ఇక్కట్ల చదువులు!
ఇంటిపేరు కస్తూరి వారు....ఇంట్లో గబ్బిలాల కంపు అన్న చందంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పరిస్థితి తయారైంది. బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా, మధ్యలో బడిమానివేసిన వారికోసం ఏర్పాటైన చాలా కేజీబీవీలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పైకి భవంతులు బాగా కనిపిస్తున్నా, లోపల సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో విద్యార్థినులు నిత్యం అవస్థలకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై పాలకులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. పాఠశాలలకు ప్రహరీలు లేకపోడంతో విద్యార్థినులు నిత్యం అభద్రతాభావానికి గురవుతున్నారు. రక్షణలేక భయం భయంగా చదువులు సాగిస్తున్నారు.
వంటగ్యాస్ పంపిణీ అరకొరగా ఉండడం వల్ల కట్టెల పొయ్యిలపైనే ఆహారపదార్థాలు తయారు చేస్తుండడంతో అవి అనారోగ్యానికి హేతువుగా మారుతున్నాయి. కంప్యూటర్లను ఏర్పాటు చేసినా చాలా పాఠశాలల్లో బోధకులు లేరు. మైదానాలున్నా క్రీడా సామగ్రి ఉండదు ఇలా చెప్పుకొంటూ పోతే బాలికల విద్య కోసం సర్వశిక్షాభియాన్ శాఖ సమకూర్చిన సదుపాయాలు అకరకొరగానే కనిపిస్తున్నాయి. కేజీబీవీల్లో బోధన, సౌకర్యాలు, వాళ్లకు కావాల్సి అవసరాలను స్వయంగా తెలుసుకోవడానికి సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి జి.నాగమణి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గంట్యాడ మండలంలోని కేజీబీవీ పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థినులు, టీచర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో జరిపిన సంభాషణ వివరాలు....
పీఓ నాగమణి: (పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌తో) పాఠశాల నిర్వహణపై విద్యార్థినులు, తల్లిదండ్రుల నుంచి ఎప్పుడైనా ఫిర్యాదులు నమోదయ్యాయా...?
బడే జ్యోతి (పాఠశాల స్పెషల్ ఆఫీసర్): పాఠశాలలో 200 మంది విద్యార్థుల వరకు వసతి సౌకర్యం ఉంది. ప్రస్తుతం 178 మంది విద్యార్థినులున్నారు. గత ఏడాది నూతన భవనంలోకి వచ్చాం. ఇంతవరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
పీఓ నాగమణి: అన్ని సబ్జక్టులకు టీచర్లున్నారా ?
బడే జ్యోతి: విద్యార్థినుల సంఖ్యకు సరిపడా సబ్జెక్టు టీచర్లున్నారు. కంప్యూటర్ టీచర్‌ను నియమంచాల్సి ఉంది. అలాగే అదనంగా స్వీపర్‌ను నియమించాల్సి ఉంది.
పీఓ నాగమణి: కంప్యూటర్ టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తారు., మరో స్వీపర్‌ను పోస్టు కేటాయించడానికి ప్రయత్నిస్తాను.
పీఓ నాగమణి: (వంటగదిలో వార్డెన్‌తో) వంటకు అవసరమైన నిత్యావసర వస్తువుల స్టోరేజీలో ఎటాంటి పరిశుభ్రత చర్యలు పాటిస్తున్నారు. ?
మాధవి (వార్డెన్): స్టోర్ రూమ్ పరిశుభ్రంగా ఉండే విధంగా నిత్యం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా తెప్పించుకున్న సరుకులను స్టోర్‌రూంలో భద్రపరిచి,. వంట చేసే ముందురోజు సాయంత్రం సరుకులను బయటకు తీసి శుద్ధి చేస్తాం మేడమ్.
పీఓ నాగమణి: వంటకు సరిపడా సిబ్బంది ఉన్నారా...?
మాధవి: ఒక కుక్‌తోపాటు నలుగురు సహాయకులున్నారు మేడమ్.
సత్యవతి (కుక్): సహాయకులు సరిపోరు. గ్యాస్ సిలెండర్లు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల కట్టెలతో వంట చేయవలసి వస్తోంది. పొగవల్ల అనారోగ్యానికి గురవుతున్నాం. సిలెండర్లను పూర్తిస్థాయిలో అందజేయాలి.
పీఓ నాగమణి: రాయితీ సిలెండర్ల పంపిణీ సాధ్యం కాదు. అదనపు సిలెండర్లను సమకూర్చడానికి ప్రయత్నిస్తాను.
సత్యవతి (కుక్): విద్యుత్ కోత సమయంలో దీపాల కొరత ఉంది మేడమ్. ఆ సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి లోపాలూ లేకుండా వంటలు చేయడానికి వీలుంటుంది.
పీఓ నాగమణి: సోలార్ లాంతర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపుతాం.
పీఓ నాగమణి: (డార్మెంట్లకు వెళ్లి విద్యార్థినులతో....) నిద్రించే గదిలో అందిరికీ సరిపడా బెడ్లు,ఫ్యాన్లు ఉన్నాయా...?
మనీషా (విద్యార్థిని): సరిపడినన్ని ఉన్నాయి మేడమ్
పీఓ నాగమణి: ఉదయం టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందుతున్నాయా.....? ఇతర సౌకర్యాలు బాగున్నాయా..?
బి.సూర్యకళ (విద్యార్థిని): ఇక్కడికి రాకముందు చిన్న ప్రైవేటు పాఠశాలలో చదివేదాన్ని. ఇంట్లోవాళ్లు చదివించలేక చదువు మానిపించారు. తరువాత ఇక్కడి చేరాను. ఇంకా పైచదువులు చదవాలని ఉంది. 9, 10వ తరగతుల వారికి నాలుగు, ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థినులకు మూడు ఇడ్లీలు పెడుతున్నారు.
పీఓ నాగమణి: (కంప్యూటర్ గదిలో విద్యార్థినులతో...) కంప్యూటర్ విద్య అందుతోందా...?
కె.రాజేశ్వరి (9వ తరగతి): కంప్యూటర్ టీచర్ లేరు మేడమ్. కానీ వేరే టీచర్లు వచ్చి కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. కంప్యూటర్ టీచర్ని నియమిస్తే ఇంకా బాగా నేర్చుకుంటాం.
పీఓ నాగమణి: నియామకాల ప్రక్రియకు త్వరలో ఆదేశాలు వస్తాయి.
పీఓ నాగమణి: (మెడికల్ సర్వీసు గదిలో ఏఎన్ఎంతో...) విద్యార్థినులకు తరచూ వచ్చే వ్యాధులేంటి..? వాటి నివారణకు మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు..?
సత్యవతి (ఏఎన్ఎం): మేడమ్ సీజనల్ వ్యాధులు సహజంగా వస్తున్నాయి. రోజుకు ఐదుగురు నుంచి ఏడు మంది వరకూ వివిధ వ్యాధులు, జ్వరాలతో బాధపడుతున్నారు. వీరందరికీ ప్రాథమిక చికిత్స అందజేసి, మందులు ఇస్తున్నాను. ఇంకా తగ్గకపోతే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నాం.
పీఓ నాగమణి: (పదోతరగతిలో విద్యార్థులతో...) టీచర్లు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా ? పరీక్షల్లో పాసవుతామనే నమ్మకం ఉందా..?
కె.దేవీ (పదోతరగతి విద్యార్థిని): అన్ని సబ్జెక్టులకూ టీచర్లు ఉన్నారు. పాఠాలు అర్థమవుతున్నాయి. పాసవడమే కాకుండా, 10కి 10 పాయింట్లు వచ్చే విధంగా చదువుతున్నాం.
కె.మధు(పదోతరగతి విద్యార్థిని): మేడమ్ పదోతరగతి పూర్తయిన తరువాత మేం ఇళ్లకు వెళితే... ఉన్నత చదువులు చదివించరు. అందుకే ఇంటర్మీడియెట్ కోర్సులు కూడా ఇక్కడ నిర్వహించాలి.
పీఓ నాగమణి: మీ అందరి విన్నపాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాను.
పీఓ నాగమణి: (క్లాస్ టీచర్‌తో) మీరు బోధిస్తున్న విషయాలను విద్యార్థినులు అర్థం చేసుకుంటున్నారా ?
బీవీసులోచన(సోషల్ టీచర్): మేడమ్... బాగా అర్థం చేసుకుంటున్నారు. తరగతిలో 5 మంది మాత్రమే సీ, డీ గ్రేడ్ విద్యార్థినులున్నారు. వారి కోసం ప్రత్యేకంగా మెటీరియల్ తయారుచేశాం. సింపుల్‌గా మార్కులను సాధించగలిగే మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలను వివరిస్తున్నాం. దీని వల్ల నూరుశాతం ఉత్తీర్ణత సాధించగలుగుతున్నాం.
పీఓ నాగమణి: (క్రీడా ప్రాంగణంలో విద్యార్థినులతో) ఇక్కడ మీకు ఆటలు ఆడిస్తున్నారా...? ఏ ఏ ఆటలు నేర్పుతున్నారు...?
ఎం.తులసి (ఏడోతరగతి): పీఈటీ మేడం... ఆటలు ఆడిస్తున్నారు. టెన్నీకాయిట్, తైక్వాండో, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెలకువలు నేర్పుతున్నారు.
పీఓ నాగమణి: క్రీడలు ఆడడానికి పీఈటీ ప్రోత్సహిస్తున్నారా..?
ఎం.తులసి: ప్రతిరోజూ ఉదయాన్నే లేపి యోగా చేయిస్తారు. సాయంత్రం మాకు ఇష్టమైన క్రీడల్లో తర్ఫీదు ఇస్తారు మేడమ్. అయితే క్రీడా పరికరాలు లేవు.
పీఓ నాగమణి: సామాగ్రి కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తాను.
పీఓ నాగమణి: (సీఆర్ టీచర్లతో) ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి...?
దమయంతి (సీఆర్టీ): కాంట్రాక్ట్ ఉద్యోగాలయినప్పటికీ బడిబయట బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని ఎంతగానో తృప్తిపడుతున్నాం. అయితే వేతనాలు అరకొరగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తున్నారు. మాకు కూడా పెంచాలి. కనీసం ఆర్జితసెలవులు కూడా కూడా ఇవ్వడంలేదు.
పీఓ నాగమణి: మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.
పీఓ ఏమన్నారంటే..
బడిబయట బాలికల విద్యాభివృద్ధికి కేజీబీ విద్యాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత ఐదేళ్లగా పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. జిల్లాలోని 34 విద్యాలయాల్లో అకడమిక్ పరీక్షలతోపాటు క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో పలువురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. అయితే పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాల్సి ఉంది. వాటి కోసం నిధులు వచ్చాయి. నిర్మాణాలను చేపడుతున్నాం. వంటగ్యాస్ పంపిణీ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కట్టెల పొయ్యిపై ఆహారపదార్థాలను తయారుచేయడం గమనించాను. మరిన్ని గ్యాస్ సిలిండర్లను కేటాయిస్తే కట్టెలతో వండడాన్ని నిరోధించవచ్చు. కంప్యూటర్ ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. క్రీడా సామగ్రి కోసం ఉన్నతాధికారులను కోరతాను. ఇంటర్మీడియెట్ విద్యాకోర్సులను కేజీబీవీలలో ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరిన మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం.