యూనిఫామ్‌ ఆమె తొడుక్కుంటారు | Navy officer wife to join Army as a tribute to late husband | Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌ ఆమె తొడుక్కుంటారు

Published Sat, Dec 26 2020 12:21 AM | Last Updated on Sat, Dec 26 2020 4:20 AM

Navy officer wife to join Army as a tribute to late husband - Sakshi

ధర్మేంద్రసింగ్‌ చౌహాన్, కరుణ సింగ్‌

2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్‌.ఎస్‌. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్‌ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. అత్తగారింటి బాధ్యతలను తల్లి ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అంతటితో ఆగలేదు. భర్త స్ఫూర్తిని కొనసాగించడానికి అతి కష్టమైన ఎస్‌ఎస్‌బి (సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) పరీక్షను పాసయ్యి ఆర్మీలో శిక్షణకు ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి చెన్నైలో ఆమె శిక్షణ మొదలవుతోంది. ఆమె పరిచయం.

ఏప్రిల్‌ 26, 2019.
కర్వర్‌ హార్బర్‌. కర్ణాటక.

మరికొన్ని గంటల్లో సముద్రంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐ.ఎన్‌.ఎస్‌. విక్రమాదిత్య తీరానికి చేరుకుంటుంది. నావికాదళ యుద్ధనౌక అది. కాని ఈలోపే దానిలో మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న నావికాదళ అధికారులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇద్దరు ఆఫీసర్లు ఆ పోరాటంలో చనిపోయారు. వారిలో ఒకరు లెఫ్టినెంట్‌ కమాండర్‌ ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌. అప్పటికి అతనికి పెళ్లయ్యి కేవలం నలభై రోజులు. అతని భార్య కరుణ సింగ్‌కు ఆ వార్త అందింది.

అత్తగారింట్లో ఉండగా...
కరుణ సింగ్‌ ఆగ్రాలోని దయాల్‌బాగ్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఒక మేట్రిమొని కాలమ్‌ ద్వారా ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ‘వివాహానికి సంబంధించి నేనూ అందరిలాగే ఎన్నో కలలు కన్నాను’ అన్నారు కరుణ. ధర్మేంద్ర సింగ్‌ది మధ్యప్రదేశ్‌లోని కర్తాల్‌. ‘ఆయన మరణవార్త నాకు చేరేసరికి నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. నేను నా పదవ తరగతిలోపే మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు పెళ్లయిన వెంటనే భర్తను కోల్పోయాను. దేవుడు నా జీవితం నుంచి ఏదైనా ఆశించే ఈ పరీక్షలు పెడుతున్నాడా అనిపించింది’ అన్నారు కరుణ.

స్త్రీలే బలం
‘నా భర్త మరణవార్త విని నేను కొన్ని రోజులు దిగ్భ్రమలో ఉండిపోయాను. అయితే మా అత్తగారు టీనా కున్వర్, మా అమ్మ కృష్ణా సింగ్‌ నాకు ధైర్యం చెప్పారు. చెట్టంత కొడుకును కోల్పోయిన మా అత్తగారు, కూతురి అవస్థను చూస్తున్న మా అమ్మ... ఇద్దరూ ధైర్యం కూడగట్టుకుని నాకు ధైర్యం చెప్పారు. ఈ ఇంటికి గాని ఆ ఇంటికి గాని నేనే ఇప్పుడు ముఖ్య సభ్యురాలిని అని అర్థమైంది. ఇరు కుటుంబాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండిపోయాను’ అన్నారు కరుణ సింగ్‌.

ఆర్మీలో చేరిక
‘అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నాకు మంచి ఉద్యోగం ఉంది. కాని నా భర్త మరణం తర్వాత అతని స్ఫూర్తిని సజీవంగా ఉంచాలని నాకు అనిపించింది. దేశమంతా తిరుగుతూ దేశానికి సేవ చేయాలని అనుకున్నాను.
నేవీలో పని చేసే అధికారులు నన్ను నేవీలో చేరమన్నారు. కాని నేను ఆర్మీని ఎంచుకున్నాను. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ పరీక్షకు హాజరవుదామనుకున్నాను. అయితే సైనిక వితంతువులకు రిటర్న్‌ టెస్ట్‌ ఉండదు. నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఐదు రోజుల పాటు వివిధ దశల్లో ఇంటర్వ్యూ సాగుతుంది.

నేను సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కాని మొదటి రోజునే పంపించేశారు. తిరిగి అక్టోబర్‌లో హాజరయ్యి ఫిజికల్‌ టెస్ట్‌లలో పాసయ్యాను. ఆ తర్వాత మౌఖిక ఇంటర్వ్యూ సుదీర్ఘంగా సాగింది. నాకు మంచి ఉద్యోగం ఉన్నా ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నానో అడిగారు. నాకు దేశసేవ చేయాలనుందని చెప్పాను. ఎంపికయ్యాను. ఆఫీసర్‌గా చెన్నైలో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో జనవరి నుంచి నా ట్రైనింగ్‌ మొదలయ్యి 11 నెలలు సాగుతుంది’ అని చెప్పారు కరుణ.
ఆమె దేశం కోసం పని చేసే గొప్ప సైనిక అధికారి కావాలని కోరుకుందాం.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement