
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ జరిపారు. పరిపూర్ణానంద తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసే అధికారం ఈ ముగ్గురు పోలీసు కమిషనర్లకు లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం కింద పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు వేశారని, ఈ చట్టాన్ని కేవలం గూండాలపై, తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారని కోర్టుకు నివేదించారు. అటువంటి చట్టం కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడమంటే అతని హక్కులను హరించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పరిపూర్ణానంద విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్పారు. పరిపూర్ణానంద కోరిక మేరకే ఆయనను కాకినాడ తీసుకెళ్లామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి బహిష్కరణకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.