సవాల్.. ప్రతి సవాల్
సిద్ధు, కుమార మధ్య మాటల యుద్ధం
గెజిటెడ్ ప్రొబేషనరీ అభ్యర్థులకు కుమార సంఘీభావం
నిపుణుల సలహా మేరకే నిర్ణయం : సీఎం సిద్ధు
బహిరంగ చర్చకు తాను సిద్ధమే : కుమార
సాక్షి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011 గెజిటెడ్ ప్రొబేషనరీ పోస్టుల రద్దు విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి మధ్య మాటల యుద్ధం మొదలైంది. బహిరంగ చర్చకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ వైద్య విద్యా కళాశాలలో శనివారం జరిగిన స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.
కేపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. అందువల్లే న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రభుత్వం పోస్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు సాధ్యమైతే ఇతనికి సహాయం చేయండి అని చెప్పడం సాధారణం. ఈ క్రమంలోనే గతంలో నేను ఒకరిద్దరికి సిఫార్సు లేఖలు ఇచ్చిన మాట వాస్తవం.
అంత మాత్రాన లంచం తీసుకుని సదరు అభ్యర్థులకు సహాయం చేయమని చెప్పలేదు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకునే కేపీఎస్సీ సభ్యులు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ విషయంతో పాటు కేపీఎస్సీ అక్రమాలకు సంబంధించి ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సిద్ధరామయ్య తెలిపారు. ఇక పై అక్రమాలకు తావులేకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రమాణాలను కేపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పాటిస్తామన్నారు. 2011 అక్రమాలు బయటికి రావడానికి డాక్టర్ మైత్రీ అనే అభ్యర్థి ప్రధాన కారణమని ఆమెను అభినందిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
చట్టసభల్లో చర్చించడానికైనా సిద్ధమే: కుమారస్వామి
2011 కేపీఎస్సీ పరీక్షలకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలను కుమారస్వామి స్వాగతించారు. ఈ విషయంలో తాను కూడా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అవ సరమైతే ఈ విషయంపై చట్టసభల్లో కూడా తాను చర్చించడానికి సిద్ధమన్నారు. ఫ్రీడం పార్కులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేస్తున్న అభ్యర్థులను పరమార్శించడానికి శనివారం వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. కేపీఎస్సీ 1998 నుంచి 2011 వరకూ నిర్వహించిన పరీక్షలన్నింటిపై దర్యాప్తు జరిపించాలన్నారు. అప్పుడు మాత్రమే పూర్తి నిజాలు బయటికి వస్తాయని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కుమారస్వామి డిమాండ్ చేశారు.