం పక్కన పాల్ కూడా ఉన్నారు. వారి వాహనం ముందు వెళ్తున్న ఓపెన్ జిప్సీ వాహనంలో ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎస్ఏ లపాంగ్ అనే గార్డు తుపాకీ పట్టుకుని జిప్సీలో నిల్చున్నాడు. అతన్ని కూర్చోమనాలని కలాం తన పక్కనున్న వారికి చాలాసార్లు చెప్పారు. కలాం వాహనం నుంచి రేడియో మెసేజ్ కూడా పంపారు. ఫలితం లేకపోయింది. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత కలాం.. లపాంగ్‌ను పిలిపించుకున్నారు.
ఎందుకు పిలుస్తున్నారో అని లపాంగ్ భయపడ్డాడు. తర్వాత కలాం అతన్ని ‘నీ విధి బాగా నిర్వహించావ’ని కరచాలనంతో అభినందించి, కృతజ్ఞత తెలపడంతో నోరెళ్లబెట్టాడు. ‘నా వల్ల అన్నిగంటల పాటు నువ్వు ఇబ్బంది పడినందుకు సారీ. అలసి పోయావా? ఏమైనా తింటావా?’ అని మాజీ రాష్ట్రపతి అతనితో అన్నాడు. ‘సర్, మీ కోసం నేను ఆరుగంటలపాటు నిలబడేందుకు కూడా సిద్ధం’ అని లపాంగ్ ఆయనతో చెప్పాడు.