st andrews school
-
తల్లిదండ్రులపై పోలీసులే కేసు పెట్టారు
సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాల ఎదుట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశమయ్యారనే అభియోగంతో బోయిన్పల్లి పోలీసులే విద్యార్థుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని పాఠశాల విద్య డైరెక్టర్ ఎ.శ్రీదేవసేన హైకోర్టుకు నివేదించారు. పాఠశాల యాజమాన్యం కానీ, పేరెంట్స్ అసోసియేషన్ కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఆండ్రూస్ పాఠశాలలో గతేడాది ఉన్న ట్యూషన్ ఫీజులనే నెలవారీ పద్ధతిలో తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆండ్రూస్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శ్రీదేవసేన శుక్రవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ‘కేంద్ర మార్గదర్శకాలు, ప్రజ్ఞా నిబంధనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాం. ఫీజులు పెంచరాదని, నెలవారీగా మాత్రమే ఫీజులు తీసుకోవాలని సీబీఎస్సీ, ఐసీఎస్సీ పాఠశాలలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రైవేటు పాఠ శాలలు ఫీజులు అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డీఈవోలను పాఠశాల విద్య కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు. జీవో 46కు విరుద్ధంగా వ్యవహరించిన 55 పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. ఆయా స్కూళ్లకు షోకాజ్ నోటీసులిచ్చాం. వీటిలో 47 పాఠశాలలు తమ వివరణను సమర్పించాయి. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. వారిచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్న బేగంపేట గీతాంజలి పాఠశాలను ఈ నెల 7న సందర్శించాం. ఇంకా చెల్లించాల్సిన ఫీజులో ఎక్కువగా తీసుకున్న ఫీజును మినహాయిస్తామని గీతాంజలి యాజమాన్యం హామీనిచ్చింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కూడా నెలవారీగా ట్యూషన్ ఫీజు తీసుకునేందుకు అంగీకరించింది. నీరజ్, వాసవీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్స్ ఇచ్చిన వినతిపత్రాలు జీవో 46 ఉల్లంఘించినవి కావు. ఫీజులు తగ్గించాలని కోరినవే..’అని శ్రీదేవసేన నివేదికలో పేర్కొన్నారు. ఇటు ఆన్లైన్ క్లాసుల నిర్వహించకుండా, ప్రైవేటు పాఠశాలలు జీవో 46కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై తమ కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల గడువు కావాలని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన కోర్టు విచారణను వాయిదా వేసింది. -
సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సచ్దేవ్ స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు పెనాల్టీ షూటవుట్ ద్వారా 2-1 స్కోరుతో రామకృష్ణపురానికి చెందిన భవాన్స్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు తరఫున ప్రద్యుమ్న, భరత్ కీలకమైన గోల్స్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. భవాన్స్ కాలేజి జట్టులో మయూర్ గోల్ చేశాడు. ఈ టోర్నీలో బెస్ట్ గోల్ కీపర్‌గా విష్రుత్, బెస్ట్ డిఫెండర్‌గా నరేష్ (సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్), బెస్ట్ మిడ్ ఫీల్డర్‌గా సాయిరామ్ (భవాన్స్ స్కూల్), బెస్ట్ స్ట్రయికర్‌గా కిరణ్(గవర్నమెంట్ హైస్కూల్, లాల్‌బజార్) అవార్డులు అందుకున్నారు. -
నిప్పులు చెరిగిన రిషబ్
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ ఆండ్రూస్ బౌలర్లు రిషబ్ (5/80), అలంకృత్ (3/14) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ 131 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. సంపత్ (74), సిద్ధార్థ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... వైష్ణవ్ (47) మెరుగ్గా ఆడాడు. అన ంతరం బరిలోకి దిగిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 108 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యూష్ (53) మినహా మిగతావారు చేతులెత్తేశారు. మరో మ్యచ్‌లో మెదక్ వికెట్ తేడాతో సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్‌పై గెలుపొందింది. మొదట సెయింట్ మార్క్స్ 107 పరుగుల వద్ద ఆలౌటైంది. మెదక్ బౌలర్ అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత మెదక్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సెయింట్ మార్క్స్ బౌలర్ కపిల్ వ్యాస్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కాల్ పబ్లిక్ స్కూల్: 210/3 (పి.సిద్ధార్థ్ 51, సూర్యతేజ 52, సాత్విక్ 46); కరీంనగర్: 213/5 (రిత్విక్ సూర్య 63, రోహన్ 55 నాటౌట్). ఎ-డివిజన్ వన్డే లీగ్ ఎలిగెంట్: 182/9 (తౌసిఫ్ ఖాన్ 66, మాజిద్ 48; ధీరజ్ 4/47); కన్స్ల్ట్: 120 (మహీందర్ 50; అజయ్ రెడ్డి 7/46). -
వైష్ణవ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: వైష్ణవ్ రెడ్డి (101 నాటౌట్) అజేయ సెంచరీతో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ హెచ్‌సీఏ అండర్-16 నాకౌట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆండ్రూస్ జట్టు 33 పరుగుల తేడాతో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ ఆండ్రూస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్ వైష్ణవ్ రెడ్డి మెరుపులు మెరిపించాడు. సంపత్ 29, జగదీశ్ రెడ్డి 26 పరుగులు చేశారు. శ్రీచైతన్య జట్టు బౌలర్లలో ఆశిష్, రేవంత్, సంహిత్, గౌరవ్ రెడ్డి, ఆశిష్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ చైతన్య జట్టు 47.5 ఓవర్లలో 184 పరుగులు చేసి ఆలౌటైంది. రేవంత్ (39), గౌరవ్ (31) ఫర్వాలేద నిపించగా, ప్రతీక్ రెడ్డి 27, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి 21 పరుగులు చేశారు. ఆండ్రూస్ బౌలర్లలో రిషబ్ 3, సంకేత్ 2, వైష్ణవ్, ఆదిత్య చెరో వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్ స్కోర్లు: సెయింట్ జోసెఫ్ స్కూల్: 230/4 (ప్రత్యూష్ 147 నాటౌట్, ఖాజా పాషా 30), కరీంనగర్: 233/5 (అజయ్ రెడ్డి 57, శ్రీకిరణ్ 71). -
సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 4-3 స్కోరుతో పెనాల్టీ షూటవుట్ ద్వారా సెయింట్ మైకేల్ స్కూల్ జట్టుపై ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటవుట్‌లో బి.భరత్ గోల్ చేశాడు. నిర్ణీత సమయం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్, సెయింట్ మైకేల్ స్కూల్ జట్ల ఆటగాళ్లు స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో టైబ్రేకర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3-3 వద్ద సమమైంది. దీంతో పెనాల్టీ షూటవుట్‌లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు తరఫున జీవన్, గులామ్ హుస్సేన్, అభిషేక్, భరత్ తలా ఓ గోల్స్ చేశారు. సెయింట్ మైకేల్ స్కూల్ జట్టులో మోహిత్, హర్షిత్, అనుమాల్ గోల్స్ చేశారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పల్లవి మోడల్ స్కూల్ జట్టు 3-2తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 3-0తో పల్లవి మోడల్ స్కూల్ జట్టుపై, సెయింట్ మైకేల్ స్కూల్ జట్టు1-0తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై గెలిచింది. ఈటోర్నీలో మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విష్రుద్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్) గెలుచుకోగా, మాన్ ఆఫ్ ది టోర్నీ నరేష్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్)లు గెలుచుకున్నాడు. ముగింపు వేడుకలకు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. రఫత్ అలీ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి ఫల్గుణ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.