పోలీసు అధికారుల విభజన ఏకపక్షమేల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు కావస్తోంది. అన్ని విభాగాల్లో అధికారుల విభజన పూర్తయినా పోలీస్ అధికారుల విభజన మాత్రం పెండింగ్‌లోనే ఉంది. దీనికి ప్రధానకారణం సీనియారిటీ సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఎస్ఐలు, డీఎస్పీల సీనియారిటీ జాబితాపై కోర్టుల్లో కేసులుండటంతో సమీక్షించేందుకు సమయం పట్టింది. ఈ సీనియారిటీపై ఏపీ పోలీస్‌శాఖ సమీక్ష నిర్వహించాల్సి ఉండడంతో తెలంగాణ ఉన్నతాధికారులు దీనికి ఎలాంటి పరిష్కారమార్గాలు చూపించే అవకాశం లేకుండాపోయింది. దీనితో తెలంగాణ అధికారుల సీనియారిటీ జాబితాపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండుసార్లు సీనియారిటీ జాబితా సవరించి అభ్యంతరాలు స్వీకరించారు. అయినా, తెలంగాణ అధికారుల సీనియారిటీ సమస్యకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలోనే ఏపీ పోలీస్ శాఖ 2రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు పోలీసులను విభజించాలంటూ ప్రతిపాదిత అధికారుల జాబితానుకేంద్ర శిక్షణ, అంతర్గత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి పంపడం ఇప్పుడు వివాదంగా మారుతోంది.
ఏకపక్షమెందుకు..?
సీనియారిటీ జాబితాను రివ్యూ చేసి, అందులో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిన వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించాల్సిన ఏపీ పోలీస్‌శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలీస్ అధికారులు విభజన, సీనియారిటీ సమస్య పరిష్కారం ఏపీ అధికారుల చేతుల్లో ఉండటంతోనే ఇలా ఏకపక్షంగా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విభజన కాకుండానే కన్ఫర్డ్ జాబితా?
రెండు రాష్ట్రాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ అధికారుల విభజన పూర్తి కాలేనప్పుడు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం కేంద్రానికి ప్రతిపాదన ఎలా పంపారన్న దానిపైనా వివాదం ఏర్పడే అవకాశముంది. రెండు రాష్ట్రాలకు 476 మంది డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల విభజన జరగాలి. కానీ, 3 నెలల క్రితం 10 మంది అధికారులను కన్ఫర్డ్ ఐపీఎస్ కోటా కింద పదోన్నతి కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు ఎలా పంపుతారని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలనుకున్న అధికారులు తెలంగాణలో, తెలంగాణకు రావాల్సిన అధికారులు ఏపీలో ఉండగానే ఇది ఎలా చేశారన్న దానిపై కొంతమంది అధికారులు కోర్టుకెళ్లాలని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 650 మందికి పైగా అధికారులకు అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ, డీఎస్పీ పదోన్నతులు కల్పించారు. సీనియారిటీ సమస్య పరిష్కారం కాకుండా అడ్çహాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం కూడా వివాదంగా మారబోతోంది.
మా పరిస్థితి ఏంటి?
ఏపీలో పనిచేస్తున్న తమ బ్యాచ్ అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా, నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందుతుండటంతో తమ పరిస్థితి ఏంటని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16 కన్ఫర్డ్ ఐపీఎస్ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదని, కేంద్ర హోంశాఖ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో పనిచేస్తున్న తమ పేర్లను సీనియారిటీ ప్రకారం డీవోపీటీకి పంపాలని, ఈ ప్యానల్ ఏడాదైనా పదోన్నతి దక్కేలా చూడాలని గ్రూప్ వన్, ప్రమోటీ అధికారులు కోరుతున్నారు.