state home ministry
-
పరిపూర్ణానంద బహిష్కరణ రికార్డులు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ జరిపారు. పరిపూర్ణానంద తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసే అధికారం ఈ ముగ్గురు పోలీసు కమిషనర్లకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం కింద పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేశారని, ఈ చట్టాన్ని కేవలం గూండాలపై, తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారని కోర్టుకు నివేదించారు. అటువంటి చట్టం కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడమంటే అతని హక్కులను హరించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పరిపూర్ణానంద విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్పారు. పరిపూర్ణానంద కోరిక మేరకే ఆయనను కాకినాడ తీసుకెళ్లామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. -
‘పరుగు’న రానున్న రాజీవ్ త్రివేది
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు రాజీవ్ త్రివేది... సీనియర్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పేట్లబురుజులోని నగర సాయుధ విభాగం కార్యాలయంలో జరగనున్న ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు పరుగు, ఈత, సైక్లింగ్, మారథాన్ల ద్వారా సుదూరాలను చేరుకుని రికార్డులు నెలకొల్పిన ఆయన.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనిలో పాల్గొనేందుకు నేటి ఉదయం 6 గంటలకు జూబ్లీహిల్స్ పరిధిలోని ప్లజెంట్ వ్యాలీలో తన క్వార్టర్స్ నుంచి బయలుదేరతారు. మొత్తం 16 కిలోమీటర్ల దూరాన్ని తన పరిగెడుతూ రానున్నారు. రోజూ ఉదయం రన్నింగ్ చేసే అలవాటున్న ఆయన బుధవారం నాటి రన్నింగ్‌ను ఇలా పూర్తి చేయనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, మదీనా చౌరస్తా మీదుగా ఆయన పరుగు సాగనుంది. -
జైళ్ల శాఖలో సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: జైళ్ల శాఖలోని 569 మంది కొత్త వార్డర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వార్డర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్ల వార్డరను జోన్ల వారిగా గాక, రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు చేసేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో వారు నివసించే ప్రాంతాల నుంచి సుదూర ప్రాం తాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు.. వార్డర్లకు సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. హోంశాఖ దీనికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 569 మంది వార్డర్లకు (ఇందులో 34మంది మహిళలు) సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నామని జైళ్ల శాఖ ఐజీ సునీల్ కుమార్ తెలిపారు.