విభజన ముందుకే సాగనట్లే: లగడపాటి
న్యూఢిల్లీ : విభజన ప్రక్రియ ముందుగు సాగదని కేంద్రం నుంచి హామీ వచ్చిందని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావల్సి ఉందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. సీమాంధ్ర ఎంపీల భేటీ అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ కమిటీపై మరింత సమాచారం సేకరిస్తామని ఆయన తెలిపారు. తమ భేటీలో పార్లమెంట్లో నిరసన తెలిపే అంశంపై చర్చించినట్లు లగడపాటి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని లగడపాటి అన్నారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడుతున్నామని ఆయన తెలిపారు.
సీమాంధ్ర ఉద్యమం రగిలిన నేపథ్యంలో హైకమాండ్ ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నివేదిక వచ్చేదాకా విభజన ప్రక్రియను కొనసాగించేది లేదనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పళ్ళం రాజు నిన్న సోనియాగాంధీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించడం విశేషం.