SSB
-
సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్‌ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా? శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్‌ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్‌ని పంపించారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు. 2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్‌ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్‌గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది. భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్‌ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు. ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్‌గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి. ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్‌ని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్‌కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు. ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్‌కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్‌ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అరుణ్ కుమార్ గ్రోవర్ మాజీ వైస్ చాన్స్‌లర్, పంజాబ్ యూనివర్సిటీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యూనిఫామ్ ఆమె తొడుక్కుంటారు
2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. అత్తగారింటి బాధ్యతలను తల్లి ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అంతటితో ఆగలేదు. భర్త స్ఫూర్తిని కొనసాగించడానికి అతి కష్టమైన ఎస్ఎస్బి (సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) పరీక్షను పాసయ్యి ఆర్మీలో శిక్షణకు ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి చెన్నైలో ఆమె శిక్షణ మొదలవుతోంది. ఆమె పరిచయం. ఏప్రిల్ 26, 2019. కర్వర్ హార్బర్. కర్ణాటక. మరికొన్ని గంటల్లో సముద్రంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య తీరానికి చేరుకుంటుంది. నావికాదళ యుద్ధనౌక అది. కాని ఈలోపే దానిలో మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న నావికాదళ అధికారులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇద్దరు ఆఫీసర్లు ఆ పోరాటంలో చనిపోయారు. వారిలో ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్. అప్పటికి అతనికి పెళ్లయ్యి కేవలం నలభై రోజులు. అతని భార్య కరుణ సింగ్‌కు ఆ వార్త అందింది. అత్తగారింట్లో ఉండగా... కరుణ సింగ్ ఆగ్రాలోని దయాల్బాగ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఒక మేట్రిమొని కాలమ్ ద్వారా ధర్మేంద్ర సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ‘వివాహానికి సంబంధించి నేనూ అందరిలాగే ఎన్నో కలలు కన్నాను’ అన్నారు కరుణ. ధర్మేంద్ర సింగ్‌ది మధ్యప్రదేశ్‌లోని కర్తాల్. ‘ఆయన మరణవార్త నాకు చేరేసరికి నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. నేను నా పదవ తరగతిలోపే మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు పెళ్లయిన వెంటనే భర్తను కోల్పోయాను. దేవుడు నా జీవితం నుంచి ఏదైనా ఆశించే ఈ పరీక్షలు పెడుతున్నాడా అనిపించింది’ అన్నారు కరుణ. స్త్రీలే బలం ‘నా భర్త మరణవార్త విని నేను కొన్ని రోజులు దిగ్భ్రమలో ఉండిపోయాను. అయితే మా అత్తగారు టీనా కున్వర్, మా అమ్మ కృష్ణా సింగ్ నాకు ధైర్యం చెప్పారు. చెట్టంత కొడుకును కోల్పోయిన మా అత్తగారు, కూతురి అవస్థను చూస్తున్న మా అమ్మ... ఇద్దరూ ధైర్యం కూడగట్టుకుని నాకు ధైర్యం చెప్పారు. ఈ ఇంటికి గాని ఆ ఇంటికి గాని నేనే ఇప్పుడు ముఖ్య సభ్యురాలిని అని అర్థమైంది. ఇరు కుటుంబాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండిపోయాను’ అన్నారు కరుణ సింగ్. ఆర్మీలో చేరిక ‘అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాకు మంచి ఉద్యోగం ఉంది. కాని నా భర్త మరణం తర్వాత అతని స్ఫూర్తిని సజీవంగా ఉంచాలని నాకు అనిపించింది. దేశమంతా తిరుగుతూ దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. నేవీలో పని చేసే అధికారులు నన్ను నేవీలో చేరమన్నారు. కాని నేను ఆర్మీని ఎంచుకున్నాను. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు హాజరవుదామనుకున్నాను. అయితే సైనిక వితంతువులకు రిటర్న్ టెస్ట్ ఉండదు. నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఐదు రోజుల పాటు వివిధ దశల్లో ఇంటర్వ్యూ సాగుతుంది. నేను సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కాని మొదటి రోజునే పంపించేశారు. తిరిగి అక్టోబర్‌లో హాజరయ్యి ఫిజికల్ టెస్ట్‌లలో పాసయ్యాను. ఆ తర్వాత మౌఖిక ఇంటర్వ్యూ సుదీర్ఘంగా సాగింది. నాకు మంచి ఉద్యోగం ఉన్నా ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నానో అడిగారు. నాకు దేశసేవ చేయాలనుందని చెప్పాను. ఎంపికయ్యాను. ఆఫీసర్‌గా చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి నుంచి నా ట్రైనింగ్ మొదలయ్యి 11 నెలలు సాగుతుంది’ అని చెప్పారు కరుణ. ఆమె దేశం కోసం పని చేసే గొప్ప సైనిక అధికారి కావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
సాయుధ బలగాల కుదింపు
న్యూఢిల్లీ: పారామిలటరీ బలగాలను కుదించి, పోరాటపటిమను పెంచే వివిధ ప్రతిపాదనలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ‘ఒకే సరిహద్దు.. ఒకే సైన్యం’విధానంలో భాగంగా సశస్త్రసీమా బల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగాలను విలీనం చేయడం వంటి ప్రతిపాదనలున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను మరో ఆరునెలల్లో అందజేయనుంది. సీఆర్పీఎఫ్తో ఉగ్రవాద వ్యతిరేక కమాండోలు, ఎన్ఎస్జీలను కూడా ఏకం చేసే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఉగ్ర వ్యతిరేక పోరు, హైజాక్ ఘటనలు, మావోయిస్టు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఈ రెండు విభాగాలను ఒకే కమాండ్ కిందికి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హోం శాఖ నేతృత్వంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)తోపాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీలున్నాయి. -
ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి..
ముంబై : సైనికులను చంపి.. మనల్ని బెదిరించాలని చూశారు ఉగ్రవాదులు. కానీ ఆ బెదిరింపులకు భయపడమని.. 40మందిని చంపితే మరో 4 వేల మంది భరతమాత కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉంటారని ఆ ముష్కరులకు తెలియదు. తండ్రి మరణిస్తే కొడుకు, భర్త మరణిస్తే భార్య సరిహద్దులో ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉంటారని నిరూపించారు గౌరీ ప్రసాద్. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన గౌరీ(31) భర్త.. ప్రసాద్ గణేష్ ఆర్మీ మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత్ - చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రసాద్ మరణించారు. భర్త మరణించాడని తెలిసి ఏడుస్తూ కూర్చోలేదు గౌరీ. భర్త సేవలను కొనసాగించడం కోసం తాను కూడా సైన్యంలో చేరాలని భావించింది. అందుకోసం అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. అయితే తొలి ప్రయత్నంలో ఆమె ఓడిపోయింది. కానీ పట్టువిడవకుండా ప్రయత్నించి రెండో ప్రయత్నంలో విజయం సాధించడం మాత్రమే కాదు టాపర్‌గా నిలిచారు. త్వరలోనే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ పొంది, అనంతరం లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో చేరి విధులు నిర్వహించనున్నారు. ఈ విషయం గురించి గౌరీ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఉండాలని నా భర్త ప్రసాద్ కోరిక. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఏడుస్తూ కూర్చుని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనిపించింది. నా భర్త దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించాను. అందుకే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట ఆయన యూనిఫామ్‌ను, స్టార్స్‌ను నేను ధరిస్తాను.. ఆయన విధులు నేను నిర్వహిస్తాను. ఇక ఇది మా ఇద్దరి యూనిఫామ్ అవుతుంది. ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ ప్రసాద్. -
బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీలకు కొత్త చీఫ్‌లు
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లకు కొత్త అధిపతులను కేంద్రం గురువారం నియమించింది. 1984 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రజినీకాంత్ మిశ్రా బీఎస్ఎఫ్కు చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎస్ఎస్బీ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుత బీఎస్ఎఫ్ చీఫ్ కేకే శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందనుండటంతో ఆ స్థానాన్ని మిశ్రా భర్తీ చేసి, పదవీ విరమణ వరకు (2019 ఆగస్టు) కొనసాగనున్నారు. 1984 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ దేశ్వాల్ మిశ్రా స్థానంలో ఎస్ఎస్బీ చీఫ్‌గా నియమితులై, పదవీ విరమణ పొందే వరకు (2021 ఆగస్టు) కొనసాగుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది, నేపాల్ సరిహద్దులో ఎస్ఎస్బీ సిబ్బంది కాపలాగా ఉంటుడటం తెలిసిందే. -
డిప్యూటీ తహసీల్దార్ అభ్యర్థి గాడిద..!!
శ్రీనగర్ : ఎవరినైనా తిట్టాలంటే గాడిద..! అనే పదానికి ఇంకా ఏవేవో జతచేసి వారి దుమ్ము దులుపుతాం. ఇక సరదా సంభాషణల్లో గాడిద గుడ్డు..! అనే పద ప్రయోగం కూడా ఉంది. ఎందుకంటే మనం గాడిదకు అంత అల్ప ప్రాధాన్యం ఇస్తాం. కానీ.. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్ టికెట్ జారీ చేసింది. అభ్యర్థి పేరు ‘కచౌర్ ఖర్’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్ టికెట్‌పై గాడిద ఫోటోని కూడా ముద్రించి నవ్వులపాలైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్ఎస్బీ నిర్వాకంపై ట్విటర్, ఫేస్‌బుక్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్ఎస్బీ చేరిందంటూ ఒక నెటిజన్ ఘాటైన ట్వీట్ చేశాడు. ఎస్ఎస్బీ చర్యలు నవ్వు తెప్పిస్తోంది. అది గాడిదకి హాల్ టికెట్ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్బుక్లో మరో వ్యక్తి తన అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్ఎస్బీ అధికారులు నిరాకరించారు. సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే గతంలోనూ చోటు చేసుకుంది. 2015లో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎస్ఎస్బీ ఆవు పేరిట హాల్ టికెట్ జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన సర్వర్ నుంచి ఆవు పేరుతో నమోదైన అప్లికేషన్‌ను తొలగించింది. -
జవాన్ అనుమానాస్పద మృతి
పారామిలటరీ సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్ బీ) జవాన్ అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రామ్‌బాన్ జిల్లా లోని అతని క్వార్టర్స్ లో ఇన్ స్పెక్టర్ రమేశ్ చంద్ర జోషీ మృత దేహాన్ని గురువారం ఉదయం కనుగొన్నారు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు. అతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వాడని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసులు అధికారి తెలిపారు.