ఎన్నికల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల వాహనాల న్నింటికీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలు అమర్చాలని అన్నారు. ఈ పరికరా లన్నింటినీ పరిశీలించడానికి ఉమ్మడి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, అనుమానిత బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల ద్వారా జరిగే లావాదేవీలు, నగదు బదిలీలపై నిఘాను మరింత కట్టు దిట్టం చేయాలని పేర్కొన్నారు.
బంగారు తనఖా రుణాల వేలం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవా సంస్థల ఖాతాలపైనా నిఘా పెట్టాలని చెప్పారు. రహస్య సమాచార సేకరణ వ్యూహాలు, మత్తుపానీయాల తయారీ, అమ్మ కాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇలా ఎన్నికల్లో వీటన్నింటిపై పక్కా నిఘా ఉంటే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో కళ్లెం వేసే వీలుం టుందని ఆయన అన్నారు.