
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్‌లో రాష్ట్రాల విభజన చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జతగా ఈ సవరణ పిటిషన్‌ను ఉండవల్లి తరఫు న్యాయవాది రమేశ్ అల్లంకి దాఖలు చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
విభజన జరిగి 8 ఏళ్లు పూర్తవుతుండటంతో.. భవిష్యత్‌లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చినా.. వాస్తవ రూపం దాల్చే అవకాశాలు లేకపోవడంతో ఉండవల్లి ఈ పిటిషన్ వేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే దాన్ని ప్రకటించాలని.. భవిష్యత్‌లో ఏదైనా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాటించేందుకు తగిన మార్గదర్శకాలివ్వాలని కోరారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం మద్దతిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు.