ssbn college
-
చాంప్స్ శాతవాహన, ఎస్ఎస్బీఎన్ కాలేజి జట్లు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్స్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం)... సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (అనంతపురం) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. జూనియర్ విభాగం ఫైనల్లో శాతవాహన కాలేజి రెండు వికెట్ల తేడాతో ఎమరాల్డ్స్ జూనియర్ కాలేజి (తిరుపతి, చిత్తూరు) జట్టుపై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎమరాల్డ్స్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ప్రణయ్ (33 పరుగులు), గగన్ (15 పరుగులు) రాణించారు. శాతవాహన కాలేజి బౌలర్ ఉదయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాతవాహన కాలేజి 9.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి విజయం సాధించింది. వాసు (19), ఉదయ్ (18), సోమేశ్ (28 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఉదయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎమరాల్డ్స్ కాలేజి 20 పరుగుల ఆధిక్యంతో చీరాల పాలిటెక్నిక్ కాలేజి (ప్రకాశం) జట్టును ఓడించి ఫైనల్ చేరింది. తొలుత ఎమరాల్డ్స్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. సోహన్ (47), గగన్ (28) దూకుడగా ఆడారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చీరాల పాలిటెక్నిక్ కాలేజీ జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో చీరాల పాలిటెక్నిక్ కాలేజి మూడో స్థానంలో నిలిచింది. ఖాదర్ వలీ విజృంభణ సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (ఎస్ఎస్బీఎన్–అనంతపురం), కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కాలేజి (నెల్లూరు) జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పద్ధతిలో ఫైనల్స్ నిర్వహించారు. గురువారం చెరో మ్యాచ్‌లో నెగ్గి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్ల తేడాతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజిపై విజయం సాధించి ఓవరాల్‌గా 2–1తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణ చైతన్య కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. ఫారూఖ్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఎస్బీఎన్ కాలేజి బౌలర్ ఖాదర్ వలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 73 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఎస్బీఎన్ కాలేజి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అధిగమించి గెలిచింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన ఖాదర్ వలీ బ్యాటింగ్‌లోనూ రాణించి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ రోహిత్ రోషన్ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఖాదర్ వలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విజేత జట్లకు కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైవీఎస్‌ఎస్‌ఎస్‌యూ ప్రసాద రావు, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ఎం.రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ సింహాద్రి అప్పన్న, హెచ్ఆర్ సంతోష్, ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీహరి పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో ఉదయ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... గగన్ ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... సోహన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఉదయ్ ‘బెస్ట్ బౌలర్’ అవార్డులు గెల్చుకున్నారు. సీనియర్స్ విభాగంలో ఎస్ఎస్బీఎన్ కాలేజికి చెందిన ఖాదర్ వలీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... మహేంద్ర ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... రోహిత్ రోషన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఖాదర్ వలీ ‘బెస్ట్ బౌలర్’ పురస్కారాలు అందుకున్నారు. సీనియర్స్ విభాగంలో విజేతగా నిలిచిన ఎస్ఎస్బీఎన్ కాలేజి (అనంతపురం) జట్టు -
ఉత్సాహంగా యువజనోత్సవాలు
అనంతపురం కల్చరల్ : ఎస్ఎస్బీఎన్ కళాశాలలో సాగుతున్న యువజనోత్సవాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. వందల సంఖ్యలో యువతీయువకులు వివిధ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. క్రీడా, సాంస్కృతిక పోటీలను యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం, ఎస్ఎస్బీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నాగత్రిశూలపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు డా.రమణ, డా.దేవసేన, ఆన్సెట్ శ్రీనివాసులు, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం కూడా పోటీలు కొనసాగుతాయని దేశ సంస్కృతికి సంబంధించిన ఫోక్‌డాన్స్, ఫోక్ సాంగ్ సోలో, గ్రూపు పోటీలు, ఫ్యాన్సీడ్రస్ కాంపిటీషన్, జిల్లా ప్రాముఖ్యతను తెలిపే ఫోటోగ్రఫీ పోటీలుంటాయన్నారు. -
18న ‘ఇస్రో’ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట కేంద్రం వారు 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈనెల 18న ఉదయం 9 గంటలకు స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నారు. భారతీయ అంతరిక్ష విషయంగా 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అక్టోబర్ 4,5 తేదీల్లో ‘ఇస్రో’ వారు బహుమతులు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 17లోగా ఎస్ఎస్బీఎన్ కళాశాల ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. చంద్రశేఖర్‌రెడ్డి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 94402 47699 నంబర్లో సంప్రదించాలి. -
హై ‘అలర్ట్’
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టినిఘా అధికారులు, సిబ్బంది నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవ్ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’పై సిబ్బందితో సమీక్షించిన ఎస్పీ సెంథిల్‌కుమార్ అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి...సమస్యలు సృష్టించే వారిని గుర్తించాలి...అల్లర్లకు తావివ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎవరు తోక జాడించినా తక్షణం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ వారిని అదుపులోకి తీసుకోవాలి’ అంటూ పోలీసు సిబ్బందికి ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలు చేశారు. నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో శనివారం జిల్లా వ్యాఫ్తంగా ఉన్న సిబ్బందితో ఆయన ‘ఎన్నికల నియమావళి’పై సమీక్షించారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ఎస్పీ ఇంకా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అధికారుల విధులు.. సబ్ డివిజన్, సర్కిల్స్ పరిధిలోని సిబ్బం దిపై పర్యవేక్షణ కలిగివుండాలి. సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషిస్తూ ఉండాలి. వీలైనన్ని సమస్యాత్మక గ్రామాలు, వార్డులు సందర్శించాలి. కిందిస్థాయి సిబ్బంది అన్ని గ్రామాలు, వార్డులపై పట్టు సాధి స్తూ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు సమయ స్ఫూర్తితో వ్యవహరించాలి. పోలింగ్‌స్టేషన్, బూత్‌లు పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుండాలి. అత్యంత ప్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎస్డీపీఓలు ఆయా సబ్-డివిజన్లలోని అన్ని రాజకీ య పార్టీ నాయకులతో సమన్వయంగా వ్యవహరించాలి. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో గ్రామాలు, వార్డులలో ఆకస్మిక తనిఖీలు సిబ్బంది పనితీరును అంచనా వేస్తుండాలి. ప్రతి ఉదయం డీఎస్పీలు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్ధితులను సమీక్షిస్తుండాలి. ఎన్నికల శాంతియుతంగా, సజావుగా సాగడానికి తాము తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేస్తుండాలి. పోలింగ్ రోజు ఇలా ఉండాలి.. ప్రతి ఓటరు ఓటరు ఐడెంటిటీ కార్డును తప్పని సరిగా తెచ్చుకునేలా అవగాహన పెంచాలి. పోలింగ్‌బూత్‌కు 200 మీటర్ల లోపల ఏ పార్టీకి చెందిన వారైనా ఓటరు స్లిప్పుల పంపిణీ, ఆహార పొట్లాల పంపిణీ శిబిరాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కేంద్రాల వద్ద క్యూ పద్ధతి పాటించేలా చూడాలి. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు ఘర్షణ పడకుండ ముందస్తు హెచ్చరికలు చేయాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు వహించాలి. ప్రతి వ్యక్తినీ తనిఖీ చేసి పోలింగ్‌బూత్‌లోకి అనుమతించాలి. పోలింగ్ కేంద్రంల్లోకి అగ్గిపెట్టెలు, సిజర్లైట్లు ఇంకు, నీళ్ల బాటిళ్లు, తినబండారాలు, పేలుడు పదార్ధాలను అనుమతించరాదు. పోలింగ్ సామగ్రికి ఎటువంటి నష్టం రాకుండా చూడాలి. వాహనాల కదిలకలను నియంత్రించాలి. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగితే పై అధికారులకు తెలియజేసి, పోలింగ్ అధికారులతో సంప్రదించి సకాలంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు సిబ్బంది ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆవేశానికి లోనుకారాదు. అభ్యర్ధులతోపాటు వచ్చిన గన్మెన్లను, అనుమతి లేని వ్యక్తులను కేంద్రాలలోకి అనుమతించరాదు. అభ్యర్ధులు వారి అనుచరులు చూపే ప్రలోభాలకు లొంగకుండా సిబ్బంది ఎన్నికల డ్యూటీని చిత్తశుధ్ధితో, కర్తవ్య దీక్షతో నిర్వహించాలి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మి షన్, బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేం ద్రాలకు భద్రంగా చేరవేయాలి. సమీక్ష స మావేశంలో డీఎస్పీ నాగరాజు, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ సీఐలు మాదవ్, మన్సూరుద్దీన్, దేవానంద్, ఎస్ఐలు వి శ్వనాథచౌదరి, సుబ్బరాయుడు, శంకర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రం వద్ద యువతిపై కత్తితో దాడి
అనంతపురం, న్యూస్‌లైన్: తనతో స్నేహంగా ఉన్న యువతి, మరో వ్యక్తిని వివాహం చేసుకుందని ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈసంఘటన అనంతపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సునీల్ రెడ్డి, నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన యువతి స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో స్నేహంగా ఉండేవారు. అనంతరం ఉన్నత చదువుల కోసం సునీల్ వైఎస్సార్ జిల్లా యోగివేమన యూనివర్సిటీలో చేరగా, ఆ యువతి స్థానిక ఎస్వీ పీజీ కళాశాలలో చేరింది. సునీల్ ఆదివారం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో ఏపీసెట్ పరీక్షలు రాస్తూ అదే గదిలో ఆ యువతిని చూశాడు. ఆమెకు వివాహమైనట్లు గుర్తించాడు.పరీక్ష రాసి కళాశాల ఆవరణలో ఉన్న యువతి వద్దకు వెళ్లి, తనను మోసం చేసి, మరొకరిని వివాహం చేసుకుంటావా? అంటూ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఆమె ప్రాణ భయంతో కళాశాల ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటోలో వెళ్లిపోయింది. దాడి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన సనీల్‌రెడ్డి కక్కలపల్లి క్రాస్ సమీపంలోని ఓ తోటలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.