సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ అధినేత రామోజీరావు ద్విపాత్రాభినయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని వేర్వేరు సంస్థలకు మళ్లించే క్రమంలో రామోజీ పోషించిన కీలక పాత్రను బహిర్గతం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి సుప్రీం కోర్టులో తాజాగా అదనపు డాక్యుమెంట్‌ను దాఖలు చేశారు.
డిపాజిట్లు స్వీకరించే క్రమంలో కర్త ఆఫ్ హెచ్‌యూఎఫ్ కర్తగా, చెల్లించే సమయంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రొప్రయిటర్‌గా సంతకాలు చేసిన పత్రాలను కోర్టుకు సమర్పించారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం.. ఒక చోట హెచ్‌యూఎఫ్‌గా, మరో చోట ప్రొప్రయిటర్‌గా క్లెయిమ్ చేసుకున్నారేమిటి అని రామోజీరావు తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించిన విషయం విదితమే.
ఉండవల్లి అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలు ఇలా..
1990 తొలినాళ్లలో నా కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, స్నేహితులు వారు సంపాదించిన సొమ్మును మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో పెట్టుబడి పెట్టారు. బలమైన కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా కుటుంబ సభ్యులు రామోజీరావుకు చెందిన మార్గదర్శిలో ఇన్వెస్ట్ చేశారు. మీడియా, వ్యాపారం అనుసంధానం చేయబోరని భావించనందువల్లే ఇలా చేశారు. 16 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు డిపాజిట్లు రెన్యువల్ చేస్తూనే ఉన్నారు.
అయితే, 2006లో మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్లు రూ.లక్ష కన్నా తక్కువ ఉన్నాయని రెన్యువల్ చేయలేదు. దీనికి సంబంధించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ జారీ చేసిన డిపాజిట్ బాండ్‌లలో హెచ్‌యూఎఫ్ కర్త హోదాలో, చెక్‌పైన మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపున ప్రొప్రయిటర్‌గా రామోజీరావు సంతకం చేయడం గమనించాను. ఇదే విషయాన్ని సహచర న్యాయవాద స్నేహితులు, ఆడిటర్లతో చర్చించా.
ఆర్‌బీఐ యాక్టు, 1934 సెక్షన్ 45ఎస్ ప్రకారం 1997 తర్వాత ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట ప్రకారం శిక్షార్హమైనదని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలు ఉల్లంఘించిందని వారు తెలిపారు. రామోజీరావు లాంటి వ్యక్తి అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారంటే నమ్మలేకపోయా. ఆంధ్రప్రదేశ్‌లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల అక్రమాలను బహిర్గతం చేయడంలో ఈనాడు సహా పలు పత్రికలు కీలకపాత్ర పోషించాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌లో రిజిస్టర్ అయ్యేవి.
బ్యాంకింగ్ వ్యాపారానికి ఆర్‌బీఐ నుంచి లైసెన్సు పొందేవి. వాటిలో అక్రమాలపై ఈనాడు సహా పలుపత్రికలు కథనాలు ప్రచురించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల మొత్తం డిపాజిట్ల విలువ రూ.630 కోట్లు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ది పూర్తిగా చట్ట విరుద్ధమైన వ్యాపారం. ఆర్‌బీఐలో రిజిస్టర్ కాలేదు. ఏపీ ప్రభుత్వంలో రిజిస్టర్ కాలేదు. దేశంలో ఎక్కడా రిజిస్టర్ కాలేదు. అన్ ఇన్‌కార్పొరేటెడ్ బాడీగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై 1997 నుంచి ఎవరి నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా నిషేధం కూడా ఉంది.
ఆ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు స్వీకరించినందున రెండేళ్ల వరకు జైలు శిక్షకు అర్హులు. 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల డిపాజిట్లు మొత్తం రూ.630 కోట్లు అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఒక్కటే చట్ట విరుద్ధంగా సుమారు 2.75 లక్షల మంది నుంచి రూ. 2,600 కోట్లు సేకరించింది. 2006 మార్చి 31 నాటికి రూ.1,400 కోట్లు నష్టం కాగా, ఏడాది తర్వాత రామోజీరావు హెచ్‌యూఎఫ్ మొత్తం నష్టం రూ.1,800 కోట్లకు చేరుకుంది. ఈ నష్టాలు కేవలం సాంకేతిక నష్టాలు మాత్రమేనని రామోజీరావు వివరించడానికి ప్రయత్నించారు.
అయితే, చాలా మంది ఆర్థిక నిపుణులు సాంకేతిక నష్టాలు అంటే అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక స్థితి ఏ వార్తాపత్రికలోనూ ప్రచురించలేదు. లేదా డిపాజిటర్లు ఎవరికీ పంపిణీ చేయలేదు. వ్యాపారమంతా గుట్టుగా సాగిపోయింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరు వెబ్‌సైట్‌లో ఎప్పుడూ కనిపించలేదు. ఆశ్చర్యకరంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు ఉద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ విభాగం ద్వారా డిపాజిట్లు సేకరిస్తున్నారనే అభిప్రాయం కలిగించడానికి కనీసం సైన్ బోర్డులు కూడా ఉంచలేదు.
ఈ విషయంపై 2006 నవంబరు 6న ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశాను. డిపాజిటర్ల ప్రయోజనాల రీత్యా తగిన చర్యల కోసం ఆ కా>పీని అప్పటి ఏపీ సీఎంకు పంపించాను. అయితే, రామోజీరావు తాను చేస్తున్న భారీ అక్రమ వ్యాపారానికి క్షమాపణ చెప్పడానికి బదులు పత్రికా స్వేచ్ఛ మసుగులో బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే రాజకీయ నాయకులందరూ వాస్తవాలు, గణాంకాలు ధ్రువీకరించకుండానే రామోజీరావుకు మద్దతు తెలిపారు.
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నించారు. చట్టం నుంచి తప్పించుకొనేందుకు ఒకరికి సహకరిస్తున్నామని వారందరూ మర్చిపోయారు. నా ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2006 నవంబరు 6న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించింది. ఆ కమిటీకి రామోజీరావు సమాచారం ఇవ్వలేదు. పైగా, కమిటీ నియామకాన్ని సవాల్ చేశారు. హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
కమిటీకి సహకరించడానికి రామోజీరావు నిరాకరిస్తున్నందున జుడిషియల్ మేజిస్ట్రేట్ నిర్దిష్ట ఆదేశాలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆవరణలో ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. దురదృష్టవశాత్తు ఎల్‌కే అడ్వాణీ, నరేంద్రమోదీ, జయలలిత, ములాయం సింగ్ యాదవ్, కులదీప్ నయ్యర్, ఎడిటర్ ఎన్. రామ్ వంటి పెద్దలంతా ప్రభుత్వం చేస్తున్న సోదాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. పత్రికల్లో ఎడిటోరియల్స్ కూడా రాశారు.
పార్లమెంటులో, ఇతర ప్రాంతాల్లో నా సహచరులతో మాట్లాడుతున్నప్పుడు సమస్యపై విస్తత ప్రచారం జరిగినా సమాజంలో ఇంకా గందరగోళంగానే ఉన్న విషయాన్ని గ్రహించాను. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించడానికి వీలుగా అన్ని పత్రాలు కోర్టుకు సమర్పిస్తున్నాను’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అదనపు డాక్యుమెంటులో పేర్కొన్నారు.
కోర్టుకు పలు పత్రాలు సమర్పించిన ఉండవల్లి
తన తల్లి వి. లక్ష్మి సుబ్బారావు చేసిన డిపాజిట్లు, చెల్లింపు నిమిత్తం అందించిన చెక్కులను కూడా ఉండవల్లి అరుణ్‌కుమార్ పొందుపరిచారు. మార్గదర్శి రిజిస్టర్ హోల్డర్లయిన వి.లక్ష్మి సుబ్బారావు.. మీ నుంచి రూ.84,324 డిపాజిట్‌గా స్వీకరిస్తున్నామని 2006 మార్చి 23న కర్త ఆఫ్ హెచ్‌యూఎఫ్‌గా రామోజీరావు సంతకం చేసిన పత్రం, వి.లక్ష్మి సుబ్బారావు పేరిట 2006 నవంబర్ 3న మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రొప్రయిటర్‌గా రామోజీరావు సంతకం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ చెక్కును కూడా అదనపు డాక్యుమెంటుతో పొందుపరిచారు. నాటి ఆర్థిక మంత్రి చిదంబరానికి రాసిన లేఖ, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటు, వ్యాపారం తదితర వివరాలు, బ్యాలెన్స్ షీట్లు, డిపాజిట్లు సేకరించొద్దని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు.
రామోజీ డబుల్ రోల్
Published Thu, Apr 27 2023 3:45 AM | Last Updated on Thu, Apr 27 2023 3:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment