రాష్ట్రవ్యాప్తంగా రేషన్ ‘పోర్టబిలిటీ’
- ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు
- ఆధార్ అనుసంధానం తర్వాత రాష్ట్రమంతా అమలు
సాక్షి, హైదరాబాద్: రేషన్ వినియోగదారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. తమకు కేటాయించిన రేషన్ దుకాణంలోనే కాకుండా, ఎక్కడ వీల యితే అక్కడ రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ‘రేషన్ పోర్టబిలిటీ’ విధానంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ పోర్టబిలిటీ విధానం అమల్లోకి రాగా, ఇప్పటివరకు సుమారు 70 వేల లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయిం చారు. రెండు నెలల్లోగా రేషన్ పోర్టబిలిటీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సివిల్ సప్లైస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానాన్ని వేగవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ–పాస్ అమలులో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ సాధ్యమవుతుందని, దీంతో ఈ–పాస్‌లో వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయడమేనని అంటున్నారు.
శరవేగంగా ఈ–పాస్: రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ యంత్రాలను అమర్చే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాలను వినియోగించడం వల్ల 14 నెలల కాలంలో రూ.280 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్‌ను అమలు చేస్తే ఏటా రూ.800 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకా ణాలను ఈ–పాస్ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తికాగా, ఈ జిల్లాలోని 800 రేషన్ దుకాణల పరిధిలో రూ.3.39 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముగింపు దశలో ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో 2 నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో యంత్రాలను అమర్చే పని పూర్తవుతుందని అధికార వర్గాల సమాచారం.
ఈ–పాస్‌తో అక్రమాలకు చెక్
ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాక రేషన్ అక్రమాలకు తెరపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణల్లో ఈ–పాస్ యంత్రాలు వేలిముద్రలపై ఆధారపడినవి కాగా, కొత్త యంత్రాల్లో ఐరిష్ ఏర్పాట్లు చేశారు. వేలిముద్రల వల్ల కూడా అక్రమాలకు అవకాశం ఏర్పడిందని, వేలిముద్రలు అరిగిపోయిన వినియోగదారులు సరుకులు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్లకు అవకాశం కల్పించారు. దీంతో ఇది దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ఈ కారణంగానే కొత్త ఈ–పాస్ యంత్రాల్లో ఐరిష్ సౌకర్యం కల్పించారు. కొత్త ఈ–పాస్ అమలులోకి వచ్చిన వెంటనే ‘రేషన్ పోర్టబిలిటీ’ అందుబాటులోకి వస్తుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు చెప్పాయి.