
ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇన్‌సెట్లో డీఎస్ చౌహన్ (ఫైల్ ఫొటో)
మంటలను అదుపుచేసే క్రమంలో లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బెంగుళూరు : భారత దేశ ఏకైక యుద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ నేవీ అధికారి మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని కార్వార్ ఓడరేవుకు శుక్రవారం ఉదయం ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య చేరుకునే సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, మంటలను అదుపుచేసే క్రమంలో లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కార్వార్‌లోని నేవీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
మంటలు చెలరేగకుండా..వాహక నౌక ఫైర్ సిబ్బంది అదుపుచేసినప్పటికీ దట్టమైన పోగ వల్ల ఊపిరాడకపోవడంతో చౌహన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. కాగా, వెంటనే సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో భారీ నష్టం తప్పింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య జనవరి 2014లో భారత నౌకాదళంలో చేరింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 60 మీ పోడవు, 284 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల ఎత్తుతో 44,500 టన్నుల బరువు కలిగి ఉంటుంది. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు సొంతం.